22
దావీదు పలుచోట్లకు వెళ్లుట
దావీదు గాతును వదిలి అదుల్లాము గుహలలోకి పారిపోయాడు. అదుల్లాము గుహలో దావీదు ఉన్నట్లు అతని సోదరులు, బంధువులు విన్నారు. దావీదును చూడటానికి వారక్కడికి వెళ్లారు. చాలా మంది ప్రజలు దావీదుతో కలిసారు. కష్టాల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసంతృప్తి చెందిన వారు దావీదు చుట్టూ చేరారు. వారికి దావీదు నాయకుడయ్యాడు. అతనితో కలిసి వారు మొత్తం నాలుగు వందలమంది.
దావీదు అదుల్లాము గుహ వదిలి మోయాబులో ఉన్న మిస్పాకు వెళ్లాడు. “దేవుడు నాకు ఏమి చేయనున్నాడో నేను తెలుసుకునే వరకు దయచేసి నా తల్లి దండ్రులను వచ్చి నీతో ఉండనియ్యి” అని దావీదు మోయాబు రాజును అడిగాడు. దావీదు తన తల్లి దండ్రులను మోయాబు రాజువద్ద వదిలి పెట్టాడు. దావీదు కొండలలో* దాగి ఉన్నంత కాలం అతని తల్లిదండ్రులు మోయాబు రాజుతోనే ఉన్నారు.
గాదు ప్రవక్త దావీదును, “కోటలో వుండవద్దనీ, యూధాకు వెళ్లమని చెప్పాడు.” కనుక దావీదు బయల్దేరి హారేతు అరణ్యానికి వెళ్లాడు.
అహీమెలెకు కుటుంబాన్ని సౌలు నాశనము చేయుట
దావీదు, అతని మనుష్యులను గూర్చి తన మనుష్యులకు తెలిసినట్లు సౌలు విన్నాడు. గిబియా వద్ద కొండ మీద ఉన్న ఒక వృక్షం క్రింద సౌలు కూర్చున్నాడు. సౌలు క్రింద అధికారులంతా అతని చుట్టూ నిలబడ్డారు. సౌలు చేతిలో ఒక ఈటె వుంది. సౌలు తన చుట్టూవున్న అధికారులనుద్దేశంచి, “బెన్యామీను మనుష్యులారా వినండి! యెష్షయి కుమారుడు దావీదు మీ అందరికీ భూములు, ద్రాక్షతోటలు ఇస్తాడని మీరను కుంటున్నారా? మీ అందరినీ దావీదు సహస్ర సైన్యాధిపతులుగా, శత దళాధిపతులుగా చేస్తాడని మీరు అనుకుంటున్నారా? అని అడిగాడు. మీరంతా నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు! మీరు రహస్య పథకాలు వేసారు. నా కుమారుడు యోనాతాను యెష్షయి కుమారునితో ఒడంబడిక చేసుకున్నట్లు మీలో ఎవ్వడూ నాకు చెప్పలేదు! నా గురించి మీలో ఒక్కనికీ శ్రద్ధలేదు! దావీదును నా కుమారుడు యోనాతాను ప్రోత్సహించినట్టు మీలో ఒక్కడూ నాకు చెప్పలేదు. నా సేవకుడు దావీదును దాగుకొనుమని, నన్ను ఎదురుదెబ్బ తీయుమని యోనాతాను చెప్పాడు. దావీదు ఇప్పుడు అదే పని చేస్తున్నాడు” అని అన్నాడు.
ఎదోమీయుడగు దోయేగు అక్కడ సౌలు అధికారులతో పాటు నిలబడివున్నాడు. “యెష్షయి కుమారుడైన దావీదు అహీటూబు కుమారుడైన అహీమెలె కును నోబులో చూడటానికి వచ్చినపుడు, అతనిని నేను చూసాను. 10 దావీదు కొరకు అహీమెలెకు ప్రార్థన చేయటం, అహీమెలెకు అతనికి ఆహారం ఇవ్వటం, పైగా ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గాన్ని అహీమెలెకు దావీదుకు ఇవ్వటం నేను చూసాను” అని దోయేగు వివరంగా చెప్పాడు.
11 అది విన్న సౌలు అహీటూబు కుమారుడు, యాజకుడైన అహీమెలెకును, అతని బంధువుల నందరినీ తన దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. అహీమెలెకు బంధువులంతా నోబులో యాజకులు. వారంతా రాజువద్దకు వచ్చారు. 12 “అహీటూబు కుమారుడా, విను” అని సౌలు అహీమెలెకుతో అన్నాడు.
“చెప్పండి ప్రభూ,” అన్నాడు అహీమెలెకు.
13 “నీవూ, యెష్షయి కుమారుడైన దావీదూ కలిసి నామీద ఎందుకు రహస్య పథకాలు వేసారు? నీవు దావీదుకు రొట్టె, ఖడ్గం ఇచ్చావు. వాని కోసం నీవు దేవునికి ప్రార్థన చేసావు. ఇప్పుడు దావీదు నన్ను ఎదుర్కోటానికి వేచియున్నాడు.” అన్నాడు అహీమెలెకుతో సౌలు.
14 అహీమెలెకు, “దావీదు నీ పట్ల చాలా విశ్వసంగా ఉన్నాడు. దావీదు అంతటి నమ్మకస్థుడు నీ అధికారులలో మరెవ్వరూ లేరు. దావీదు నీ సొంత అల్లుడు. పైగా నీ అంగరక్షకులందరికీ అతడు అధిపతి. నీ సొంత కుటుంబమంతా దావీదును గౌరవిస్తూ ఉంది. 15 నేను దావీదు కొరకు ప్రార్థన చేయటం అది మొదటి సారికాదు. ఎన్నటికీ కాదు. నన్నుగాని, నా బంధువులనుగాని నిందించవద్దు. మేము నీ సేవకులము. ఇప్పుడు ఏమి జరుగుతూ ఉందనేది నాకేమీ తెలియదు” అని జవాబిచ్చాడు.
16 కానీ రాజు, “అహీమెలెకూ! నీవూ, నీ బంధువులు అంతా చావాల్సిందే!” అన్నాడు. 17 అప్పుడు రాజు తన పక్కనవున్న భటులతో, “వెళ్లి, యెహోవా యాజకులందరినీ చంపండి. వారు దావీదు పక్షంగా ఉన్నారు. దావీదు పారిపోతున్నాడని వారికి తెలుసు. అయినా వారు నాకు ఆ విషయం చెప్పలేదు” అని చెప్పాడు.
రాజభటులు యెహోవా యాజకులకు హాని చేసేందుకు నిరాకరించారు. 18 అప్పుడు రాజు దోయేగును పిలిచి, “నీవు వెళ్లి ఆ యాజకులను చంపు” అని ఆజ్ఞాపించాడు. దానితో ఎదోనీయుడైన దోయేగు వెళ్లి యాజకులందరినీ చంపేసాడు. ఆ రోజు ఎనభై అయిదు మంది యాజకులను దోయేగు చంపేసాడు. 19 నోబు యాజకుల యొక్క పట్టణం. నోబు పట్టణంలోని వారందరినీ దోయేగు చంపేసాడు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, పసివాళ్లు అందరినీ దోయేగు చంపేసాడు. వారి వశువులు, గాడిదలు, గొర్రెలు అన్నిటినీ దోయేగు చంపేసాడు.
20 అయితే అబ్యాతారు తప్పించుకున్నాడు. ఇతడు అహీటూబు మనుమడు. అంటే అహీమెలెకు కుమారుడు. అబ్యాతారు పారిపోయి దావీదును కలుసుకొన్నాడు. 21 సౌలు, యెహోవా యాజకులనందకినీ చంపిన విధమంతా అబ్యాతారు దావీదుకు చెప్పాడు. 22 “ఎదోమీయుడగు దోయేగును ఆ రోజు నోబులో నేను చూసాను, వాడు సౌలుకు తప్పనిసరిగా చెబుతాడని నాకు తెలుసును, కాని నీ తండ్రి కుటుంబం అంతా చనిపోవటానికి నేనే కారకుడను. 23 నిన్ను చంపాలనుకొనే సౌలు నన్నూ చంపాలనుకుంటున్నాడు. నీవు నాతోనే ఉండు. భయపడవద్దు. నాతో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు” అని దావీదు అబ్యాతారుతో అన్నాడు.
* 22:4 కొండలు శత్రు దాడులు జరిగినప్పుడు తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు దాగివండే చోటు. వీటిని దుర్గాలని కూడ అంటారు.