30
అమాలేకీయులు సిక్లగు ప్రజలను పట్టుకొనుట
దావీదు, అతని మనుష్యులు మూడవ రోజుకు సిక్లగు నగరానికి చేరుకున్నారు. అమాలేకీయులు సిక్లగును ముట్టడివేయుట వారు చూశారు. అమాలేకీయులు నెగెవ్ ప్రాంతం మీద దాడి చేసారు. వారు సిక్లగు మీద దాడి చేసి, పట్టణాన్ని తగులబెట్టారు. సిక్లగులో ఉన్న స్త్రీలను బందీలుగా పట్టుకున్నారు. పడుచువాళ్లను, వృద్ధులను అందరినీ వారు పట్టుకొన్నారు. వారు ఎవ్వరినీ చంపలేదు. కేవలం వారిని బందీలుగా పట్టుకొన్నారు.
దావీదు, అతని మనుష్యులు సిక్లగు వచ్చేసరికి పట్టణమంతా తగులబడి పోవటం వారికి కనబడింది. వారి భార్యలు, కొడుకులు, కూతుళ్లు, అంతా బందీలుగా కొనిపోబడ్డారు. అమాలేకీయులు వారిని పట్టుకొన్నారు. దావీదు, అతని సైనికులు సొమ్మసిల్లి పోయేలా గట్టిగా విలపించారు. దావీదు యొక్క ఇద్దరు భార్యలు (యెజ్రెయేలీ అహీనోయము, కర్మెలు వాడైన నాబాలు భార్య, విధవరాలు అబీగయీలు) కూడ బందీలుగా కొనిపోబడ్డారు.
సైన్యంలోని మగవాళ్లంతా వారి కుమారులు, కుమారైలు బందీలుగా తీసుకుని పోబడినందుకు విచారంగా, కోపంగా ఉన్నారు. దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకుంటున్నారు. ఇది దావీదును చాలా తల్లడిల్ల చేసింది. కానీ దావీదు తనదేవుడైన యెహోవా నుంచి బలంపొందాడు. యాజకుడైన అబ్యాతారుతో, “ఏఫోదును తెమ్మని” చెప్పాడు దావీదు.
అప్పుడు దావీదు యెహోవాకు ప్రార్థన చేసాడు “మా కుటుంబాలను బందీలుగా తీసుకునిపోయిన వారిని నేను వెంటాడనా? వారిని పట్టుకుంటానా?”
అని అడిగాడు, “వారిని వెంటాడు, నీవు వారని పట్టుకుంటావు. మీ కుటుంబాలను రక్షించుకొంటావు” అని యెహోవా ప్రత్యుత్తర మిచ్చాడు.
దావీదు, అతని మనుష్యుల ఈజిప్టు బానిసను చూచుట
9-10 దావీదు తన ఆరువందల మంది మనుష్యులను తనతో బెసోరు సెలయేటి వద్దకు తీసుకుని వెళ్లాడు. కొంతమంది ఆ సెలయేటి వద్ద ఉండిపోయారు. అక్కడ నిలబడిపోయిన చాలా మంది అలసి అలసిపోయి ముందుకు వెళ్లలేనంతి బలహీనంగా ఉన్నందువల్ల అక్కడే ఉండిపోయారు. కనుక దావీదు, మరో 400 మంది కలిసి, అమాలేకీయులను తరుముట కొనసాగించారు.
11 ఈజిప్టు మనిషి ఒకడు పొలాల్లో దావీదు మనుష్యులకు కనబడ్డాడు. వారు ఆ ఈజిప్టు వానిని దావీదు దగ్గరకు తీసుకుని వెళ్లారు. ఆ ఈజిప్టు వానికి వారు మంచినీళ్లు, కొంచెం ఆహారం ఇచ్చారు. 12 అంజూరపు పళ్లను, రొట్టెను, రెండు గుత్తుల ఎండు ద్రాక్షలను కూడ వారు అతనికి ఇచ్చారు. అవి తిని వాడు కొంత సేదతీరాడు, మూడు పగళ్లు, మూడు రాత్రులు అతడు ఏమీ తినిగాని, తాగిగాని ఎరుగడు.
13 “నీ యజమాని ఎవరు? నీవు ఎక్కడనుండి వస్తున్నావు?” అని దావీదు అడిగాడు
అందుకు, “నేను ఈజిప్టు వాడిని. ఒక అమాలేకీయుని బానిసను, మూడు రోజుల క్రితం నాకు జబ్బు చేసింది. అందుచేత నా యజమాని నన్ను వదిలివేశాడు. 14 కెరేతీయులు నివసించే దక్షిణ ప్రాంతాన్ని, యూదా దేశాన్ని, కాలేబు ప్రజలు నివసించే నెగెవ్ ప్రాంతాన్ని మేము ముట్టుడించాము. మేము సిక్లగును కూడ తగులబెట్టాము” అని ఆ ఈజిప్టువాడు దావీదుకు చెప్పాడు.
15 “అయితే మా భార్య పిల్లల్ని తీసుకుని పోయిన ఆ మనుష్యుల దగ్గరకు నీవు నన్ను తీసుకుని వెళతావా?” అని దావీదు ఆ ఈజిప్టు వాడిని అడిగాడు.
“నన్ను చంపననీ, నా యజమానికి తిరిగి నన్ను అప్పగించననీ దేవుని ముందర నీవు మాట ఇస్తే వారిని కనుక్కొనేందుకు నేను సహాయం చేస్తాను” అన్నాడు ఆ ఈజిప్టువాడు.
అమాలేకీయులను దావీదు ఓడించుట
16 ఈజిప్టువాడు దావీదును అమాలేకీయుల దగ్గరకు నడిపించాడు. ఆ సమయంలో వారు తాగుతూ, తింటూ నేలమీద ఇక్కడా అక్కడా పండుకొనివున్నారు. ఫిలిష్తీయుల దేశం నుండి, యూదా దేశం నుండి వారు కొల్లగొట్టిన అస్తిపాస్తులను చూసు కుంటూ సంబరం జరుపు కుంటున్నారు. 17 దావీదు వారిని ఓడించి, చంపేసాడు. సూర్యోదయం నుంచి మరునాటి సాయంత్రం వరకు వారు యుద్ధం చేశారు. సుమారు నాలుగు వందల మంది అమాలేకీ యువకులు మాత్రం ఒంటెలపై దూకి పారిపోయారు వారిలో మిగిలిన వారెవ్వరూ బ్రతికి బయటపడలేదు.
18 దావీదుకు తన ఇద్దరు భార్యలు తిరిగి దొరికారు. అమాలేకీయులు కొల్లగొట్టినదంతా దావీదు తిరిగి తీసుకున్నాడు. 19 ఏమీ ఒదిలిపెట్టబడలేదు. చిన్నాపెద్దా, వారి కూతుళ్లు, కొడుకులు, అందర్నీ వారు తిరిగి తెచ్చుకున్నారు. వారి విలువైన వస్తువులన్నీ వారు తిరిగి తెచ్చుకున్నారు. అమాలేకీయులు దోచుకున్న దంతా వారు తిరిగి తెచ్చుకున్నారు. దావీదు సమస్తం మళ్లీ తెచ్చుకున్నాడు. 20 గొర్రెలన్నిటినీ, పశువులన్నింటినీ దావీదు మరల తెచ్చుకున్నాడు. దావీదు మనుష్యులు వాటిని ముందు నడుపుకుంటూ వచ్చారు. వారు “ఇది దావీదు యొక్క బహుమానం” అన్నారు.
కొల్లసొమ్మును దావీదు అందరికీ సమంగా పంచుట
21 అలసి నీరసించి దావీదును వెంబడించలేక బెసోరు సెలయేటి దగ్గర దిగబడిపోయిన రెండు వందలమంది సైనికుల వద్దకు దావీదు తిరిగి వచ్చాడు. వారంతా దావీదును, సైన్యాన్ని చూచి ఎదురేగి ఆహ్యానించారు. 22 అయితే దావీదు వెంట వెళ్లిన గుంపులో కొందరు చెడ్డవాళ్లు, అల్లరి మూక ఉన్నారు. వారు, “ఈ రెండు వందల మంది మనతో రాలేదు. కనుక మనము తీసుకున్న వాటిలో వారికి ఎవరికీ ఏమీ ఇవ్వం. కాకపోతే వారివారి భార్య పిల్లలను మాత్రం వారు తీసుకుని వెళ్లిపోవచ్చు” అన్నారు.
23 అది విన్న దావీదు, “కాదు, సోదరులారా! అలా చేయకండి. యెహోవా మనకు ఇచ్చిన వాటి విషయం ఆలోచించండి. మనపై దాడి చేసిన శత్రువులను యెహోవా మనచేత ఓడించాడు. 24 మీరు చెప్పే దానిని ఎవరూ వినరు. సామానుల వద్ద కాపలా వున్న వారికి, యుద్ధం చేసిన వారికి సమంగానే వాటా వస్తుంది. అందకూ సమంగానే పంచుకోవాలి” అన్నాడు. 25 దావీదు దీనిని ఇశ్రాయేలుకు ఒక నియమంగా, ఒక ఆదేశంగా చేశాడు. ఆ నియమం ఈ నాటికీ అమలులో వుంది.
26 దావీదు సిక్లగుకు వచ్చాడు. అతడు అమాలేకీయుల నుండి తెచ్చిన సంపదలో కొంత భాగాన్ని తన స్నేహితులైన యూదా నాయకులకు పంపాడు. “యెహోవా శత్రువులనుండి మేము తెచ్చిన సంపద లోనుంచి మీకో చిరుకానుక” అని చెప్పి పంపాడు దావీదు.
27 అమాలేకీయులనుంచి తాను తెచ్చిన వస్తువులలో మరికొన్నింటిని బేతేలు నాయకులకు, నెగెవులోని రామోతు, యత్తీరు, 28 అరోయేరు, షిష్మోతు, ఎష్తెమో, 29 రాకాలు మొదలగు యెరహ్మెయేలీ నగరాలకు 30 కేనీయుల, హోర్మా, కోరాషాను, అతాకు 31 మరియు హెబ్రోను నగరాల నాయకులకు దావీదు పంపించాడు. అంతేగాక, దావీదు తన మనుష్యులతో ఎక్కడెక్కడికి వెళ్లాడో ఆ ప్రాంతాల నాయకులకు కూడ వాటిలో కొన్నింటిని దావీదు పంపించాడు.