26
ద్వారపాలకులు
1 కోరహు వంశం నుండి వచ్చిన ద్వారపాలకుల జట్టులు ఏవనగా:
మెషెలెమ్యా మరియు అతని కుమారులు, (మెషెలెమ్యా తండ్రి పేరు కోరే. అతడు ఆసాపు వంశంలోని వాడు.)
2 మెషెలెమ్యా సంతానవంతుడు. జెకర్యా పెద్దవాడు. యెదీయవేలు రెండవవాడు. జెబద్యా మూడవవాడు. యత్నీయేలు నాల్గవవాడు.
3 ఏలాము ఐదవ కుమారుడు. యెహోహనాను ఆరవవాడు. ఎల్యోయేనై ఏడవ కుమారుడు.
4 ఓబేదెదోము, అతని కుమారులు. ఓబేదెదోము పెద్ద కుమారుడు షెమయా. యెహోజాబాదు అతని రెండవ కుమారుడు. యోవాహు మూడవవాడు. శాకారు అతని నాల్గవ కుమారుడు. నెతనేలు అయిదవవాడు.
5 అమ్మీయేలు ఆరవవాడు. ఇశ్శాఖారు అతని ఏడవ కుమారుడు. పెయుల్లెతై అతని ఎనిమిదవ కుమారుడు. దేవుడు నిజంగా ఓబేదెదోమును ఆశీర్వదించాడు.
6 ఓబేదెదోము కుమారుడు షెమయా. షెమయాకు కూడ కుమారులున్నారు. తన తండ్రి కుటుంబంలో షెమయా కుమారులంతా ధైర్యంగల సేనానులు కావటంతే వారు నాయకులయ్యారు.
7 షెమయా కుమారులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు, ఎలీహు, మరియు సెమక్యా అనేవారు. ఎల్జాబాదు బంధువులు నేర్పరులైన పనివారు.
8 వారంతా ఓబేదెదోము సంతతివారు. వారు, వారి కుమారులు, బంధువులు అంతా పరాక్రమశాలురు. వారు మంచి రక్షక భటులు. ఓబేదెదోము సంతతివారు అరువది ఇద్దరు.
9 మెషెలెమ్యా కుమారులు, బంధువులు పరాక్రమవంతులు. అతని కొడుకులు, బంధువులు కలిసి పద్దెనిమిది మంది వున్నారు.
10 మెరారీ వంశానికి చెందిన ద్వారపాలకులు ఎవరనగా, హోసా పెద్ద కుమారునిగా షిమ్రీ పరిగణింపబడ్డాడు. నిజంగా షిమ్రీ పెద్ద కుమారుడు కాదు. కాని అతని తండ్రి అతనిని పెద్దవాడుగా ఆదరించాడు.
11 హిల్కీయా అతని రెండవ కుమారుడు. టెబల్యాహు అతని మూడవ కుమారుడు. జెకర్యా నాల్గవవాడు. అంతా కలిసి హోసాకు పదముగ్గురు కుమారులు, బంధువులు వున్నారు.
12 వీరు ద్వారపాలకుల జట్ల నాయకులు. వీరి ఇతర బంధువుల వలెనే ద్వారపాలకులకు ఆలయ సేవలో ఒక విశిష్టమైన పద్ధతి వుంది.
13 ప్రతి కుటుంబానికి ఒక ద్వారం కాపలా కొరకు కేటాయించబడింది. ప్రతి కుటుంబానికీ ద్వారాలు నిర్ణయించటానికి చీట్లు వేయబడ్డాయి. ఈ విషయంలో చిన్నా పెద్దా అనే భేధం పాటించకుండా అంతా సమంగా చూడబడ్డారు.
14 చీట్లు వేయగా తూర్పు ద్వారం షెలెమ్యాకు వచ్చింది. షెలెమ్యా కుమారుడు జెకర్యాకు కూడ చీట్లు వేయబడ్డాయి. జెకర్యా చాలా తెలివైన సలహాదారు. ఉత్తర ద్వారం జెకర్యాకు వచ్చింది.
15 ఓబేదెదోముకు దక్షిణ ద్వారం వచ్చింది. ఓబేదెదోము కుమారులు విలువైన వస్తువులు దాచే ఇంటి కాపలాకై ఎంపిక చేయబడ్డారు.
16 షుప్పీము, హోసా పడమటి ద్వారం కాపలాకు, ఎగువ మార్గంలో వున్న షల్లెకెతు ద్వారం కాపలాకు ఎంపిక చేయబడ్డారు.
భటులు ఒకరి పక్కన ఒకరు వరుసగా నిలబడ్డారు.
17 తూర్పుద్వారం వద్ద ప్రతి రోజూ ఆరుగులు లేవీయులు కాపలా వుండేవారు. ఉత్తర ద్వారం వద్ద ప్రతి రోజూ ఐదుగురు లేవీయులు నిలబడేవారు. దక్షిణ ద్వారం వద్ద నలుగురు లేవీయులు నిలబడేవారు. విలువైన వస్తువులు దాచే ఇంటివద్ద ఇద్దరు లేవీయులు కాపలా వుండేవారు.
18 పడమటి సభాస్థానం వద్ద నలుగురు భటులు కాపలా వుండేవారు. సభాస్థానికి వెళ్లే బాటమీద ఇద్దరు భటులు వుండేవారు.
19 ఇవి ద్వారపాలకుల జట్లు. ఆ ద్వారపాలకులు కోరహు (కోరే), మెరారి సంతతివారు.
కోశాధికారి, మరియు ఇతర అధికారులు
20 అహీయా లేవీయుల వంశంవాడు. దేవాలయంలో విలువైన వస్తువుల పరిరక్షణ అహీయా బాధ్యత. పవిత్ర వస్తువులు, పరికరాలు వుంచిన స్థలాలను కాపాడటం కూడా అహీయా బాధ్యత.
21 గెర్షోను తెగవారిలో లద్దాను ఒక కుటుంబపు మూలపురుషుడు. యెహీయేలీ అనేవాడు లద్దాను వంశంలో ఒక నాయకుడు.
22 యెహీయేలీ కుమారులు జేతాము, అతని సోదరుడైన యోవేలు. దేవాలయంలో విలువైన వస్తువులన్నిటి పరిరక్షణ వారి బాధ్యత.
23 ఇతర నాయకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను మరియు ఉజ్జీయేలు వంశాల నుండి ఎంపిక చేయబడ్డారు.
24 ఆలయంలో విలువైన వస్తువులపై కాపలా షూబాయేలు బాధ్యత. షూబాయేలు తండ్రి పేరు గెర్షోము. గెర్షోము తండ్రి పేరు మోషే.
25 షూబాయేలు బంధువుల వివరాలు: ఎలీయెజెరు తరపున అతని బంధువులు ఎవరనగా: ఎలీయెజెరు కుమారుడు రెహబ్యా. రెహబ్యా కుమారుడు యెషయా. యెషయా కుమారుడు యెహోరాము. యెహోరాము కుమారుడు జిఖ్రీ. జిఖ్రీ కుమారుడు షెలోమీతు.
26 షెలోమీతు, అతని బంధువులు ఆలయానికై దావీదు సేకరించిన వస్తువులన్నిటిపై కాపలా వున్నారు.
సైన్యాధికారులు కూడ ఆలయానికి విరాళాలు ఇచ్చారు.
27 వారు యుద్ధాలలో శత్రువుల నుండి తీసుకొన్న వస్తువులలో కొన్నింటిని కూడ విరాళంగా ఇచ్చారు. వాటన్నిటినీ వారు యెహోవా ఆలయ నిర్మాణంలో వినియోగించటానికి ఇచ్చారు.
28 షెలోమీతు, అతని బంధువులు కలిసి దీర్ఘదర్శియగు (ప్రవక్త) సమూయేలు, రాజైన సౌలు, నేరు కుమారుడగు అబ్నేరు, సెరూయా కుమారుడైన యోవాబు ఇచ్చిన పవిత్ర వస్తువులన్నిటి సంరక్షణ బాధ్యత కూడా వహించారు. షెలోమీతు, అతని బంధువులు యెహోవాకు ఇచ్చిన పవిత్ర వస్తువులన్నిటి విషయంలో జాగ్రత్త వహించారు.
29 కెనన్యా ఇస్హారు కుటుంబంలోని వాడు. కెనన్యా, అతని కుమారులు మందిరపు బయట బాధ్యతలు స్వీకరించారు. వారు రక్షకభటులుగాను, న్యాయాధిపతులుగాను ఇశ్రాయేలులో వివిధ ప్రాంతాలలో పని చేశారు.
30 హషబ్యా హెబ్రోను కుటుంబంలోని వాడు. హషబ్యా, అతని బంధువులు దేవుని అన్ని కార్యాలలోను; యోర్దాను నదికి పశ్చిమానగల ఇశ్రాయేలులో రాజుగారి పనులలోను శ్రద్ధ తీసుకొనే వారు. హషబ్యా వర్గంలో పదిహేడువేల మంది బలవంతులున్నారు.
31 వారికి యెరీయా పెద్ద అని హెబ్రోను కుటుంబ చరిత్ర తెలుపుతుంది. దావీదు నలుబది ఏండ్లు రాజుగా వున్న కాలంలో తన ప్రజల వంశ చరిత్రలు చూచి బలపరాక్రమాలుగల వారిని, నేర్పరులైన పనివారిని వెదుకమని ఆజ్ఞాపించాడు. అట్టివారిలో కొంతమంది గిలియాదులో గల యాజేరు పట్టణంలో నివసిస్తున్న హెబ్రోను వంశీయులలో వున్నట్లు కనుగొన్నారు.
32 యెరీయాకు రెండువేల ఏడువందల మంది బలవంతులైన, కుటుంబ పెద్దలైన బంధువులున్నారు. యెహోవా కార్యాలు చేయటంలోను, రాజు పనులు చక్కబెట్టటం లోను రూబేనీయుల, గాదీయుల మరియు మనష్షే సగం వంశీయుల పనిని పరిశీలించేందుకు రాజైన దావీదు యెరీయా బంధువులైన ఆ రెండువేల ఏడువందల మందిని నియమించాడు.