29
ఆలయం నిర్మాణానికి కానుకలు
అక్కడ సమావేశమైన ఇశ్రాయేలు ప్రజలందరినీ ఉద్దేశించి రాజైన దావీదు ఇలా అన్నాడు: “దేవుడు నా కుమారుడు సొలొమోనును ఎంపిక చేశాడు. సొలొమోను చిన్నవాడు. అందువల్ల తాను చేయవలసిన పనులన్నిటిలో తగిన అనుభవం లేదు. కాని పని మాత్రం అతి ముఖ్యమైనది! ఈ భవనం ప్రజల కొరకు కాదు. ఇది యెహోవా దేవుని ఆలయం. నా దేవుని ఆలయం కట్టించటానికి తగిన నమూనాలు, ఏర్పాట్లు నాశక్తి కొలదీ చేశాను. బంగారంతో చేయదగిన వస్తు సామగ్రికి కావలసిన బంగారం, వెండితో చేయదగిన వస్తువులకు వెండి, కంచు సామగ్రికి కావలసిన కంచు, ఇనుప పనిముట్లకు కావలసిన ఇనుము, కలప సామాన్లు చేయటానికి తగిన కలప ఏర్పాటు చేశాను. పొదగటానికి సులిమాను రాళ్లు అనబడే మణులను, నల్లరాతిని, విలువైన రంగురంగుల రత్నాలను, పాల రాతిని కూడ నేను ఇచ్చాను. ఆలయం నిర్మాణానికి ఈ రకమైన వస్తుసామగ్రిని లెక్కకు మించి ఇచ్చాను. నా దేవుని ఆలయానికి వెండి బంగారు వస్తువులను ప్రత్యేక కానుకలుగా ఇస్తున్నాను. నేనిది ఎందుకు చేస్తున్నానంటే నిజంగా నేను నా దేవుని ఆలయం కట్టించ దలిచాను. ఈ పవిత్ర ఆలయ నిర్మాణానికే ఈ వస్తువులన్నీ నేను ఇస్తున్నాను. ఆరువేల మణుగుల* ఓఫీరు దేశపు బంగారాన్ని, పధ్నాలుగు వేల మణుగుల శుద్దమైన వెండిని ఇచ్చాను. ఆలయ భవనాల గోడలపై వెండిరేకుల తొడుగు వేస్తారు. వెండి బంగారాలతో చేయదగిన వస్తువులకు కావలసిన వెండిని, బంగారాన్ని ఇచ్చాను. ఆలయానికి పనికివచ్చే అనేక రకాల వస్తు సామగ్రిని నిపుణతగల పనివారు చేయగలిగేలా నేను వెండిని, బంగారాన్ని సమకూర్చాను. ఇప్పుడు ఇశ్రాయేలీయులైన మీలో ఎంతమంది ఆరోజు యెహోవా కార్యానికి మనసారా కానుకలు ఇవ్వటానికి సిద్ధంగా వున్నారు?”
కుటుంబాల పెద్దలు, ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు, సహస్ర సైనిక దళాధిపతులు, శత దళాధిపతులు రాజకార్య నిర్వాహకులు వెంటనే తమ విలువైన వస్తువులు స్వయంగా అర్పించారు. ఆలయానికి వారిచ్చిన వస్తువులు ఏవనగా: పదివేల మణుగుల బంగారం, ఇరవై వేల మణుగుల వెండి, ముప్పదియారు వేల మణుగుల కంచు, రెండు లక్షల మణుగుల ఇనుము. విలువైన రత్నాలు కలిగివున్న ప్రజలు వాటిని ఆలయానికి యిచ్చారు. యెహీయేలు విలువైన రత్నాలన్నిటి విషయంలో జాగ్రత్త తీసుకొన్నాడు. యెహీయేలు గెర్షోను వంశీయుడు. తమ నాయకులు అంత ఉదారంగా విరాళాలు ఇవ్వటంతో ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. నాయకులు నిండు హృదయంతో విరాళాలు ఇచ్చి సంతోషపడ్డారు. రాజైన దావీదు కూడ ఆనందంగా వున్నాడు.
దావీదు చక్కటి ప్రార్థన
10 సమావేశపర్చబడిన ప్రజానీకం ముందు దావీదు పిమ్మట యెహోవాకి స్తోత్రం చేశాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు:
 
“ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా, మా తండ్రీ,
సదా నీకు స్తోత్రం చేస్తాము.
11 గొప్పతనము, శక్తి, మహిమ, విజయము, గౌరవము అన్నీ నీకు చెందినవే
ఎందుకంటే పరలోకమందు, భూమిమీద అన్నీ నీకు చెందినవే,
ఓ దేవా, రాజ్యము నీదైయున్నది.
నీవు సమస్త ప్రజలపై అధిపతివైయున్నావు.
12 భోగభాగ్యాలు, గౌరవం నీ నుండేవస్తాయి.
సమస్తమును పాలించువాడవు నీవు.
నీవు బల పరాక్రమసంపన్నుడవు.
నీవు ఎవరినైనా గొప్ప వాడినిగా గాని, బలవంతునిగా గాని చేయగల సమర్థుడవు.
13 మా దేవా, మేము నీకు కృతజ్ఞతలు చెల్లించు చున్నాము.
మహిమగల నీ నామమును స్తుతిస్తాము!
14 ఈ వస్తువులన్నీ నానుండి, నా ప్రజల నుండి రాలేదు.
ఈ వస్తువులన్నీ నీనుండి వచ్చినవే.
నీనుండి వచ్చిన వాటినే మేము తిరిగి నీకు సమర్పిస్తున్నాము.
15 మేము కొత్త వారిలా, బాటసారుల్లా వున్నాము. మా పూర్వీకులు కూడ పరాయివారిలా, బాట సారుల్లా వున్నారు.
ఆశలేని మా బ్రతుకులు ఈ భూమి మీద నీడలాంటివి.
ఎవ్వరూ స్థిరంగా వుండరు.
16 యెహోవా మా దేవా, నీ ఆలయ నిర్మాణానికై మేము ఈ వస్తువులన్నీ సమకూర్చాము.
నీ నామము ఘనపర్చబడేలా మేము ఈ ఆలయం నిర్మిస్తాము.
కాని ఈ వస్తుసంపదంతా నీ నుండి వచ్చినదే.
ప్రతిదీ నీకు చెందినదే.
17 నా దేవా, నీవు ప్రజల హృదయాలను పరీక్షిస్తావని కూడ నాకు తెలుసు.
ప్రజలు మంచి పనులు చేస్తే నీవు సంతోషిస్తావు.
ఈ వస్తు సముదాయాన్నంతా హృదయ పూర్వకంగా (సదుద్దేశంతో)
నేను ఇస్తున్నందుకు సంతోషిస్తున్నాను.
నీ ప్రజలంతా అనేక కానుకలు సంతోషంగా
నీకు ఇవ్వటానికి ఇక్కడ చేరియున్నట్లు నేను చూశాను.
18 ఓ దేవా, నీవు మా పితరులైన
అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలులకు దేవుడివి.
నీ ప్రజలు సదా నిన్ను కొలిచేలా వారికి దయచేసి సహయపడుము.
వారి హృదయాలెప్పుడూ నీ వైపు తిప్పుకోగలిగేలా వారికి నీవు సహాయపడుము.
19 నీ పట్ల సత్యవర్తనుడై మెలిగేలా నా కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయుము.
నీ ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని, నీ నియమ నిబంధనలను అతను ఎల్ల వేళలా పాటించేలా నీవతనికి తోడ్పడుము.
ఈ విషయాలలో నీవు సొలొమోనుకు సహాయంచేసి,
అతను నేను తలపెట్టిన ఆలయ నిర్మాణకార్యక్రమం పూర్తిచేసేలా తోడ్పడుము.”
 
20 పిమ్మట దావీదు అక్కడ చేరిన ప్రజాసమూహాన్ని ఉద్ధేశించి, “ఇప్పుడు మీ దేవుడైన యెహోవాకు స్తోత్రం చేయండి” అని అన్నాడు. తమ పూర్వీకులు కొలిచిన దేవుడగు యెహోవాను ప్రజలంతా స్తుతించారు. యెహోవాకి రాజుకు గౌరవ సూచకంగా వారు సాష్టాంగ నమస్కారం చేశారు.
సొలొమోను రాజవటం
21 ఆ మరునాడు ప్రజలంతా యెహోవాకి బలులు అర్పించారు. యెహోవాకు వారు దహన బలులు అర్పించారు. వారు వేయి గిత్తలను, వేయి పొట్టేళ్లను, వేయి గొర్రె పిల్లలను బలి ఇచ్చారు. వారు పానార్పణలను కూడ సమర్పించారు. ఇశ్రాయేలు ప్రజలందరి తరపునా లెక్కలేనన్ని బలులు సమర్పించారు. 22 ఆ రోజు ప్రజలంతా బాగా తిని, తాగి ఆనందించారు. యెహోవా అక్కడ వారితో వున్నాడు.
వారు చాలా ఆనందంగా వున్నారు. తరువాత దావీదు కుమారుడైన సొలొమోనును వారు రెండవసారి§ రాజుగా ప్రకటించారు. వారు సొలొమోనును రాజుగాను, సొదోకును యాజకునిగాను అభిషిక్తం చేశారు. యెహోవా నెలకొని వున్నచోటే వారు ఈ పనిచేశారు.
23 తరువాత సొలొమోను యెహోవా సింహాసనం మీద రాజు హోదాలో కూర్చున్నాడు. సొలొమోను తన తండ్రి స్థానాన్ని అలంకరించి వర్థిల్లాడు. ఇశ్రాయేలు ప్రజలంతా సొలొమోను ఆజ్ఞలను పాటించారు. 24 పెద్దలందరు, బలశాలురైన నాయకులు, రాజైన దావీదు కుమారులందరు సొలొమోనును రాజుగా గుర్తించి అతనికి విధేయులై వున్నారు. 25 యెహోవా సొలొమోనును చాలా గొప్ప వ్యక్తినిగా చేసాడు. యెహోవా సొలొమోనును చాలా ఉన్నతమైన వ్యక్తిగా చేస్తున్నాడని ఇశ్రాయేలు ప్రజలంతా గుర్తించారు. రాజుకు ఇవ్వవలసిన గౌరవాభిమానాలను యెహోవా సొలొమోనుకు ఇచ్చాడు. సొలొమోనుకు ముందు మరొక రాజెవ్వడూ అంతటి గౌరవాన్ని పొందియుండలేదు.
దావీదు మరణం
26-27 దావీదు ఇశ్రాయేలుకు నలభై సంవత్సరాలు రాజుగా వున్నాడు. దావీదు యెష్షయి కుమారుడు. దావీదు హెబ్రోను నగరంలో ఏడు సంవత్సరాలు పాలించాడు. తరువాత దావీదు యెరూషలేము నగరం నుండి ముప్పది మూడు సంవత్సరాలు పాలించాడు. 28 దావీదు బాగా వృద్ధుడయినాక మరణించాడు. దావీదు ఉత్తమ జీవితాన్ని దీర్ఘకాలం గడిపాడు. దావీదు అన్ని భోగభాగ్యాలు, గౌరవాభిమానాలు పొందాడు. తరువాత అతని కుమారుడు సొలొమోను నూతన రాజు అయ్యాడు.
29 రాజైన దావీదు ఆదినుండి అంతం వరకు చేసిన పనులన్నీ దీర్ఘదర్శియైన సమూయేలు వ్రాసిన వ్రాతలలోను, ప్రవక్తయగు నాతాను వ్రాతలలోను, దీర్ఘదర్శియైన గాదు వ్రాసిన వృత్తాంతాలలోను పొందుపర్చబడ్డాయి. 30 ఆ వ్రాతలన్నీ ఇశ్రాయేలుకు రాజుగా దావీదు చేసిన పనులన్నిటి గురించి తెల్పుతాయి. అవి దావీదు శౌర్యాన్ని గూర్చి, అతనికి సంభవించిన విషయాలను గూర్చి తెలియజేస్తాయి. ఆ వ్రాతలు ఇశ్రాయేలుకు, దాని పొరుగు రాజ్యాలన్నిటిలో జరిగిన కార్యాలు, వాటి పరిస్థితులను తెలియజేస్తాయి.
* 29:4 ఆరువేల మణుగుల లక్ష కిలోగ్రాములు. 29:4 పధ్నాలుగు వేల మణుగులు రెండు లక్షల ముప్పది అయిదువేల కిలోగ్రాములు. 29:18 ఇశ్రాయేలు యాకోబుకు మరో పేరు. చూడండి ఆది. 35:19. § 29:22 తరువాత … రెండవసారి తన మారుటి సోదరుడు అదోనీయా తనను తాను రాజుగా ప్రకటించుకొనే ప్రయత్నం చేసినప్పుడు, సొలొమోను మొదటిసారి రాజుగా ఎంపిక చేయబడ్డాడు, చూడండి రాజుల మొదటి గ్రంథం 1:5-39. రెండవసారి బహుశః సొలొమోను తండ్రి దావీదు చనిపోయినప్పుడుగావచ్చు.