4
ఆలయ సామగ్రి
ఒక బలిపీఠాన్ని చేయటానికి సొలొమోను కంచును వినియోగించాడు. ఆ కంచు పీఠం ముప్పై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు, పద్దెనిమిది అడుగుల ఎత్తు గలిగి వుంది. కరిగిన కంచును వినియోగించి సొలొమోను ఒక పెద్ద కోనేరును* (సముద్రం) చేయించాడు. ఆ కోనేరు (సముద్రం) గుండ్రని ఆకారంలో వుంది. దాని వ్యాసం పద్దెనిమిది అడుగులు. దాని ఎత్తు ఏడున్నర అడుగులు. దాని చుట్టు కొలత నలుబదియైదు అడుగులు. కోనేరు (సముద్రం) అంచు చుట్టూ పద్దెనిమిది అడుగుల మేరకు కంచుగిత్తల బొమ్మలున్నాయి. ఆ గిత్తలు రెండు వరుసల్లో కోనేరు (సముద్రం)ను పోతపోసినప్పుడే పోతలో వచ్చాయి. ఆ పెద్ద కోనేరు (సముద్రం) పన్నెండు పెద్ద గిత్తల విగ్రహాలపై నిలపబడింది. మూడు గిత్తలు ఉత్తరానికి తిరిగి దక్షిణానికి తిరిగి వున్నారు. మూడు గిత్తలు వున్నాయి. మూడు గిత్తలు పడమటి వైపుకు తిరిగి వున్నాయి. మూడు గిత్తలు తూర్పు వైపుకు చూస్తూవున్నాయి. ఆ పెద్ద కోనేరు (సముద్రం) ఈ గిత్తల మీద నిలపబడింది. ఆ గిత్తలన్నీ వాటి వెనుక భాగాలు మధ్యలో ఒకదానికొకటి ఆనుకొని వుండి నిలబడి వున్నాయి. కంచు కోనేరు (సముద్రం) మందం మూడు అంగుళాలు. కోనేరు సముద్రపు అంచు గిన్నె అంచులాగా వుంది. అంచుతామర పుష్పంలా అగపడుతుంది. దానిలో పదిహేడు వేల ఐదువందల గేలనుల (ముప్పై పుట్లు) నీరు పడుతుంది.
సొలొమోను పది వెడల్పైన తొట్టెలను నిర్మించాడు. వాటిలో ఐదింటిని కోనేరు (సముద్రం) సముద్రంకు కుడి పక్కన, ఐదింటిని ఎడమ ప్రక్కన వుంచాడు. ఈ తొట్లను దహన బలులుగా అర్పించే జంతువులను కడగటానికి వినియోగిస్తారు. కాని పెద్ద కోనేరు (సముద్రం) ను మాత్రం యాజకులు తాము బలులు యిచ్చేముందు పవిత్ర స్నానాలు చేయటానికి వినియోగించేవారు.
సొలొమోను పది బంగారపు దీప స్తంభాలు చేయించాడు. ఈ దీప ఆలయ స్తంభాలు చేయటానికి, మునుపటి దీపస్తంభాల నమూనాలనే సొలొమోను అను కరించాడు. ఈ దీపస్తంభాలను అతడు ఆలయంలో వుంచాడు. కుడిపక్క ఐదు, ఎడమపక్క ఐదు దీప స్తంభాలను వుంచాడు. సొలొమోను పది బల్లలు చేయించి ఆలయంలో వుంచాడు. ఆలయంలో ఐదు బల్లలు కుడిపక్కన, ఐదు బల్లలు ఎడమపక్కన వుంచాడు. సొలొమోను వంద తొట్లు చేయించటానికి బంగారం వినియోగించాడు. ఆలయం వెలుపల సొలొమోను యాజకుల పురాన్ని, పెద్ద ఆవరణను నిర్మించి వాటికి వెలుపలి ద్వారాలను ఏర్పాటు చేశాడు. ఆ ద్వారాల తలుపులకు కంచు రేకులు తాపడం చేయించాడు. 10 పిమ్మట పెద్ద కంచు కోనేరు (సముద్రం) ను ఆలయంకి కుడి పక్కగా ఆగ్నేయ (తూర్పు-దక్షిణాల మూల) భాగాన వుంచాడు.
11 హూరాము కుండలను, పారలను, గిన్నెలను తయారు చేశాడు. పిమ్మట హూరాము రాజైన సొలొమోను తలపెట్టిన ఆలయంలో తన పనంతా పూర్తి చేశాడు. 12 హూరాము మరి రెండు స్తంభాలు, వాటిపైన వెడల్పు పళ్ళెములను చేశాడు. ఆ స్తంభాలపైనున్న వెడల్పు పళ్లెములను అలంకారంగా కప్పటానికి రెండు వలల్లాంటి అల్లికలను కూడ చేశాడు. 13 ఆ రెండు అల్లికల మీద వేలాడదీయటానికి నాలుగు వందల దానిమ్మకాయల ప్రతిమలు కూడా చేశాడు. అలంకరణగా రెండు వరుసల దానిమ్మకాయల బొమ్మలు చుట్టబడ్డాయి. స్తంభాల మీదనున్న పెద్ద పళ్ళెములను వలలు కప్పివున్నాయి. 14 హూరాము తొట్లను, వాటి కింది కుదురులను కూడా చేశాడు. 15 హూరాము కంచు కోనేరను (సముద్రం), దాని కింది పన్నెండు గిత్తలను చేశాడు. 16 హూరాము పాత్రలను, పారలను, శూలాలను, మరియు రాజైన సొలొమోను నిర్మిస్తున్న ఆలయానికి కావలసిన తదితర వస్తువులను చేశాడు. ఈ వస్తుసామగ్రంతా మెరుగు దిద్దిన కంచుతో చేయబడింది. 17 రాజైన సొలొమోను ముందుగా ఈ వస్తువులను మట్టి మూసలలో పోతపోయించాడు. ఈ మూసలు యోర్దానులోయలో సుక్కోతు, జెరేదాతను పట్టణాల మధ్య తయారు చేయబడ్డాయి. 18 సొలొమోను చేయించిన ఈ రకమైన వస్తుసామగ్రి ఎంత వుందనగా వాటికి పట్టిన కంచును తూచి లెక్క గట్టటానికి ఎవ్వరూ ప్రయత్నించియుండలేదు.
19 సొలొమోను ఆలయానికి కావలసిన సామాన్లు కూడా చేయించాడు. సొలొమోను బంగారు బలిపీఠం చేయించాడు. దైవ సన్నిధిలో నైవేద్యం వుంచాటానికి తగిన బల్లలు చేయించాడు. 20 సొలొమోను దీపస్తంభాలు, దీపాలు మేలిమి బంగారంతో చేయించాడు. అతి పవిత్ర స్థలం ముందు ఈ దీపాలు నిర్ణయించిన ఒక క్రమపద్ధతిలో వెలుగుతాయి. 21 ప్రమిదలు నిలిపే పుష్పాలవంటి కుదుర్లు, ప్రమిదలు, పట్టుకారులు, అన్నీ మేలిమి బంగారంతో సొలొమోను చేయించాడు. 22 వత్తులు ఎగదోయు పని ముట్లను, తొట్లను, గిన్నెలను, సాంబ్రాణి పొగవేయు ధూప కలశాలు చేయటానికి కూడా సొలొమోను శుద్ధ బంగారం వినియోగించాడు. ఆలయ ద్వారాలకు, అతి పవిత్ర స్థలం తలుపులకు, ఆలయం తలుపులకు సొలొమోను శుద్ధ బంగారం వినియోగించాడు.
* 4:2 కోనేరు నీళ్లను నింపుటకు చేయు పెద్దతొట్టి లాంటిది.