14
యోవాబు ఒక నేర్పరియైన స్త్రీని దావీదు వద్దకు పంపటం
అబ్షాలోమును గూర్చి దావీదు రాజు మిక్కిలి బెంగపెట్టు కున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించాడు. యోవాబు తన దూతలను తెకోవకు పంపి, అక్కడి నుండి ఒక నేర్పరియైన స్త్రీని తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ స్త్రీతో యోవాబు ఇలా అన్నాడు: “దయచేసి నీవు చాలా దుఃఖంలో ఉన్నట్లు నటించు. విషాదసూ చకమైన బట్టలు వేసుకో, అలంకరణ చేసుకోవద్దు. చనిపోయిన, నీకు ప్రియమైన ఒక వ్యక్తి కోసం చాలా కాలంగా విలపిస్తున్నట్లు ప్రవర్తించు. నేను ఇప్పుడు నీకు చెప్పే మాటలను నీవు రాజు వద్దకు వెళ్లి చెప్పు.” ఈ విధంగా ఆ యుక్తిగల స్త్రీ తో మాట్లాడి, ఆమె రాజుతో ఏమి చెప్పాలో యోవాబు ఆమెకు వివరించాడు.
తరువాత తెకోవ నుండి వచ్చిన స్త్రీ రాజు వద్దకు వెళ్లి మాట్లాడింది. ఆమె రాజు ముందు ప్రణమిల్లింది. ఆమె ముఖం నేలకు తాకింది. వంగి నమస్కరించి, “రాజా, నాకు సహాయం చేయండి!” అని ప్రాధేయ పడింది.
“ఏమిటి నీ సమస్య?” అని దావీదు రాజు ప్రశ్నించాడు.
ఆ స్త్రీ యిలా చెప్పింది: “నేనొక విధవ స్త్రీని! నా భర్త చినిపోయాడు. నాకు ఇద్దరు కుమారులున్నారు. వారిద్దరూ పొలాల్లోకి పోయి దెబ్బలాటకు దిగారు. వాళ్లను నివారించటానికి ఒక్కడు కూడా లేక పోయాడు. ఒక కొడుకు, ఇంకొక కొడుకును చంపివేశాడు. ఇప్పుడు కుటుంబమంతా నామీద కత్తిగట్టారు. హత్యకు పాల్పడిన కొడుకును తెమ్మని ఒత్తిడి తెస్తున్నారు. తన సోదరుని చంపిన కారణంగా వారంతా అతనిని చంపుతామంటున్నారు. నా కొడుకును చంపనిస్తే, తన తండ్రికి ఏకైక వారసుడైన వాడు లేకుండా పోతాడు! నా కుమారుడు అగ్నిలో చివరి నిప్పుకణంలాంటివాడు. ఇప్పుడు ఆ చివరి నిప్పుకణం ఆరిపోబోతూవుంది! దానితో మరణించిన నా భర్త పేరు, ఆస్తి నేలపాలవుతాయి.”
ఇది విన్న రాజు, “ఇక నీవు ఇంటికి వెళ్లు. నీ విషయాల పట్ల నేను శ్రద్ధ తీసుకుంటాను” అని ఆమెతో అన్నాడు.
తెకోవ స్త్రీ రాజుతో, “ఈ విషయంలో వచ్చే పరిణామాలకు, పర్యవసానానికి నిందంతా నామీదే పడుగాక! నా ప్రభువైన రాజా! నీవు, నీ సింహాసనం ఈ విషయంలో ఏదోషమూ ఎరుగరు!” అని చెప్పింది.
10 “నిన్ను గురుంచి ఎవరైనా దీనిగూర్చి నిన్నేమైన అనినయెడల నా వద్దకు తీసుకొనిరా. వాడు మరల నిన్ను ఏమీ అనడు” అని దావీదు రాజు అన్నాడు.
11 అది విన్న ఆ స్త్రీ రాజును ఇలా వేడుకున్నది: “దయచేసి నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. హంతకులను శిక్షించాలని చూసే ఆ ప్రజలు నా కుమారునికి కీడుచేయకుండా దేవుడు నివారించగలందులకు ఆయనను ప్రార్థించు.”
దావీదు ఆమెకు ఇలా అభయమిచ్చాడు: “యెహోవా జీవము తోడుగా ఎవ్వడూ నీ కుమారునికి హాని చేయలేడు. నీ కుమారుని తలలోని ఒక్క వెంట్రుక కూడా క్రింద రాలదు.”
12 ఆ స్త్రీ, “నా ప్రభువైన రాజా! నన్నింకా కొన్ని విషయాలు చెప్పనీయండి” అని అన్నది.
చెప్పమన్నాడు రాజు.
13 ఆ స్త్రీ ఇలా అన్నది: “దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఇవన్నీ నీవెందుకు చేస్తున్నావు? అవును. ఇవన్నీ చేస్తూ నీవు దోషివని బహిర్గతం చేసుకుంటున్నావు!* ఎందువల్లననగా నీవు నీయింటి నుండి పంపివేసిన నీ కుమారుని తిరిగి తీసుకొని రాలేదు. 14 మనమంతా ఏదో ఒక రోజు చనిపోవటమనేది సత్యం. మనమంతా నేల మీద ఒలికిన నీరులాంటివారం. ఈ ఒలికిన నీటిని మట్టిలో నుండి తిరిగి తీయటం ఎవ్వరికీ సాధ్యం కాని పని. కాని దేవుడు ప్రాణాన్ని తీసుకొనడు. ఇండ్లనుండి తరిమి వేయబడిన వారికి దేవుడు ఒక పథకం తయారుచేసి ఉంచుతాడు. అంటే వారు ఆయన నుండి బలవంతంగా దూరం చేయబడలేదు! 15 నా ప్రభువైన రాజా! ఈ మాటలు నీకు చెప్పటానికి నేను వచ్చాను. కారణమేమంటే, ప్రజలు నన్ను భయపెట్టారు! నేను వాళ్లతో నన్ను పోయి రాజుతో మాట్లాడనీయమన్నాను. బహుశః రాజు నా విన్నపం ఆలకింపవచ్చునని అన్నాను. 16 రాజు వింటాడు. విని నన్ను, నా కుమారుణ్ణి చంపజూస్తున్న వారి నుండి రక్షణ కల్పిస్తాడనీ; దేవుడు ప్రసాదించిన ఆస్తిని అనుభవించకుండ చేయజూస్తున్న వారి నుంచి మమ్మల్ని రక్షిస్తాడనీ అనుకున్నాను. 17 నా ప్రభువైన నా రాజు మాటలు మనశ్శాంతినిస్తాయని నాకు తెలుసు. ఎందువల్లనంటే నీవు దేవుని నుండి వచ్చిన దూతలాంటివాడవు. ఏది మంచిదో, ఏది చెడ్డదో నీకు తెలుసు. దేవుడు సదా నీతో వుండు గాక!”
18 అది విని ఆశ్చర్యపడిన రాజైన దావీదు, “నేనొక ప్రశ్న అడుగుతాను. నీవు సమాధనం చెప్పాలి” అన్నాడు.
ఆ స్త్రీ, “నా ప్రభువైన రాజా దయచేసి మీ ప్రశ్న అడగండి!” అన్నది.
19 “విషయాలన్నీ మాట్లాడమని యోవాబు నీతో చెప్పాడా?” అని రాజు అడిగాడు.
ఆ స్త్రీ ఇలా అన్నది: “నీ ప్రమాణంగా, నా ప్రభువైన రాజా, నీవు నిజం చెప్పావు. నీ సేవకుడైన యోవాబు ఇవన్నీ చెప్పమని నాతో అన్నాడు. 20 యోవాబు ఇలా ఎందుకు చేశాడంటే నీవు పరిస్థితులు నిష్పక్షపాతంగా, రాగ ద్వేషాలు లేకుండా అవగాహన చేసుకొని యుక్తమైన నిర్ణయం తీసుకుంటావని. నా ప్రభువా, నీవు దేవ దూతలా తెలివిగలవాడవు. ఈ భూమిమీద జరిగేదంతా నీకు తెలుసు.”
అబ్షాలోము యెరూషలేముకు తిరిగి రావటం
21 రాజు యోవాబుతో ఇలా అన్నాడు: “చూడండి. నేను మాట ఇచ్చిన విధంగా చేస్తాను. యుకుడైన అబ్షాలోమును దయచేసి తీసుకొని రండి.”
22 యోవాబు తన ముఖం నేలనుతాకి సాష్టాంగపడి నమస్కరించాడు. రాజైన దావీదుకు ఆశీర్వచనం పలికి, “ఈ రోజు నాపట్ల మీరు ప్రసన్నులైయున్నారని నాకు తెలుసు! ఎందువల్లనంటే నేను అడిగినదంతా నీవు చేశావు!” అని అన్నాడు.
23 యోవాబు లేచి గెషూరుకు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. 24 అయితే దావీదు రాజు మాత్రం, “అబ్షాలోము తప్పక తన స్వంత ఇంటికి వెళ్లిపోవాలి. అతడు నన్ను చూడటానికి రూకూడదు” అని అన్నాడు. కావున అబ్షాలోము తన స్వంత ఇంటికి వెళ్లిపోయాడు. అబ్షాలోము రాజును చూడటానికి వెళ్లలేక పోయాడు.
25 అబ్షాలోము అందంలో అందరి ప్రశంసలూ పొందిన వాడు. అబ్షాలోమంత అందగాడు ఇశ్రాయేలంతటిలో మరొకడు లేడు. అరికాలు నుండి నడినెత్తివరకు అతనిలో రవ్వంత కూడా లోపం లేదు. 26 ప్రతి సంవత్సరాంతానా అబ్షాలోము తన తల వెండ్రుకలు కత్తిరించి తూచేవాడు. తూకం ప్రకారం రెండు వందల తులముల బరువు ఉండేవి. 27 అబ్షాలోముకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు తామారు. తామారు సౌందర్యవతి.
తనను వచ్చి చూడమని అబ్షాలోము యోవాబును బలవంత పెట్టుట
28 అబ్షాలోము యెరూషలేములో రెండు సంవత్సరాలున్నాడు. అయినా అతనికి రాజదర్శనం నిరాకరింపబడింది. 29 యోవాబు వద్దకు అబ్షాలోము దూతలను పంపాడు. ఈ దూతలు అబ్షాలోమును రాజు వద్దకు పంపమని అడిగారు. కాని యోవాబు అబ్షాలోము వద్దకు రాకపోయెను. రెండవసారి మరొక దూతను అబ్షాలోము పంపాడు. అయినా యోవాబు రావటానికి నిరాకరించాడు.
30 దానితో అబ్షాలోము తన సేవకులను పిలిచి ఇలా అన్నాడు: “చూడండి; యోవాబు పొలం నా పొలానికి పక్కనే వున్నది. తన పొలంలో యవల ధాన్యం పండివుంది. వెళ్లి ఆ యవలధాన్యాన్ని తగుల బెట్టండి.”
ఆ మాట మీద అబ్షాలోము సేవకులు వెళ్లి యోవాబు పొలంలో పంటకు నిప్పుపెట్టారు. 31 యోవాబు లేచి అబ్షాలోము ఇంటికి వెళ్లి, “నీ సేవకులు నా పంటను ఎందుకు తగులబెట్టారు” అని అడిగాడు.
32 యోవాబుతో అబ్షాలోము ఇలా అన్నాడు: “నీకు నేను వర్తమానం పంపాను. ఇక్కడికి నిన్ను రమ్మన్నాను. నేను నిన్ను రాజు వద్దకు పంపాలని అనుకున్నాను గెషూరు నుండి నన్ను ఆయన ఎందుకు రప్పించాడో నిన్ను పంపి అడిగించాలనుకున్నాను. నేను ఆయనను చూడలేను. కావున ఈ పరిస్థితుల్లో నేను గెషూరుకు పోయి అక్కడవుండటం మంచిది! ఇప్పుడు నాకు రాజదర్శనం ఏర్పాటు చేయుము. నేను పాపం చేస్తే ఆయన నన్ను చంపవచ్చు!”
అబ్షాలోము దావీదు రాజును దర్శించటం
33 అప్పుడు యోవాబు రాజు వద్దకు వచ్చి అబ్షాలోము అన్న మాటలన్నీ చెప్పాడు. రాజు అబ్షాలోమును పిలిపించగా, అబ్షాలోము వచ్చాడు. అబ్షాలోము రాజు ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. అప్పుడు రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు.
* 14:13 ఇవన్నీ … చేసుకుంటున్నావు తెకోవ స్త్రీ తన కుమారునికి, తనకు అనుకూలంగా ాజువద్దనుండి హామీ తీసుకున్నది. దావీదు రాజు కుమారుడైన అబ్షాలోము స్థితికూడ ఇంచుమించు అదే రకం. రాజుమాట రాజుకే అప్పజెప్పి, అబ్షాలోము విషయంలో కూడ రాజు మనస్సు మార్చి తగిన హామీ తీసుకొని ఆ స్త్రీ బయటపడి, బాహాటంగా మాట్లాడటం మొదలు పెట్టింది. 14:26 రెండు వందల తులములు ఆంగ్లేయ తూనిక ప్రకారం ఐదు పౌనులు. లేక ఆనాటి రాజకొలమానం ప్రకారం రెండువందల షెకెములు.