19
దావీదును యోవాబు మందలించటం
ప్రజలు ఈ వార్తను యోవాబుకు అందజేశారు. “చూడు, రాజు దుఃఖిస్తున్నాడు. అబ్షాలోము కొరకు చాలా విచారిస్తున్నాడు” అని వారు యోవాబుకు చెప్పారు. ఆ రోజు దావీదు సైన్యం యుద్ధంలో గెలిచింది. కాని అది వారందరికీ మిక్కిలి సంతాప దినంగా మారింది. విషాదమయ దినమయిన కారణమేమనగా “రాజు తన కుమారుని కొరకు మిక్కిలిగా విచారిస్తున్నాడని” ప్రజలంతా విన్నారు.
ప్రజలంతా నిశ్శబ్దంగా నగరంలోకి వచ్చారు. వారంతా యుద్ధంనుండి, పారిపోయి వచ్చిన వారిలా అగుపించారు. రాజు తన ముఖాన్ని కప్పుకున్నాడు. “నా కుమారుడా, అబ్షాలోమా; ఓ అబ్షాలోమా, నా కుమారుడా, నా కుమారుడా!” అని బిగ్గరగా ఏడ్వసాగాడు.
యోవాబు రాజు ఇంటికి వచ్చాడు. యోవాబు రాజుతో ఇలా అన్నాడు: “ఈ రోజు నీవు నీ ముఖాన్ని కప్పుకున్నావు. అంతేగాదు, నీవు నీ సేవకుల ముఖాలన్నీ సిగ్గుతో కప్పివేశావు! ఈ రోజు నీ సేవకులు నీ ప్రాణాన్ని కాపాడారు! వారు నీ కుమారుల ప్రాణాలను, కుమార్తెలను, భార్యలను, నీ దాసీలను — అందరినీ కాపాడారు. నీ సేవకులంతా సిగ్గుతో తలవంచు కున్నారు. కారణమేమంటే నిన్ను అసహ్యించుకునే వారిని నీవు ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించేవారిని నీవు అసహ్యించుకుంటున్నావు! నీ క్రింది అధికారులన్నా, నీ మనుష్యులన్నా నీకు లెక్కలేదని ఈ రోజు నీవు స్పష్టంచేశావు. నిజానికి అబ్షాలోము బతికి, మేమంతా చచ్చిపోయి వుంటే నీవు చాలా సంతోషపడి వుండేవాడివని ఈ రోజు నాకు విశదయమయింది! లెమ్ము. ఇప్పుడు నీ సేవకులందరితో మాట్లాడి, వారిని ప్రోత్సహించు! నేను యెహోవా మీద ఒట్టుపెట్టి చెప్తున్నాను. నీవు గనుక బయటికి వెళ్లి ఈ పని చేయకపోతే, రాత్రయ్యేసరికి నీతో ఒక్కడు కూడా వుండడు! నీ యవ్వనం నుండి ఇప్పటి వరకు నీవను భవించిన కష్టాలన్నిటికంటె, ఇప్పటి నీ పరిస్థితి చాలా అధ్యాన్నమవుతుంది.”
అప్పుడు రాజు నగరద్వారం* వద్దకు వెళ్లాడు. రాజు నగర ద్వారం వద్ద వున్నాడన్న వార్త వ్యాపించింది. అందుచే ప్రజలంతా ఆయనను చూసేందుకు వచ్చారు.
దావీదు మరల రాజవటం
అబ్షాలోమును అనుసరించిన ఇశ్రాయేలీయులంతా ఇండ్లకు పారిపోయారు. ఇశ్రాయేలు వంశాల ప్రజలందరూ ఒకరితో ఒకరు చర్చించటం మొదలు పెట్టారు. వారిలా అనుకున్నారు: “రాజైన దావీదు మనల్ని ఫిలిష్తీయులనుండి, తదితర శత్రువులనుండి కాపాడాడు. దావీదు అబ్షాలోముకు దూరంగా పారిపోయాడు. 10 మనల్ని పాలించటానికి అబ్షాలోమును ఎన్నుకున్నాము, కాని అతనిప్పుడు యుద్ధంలో చనిపోయాడు. కావున మనం మళ్లీ దావీదును రాజుగా చేసుకోవాలి.”
11 దావీదు రాజు యాజకులైన సాదోకుకు, అబ్యాతారుకు వర్తమానం పంపించాడు. దావీదు వారికిలా చెప్పాడు: “యూదా నాయకులతో మాట్లాడండి. వారితో, ‘రాజును (దావీదును) తిరిగి ఇంటికి తీసుకొని రావటంలో మీరెందుకు వెనుకబడి వున్నారు? చూడండి. ఇశ్రాయేలీయులంతా రాజును తిరిగి ఇంటికి తీసుకొని వచ్చే విషయం మాట్లాడుతున్నారు. 12 మీరంతా నా సోదరులు. మీరు నా కుటుంబం వారు అయినప్పుడు రాజును తిరిగి ఇంటికి తీసుకొని రావటంలో మీరెందుకు చివరివంశం వారవుతున్నారు?’ అని చెప్పండి. 13 అమాశాతో, ‘నీవు నా కుటుంబంలో భాగస్వామివి. నేను నిన్ను యోవాబు స్థానంలో సైన్యాధికారిగా చేయకపోతే దేవుడు నన్ను శిక్షించు గాక!’ అని కూడ చెప్పండి.”
14 దావీదు యూదా ప్రజలందరి హృదయాలను చూర గొన్నాడు. వారంతా ఒకటయ్యేలా చేశాడు. యూదా ప్రజలు దావీదుకు వర్తమానం పంపారు. “నీ సేవకులందరితో కలిసి తిరిగి రమ్ము” అని వారన్నారు.
15 అప్పుడు రాజు (దావీదు) యొర్దాను నది వద్దకు వచ్చాడు యూదా ప్రజలు రాజును కలవటానికి గిల్గాలుకు వచ్చారు. వారు రాజును యొర్దాను నదిని దాటించి తీసుకొని రావటానికి వచ్చారు.
దావీదును షిమీ క్షమాభిక్ష కోరటం
16 గెరా కుమారుడైన షిమీ బెన్యామీను వంశానికి చెందినవాడు. అతడు బహూరీములో నివసిస్తూండేవాడు. దావీదు రాజును కలవటానికి షిమీ వేగంగా ముందుకు వచ్చాడు. యూదా ప్రజలతో కలిసి షిమీ వచ్చాడు. 17 వేయిమంది బెన్యామీనీయులు కూడ షిమీతో వచ్చారు. సౌలు కుటుంబమువారి సేవకుడు సీబా కూడా వచ్చాడు. సీబా తన పదునైదుగురు కుమారులను ఇరవై మంది సేవకులను తనతో తీసుకొని వచ్చాడు. వీరంతా దావీదు రాజును కలవటానికి హుటాహుటిని యొర్దాను నది వద్దకు వెళ్లారు.
18 రాజ కుటుంబాన్ని యూదాకు తిరిగి తీసుకొని రావటంలో సహాయపడటానికి ప్రజలు యొర్దాను నదిని దాటి వెళ్లారు. రాజు ఏది కోరితే వారది చేయసాగారు. రాజు నదిని దాటుతూ వుండగా, గెరా కుమారుడైన షిమీ ఆయన వద్దకు వచ్చాడు. అతడు రాజు ముందు సాష్టాంగపడ్డాడు. 19 రాజుతో షిమీ ఇలా అన్నాడు, “నా ప్రభువా, నేను చేసిన పొరపాట్లను పట్టించుకోవద్దు! నా ప్రభువైన రాజా, నీవు యెరూషలేము వదిలి వెళ్లేటప్పుడు నేను నీ పట్ల చేసిన అపచారాలను మనసులో పెట్టుకోవద్దు. 20 పాపం చేసినట్లు నేను తెలుసుకున్నాను. అందువల్ల యోసేపు కుటుంబంలో నుండి నేను ముందుగా నిన్ను నా ప్రభువైన రాజును, కలుసుకోవాలని వచ్చాను.”
21 కాని సెరూయా కుమారుడైన అబీషై ఇలా అన్నాడు: “యెహోవాచే అభిషిక్తము చేయబడిన రాజునకు కీడు జరగాలని కోరుకున్నందుకు షిమీని మనం తప్పక చంపివేయాలి.”
22 దావీదు వారిని వారించి, వారితో, “సెరూయా కుమారులారా, మీకును — నాకును ఏమి పొందిక! ఈ రోజు మీరు నాకు వ్యతిరేకులయ్యారు! ఇశ్రాయేలులో ఏ ఒక్కడూ చంపబడడు. నాకు తెలుసు. ఈ రోజు నేను ఇశ్రాయేలుకు రాజును!” అని అన్నాడు.
23 ఆ తరువాత రాజు షిమీతో, “నీవు చంపబడవు” అని అన్నాడు. పైగా తనకై తాను షిమీని చంపనని రాజు అతనికి ప్రమాణం చేసి చెప్పాడు.
దావీదు దర్శనానికి మెఫీబోషెతు వెళ్లటం
24 సౌలు మనుమడైన మెఫీబోషెతు దావీదు రాజును కలియటానికి వచ్చాడు. రాజు యెరూషలేము వదిలి వెళ్లిన నాటినుండి ప్రశాంతంగా తిరిగి వచ్చేవరకు మెఫీబోషెతు కాళ్లు కడగలేదు; గడ్డం తీసుకోలేదు; తన బట్టలు కూడ ఉతుకుకొనలేదు. 25 మెఫీబోషెతు రాజును కలవటానికి యెరూషలేము నుండి వచ్చాడు. రాజు అతనిని చూచి, “మెఫీబోషెతూ, నేను యెరూషలేము నుండి పారిపోయినప్పుడు నీవెందుకు నాతో రాలేదు?” అని అడిగాడు.
26 అందుకు మెఫీబోషెతు ఇలా అన్నాడు: “నా ప్రభువైన రాజా, నా సేవకుడు (సీబా) నన్ను మోసం చేశాడు! నేను అవిటివాడిని గనుక నా సేవకుడైన సీబాను పిలిచి, ‘ఒక గాడిదపై గంత కట్టి సిద్ధం చేయమన్నాను. దానిపై రాజుతో వెళతానన్నాను.’ 27 కాని నా సేవకుడు నన్ను మోసగించాడు. నా గురించి నీకు చెడుగా చెప్పాడు. కాని నా ప్రభువైన రాజు దేవ దూతలాంటివాడు. నీకు ఏది మంచిదనిపించితే అది చేయుము. 28 నా తాత యొక్క కుటుంబాన్నంతటినీ నీవు చంపగలిగియుండే వాడివి. కాని నీవు అలా చేయలేదు. నీ బల్ల వద్ద భోజనం చేసే వారితో కలిసి తినే అర్హత నాకు కలిగించావు. కావున దేనిని గురించీ రాజుకు ఫిర్యాదు చేసే హక్కు నాకు లేదు!”
29 “ఇక నీ సమస్యల గురించి ఏమీ చెప్పకు! ఉన్న భూమిని నీకు, సీబాకు పంచాలని నిర్ణయించాను, అని రాజు మెఫీబోషెతుకు చెప్పాడు.
30 “సీబానే భూమినంతా తీసుకోనిమ్ము! ఎందువల్లనంటే నా ప్రభువైన రాజు శాంతంగా ఇంటికి తిరిగి వచ్చాడు గనుక” అని మెఫీబోషెతు రాజుతో అన్నాడు.
బర్జిల్లయిని తనతో యెరూషలేముకు రమ్మని దావీదు అడగటం
31 గిలాదీయుడగు బర్జిల్లయి రోగెలీ నుండి వచ్చాడు. అతడు రాజుతో యొర్దాను నదివద్దకు వచ్చాడు. రాజును నది దాటించటానికి ఆయనతో కూడ వెళ్లాడు. 32 బర్జిల్లయి పండు ముదుసలి. అతనికి ఎనభై సంవత్సరాలు. మహనయీములో దావీదువుండగా, బర్జిల్లయి ఆయనకు ఆహారాన్ని, తదితర వస్తువులను సమకూర్చాడు. బర్జిల్లయి గొప్ప ధనవంతుడు గనుక ఇవన్నీ చేయగలిగాడు. 33 దావీదు బర్జిల్లయితో ఇలా అన్నాడు, “నాతో నది దాటిరా, నాతో నీవు యెరూషలేములో నివసిస్తే నీ పోషణ బాధ్యత నేను తీసుకుంటాను.”
34 కాని బర్జిల్లయి రాజుతో ఇలా అన్నాడు: “నేను ఎంత వయో వృద్ధుడనో నీకు తెలుసా? నేను నీతో యెరూషలేముకు రాగాలనని నీవనుకుంటున్నావా? 35 నాకు ఎనుబది ఏండ్లు! మంచి చెడుల విచక్షణాజ్ఞానం కూడా తెలియనంత ముసలి వాడినయ్యాను. తినటానికి, తాగటానికి రుచులు కూడ తెలియనంత వయసు మళ్లిన వాడను. గాయనీ గాయకుల స్వరము వినలేనివాడిని. అటువంటి నన్ను గురించి నీవెందుకు చింత చేస్తున్నావు? 36 నీ నుండి నేను బహుమతులు కోరను! నీతో పాటు యోర్దాను నదిని దాటుతాను. 37 తరువాత దయచేసి నన్ను తిరిగి వెళ్లి పోనిమ్ము. అలా నేను నా స్వంత నగరంలో చనిపోయి, నాతల్లి దండ్రుల సమాధిలో వుంచబడతాను. నీ సేవకుడు కింహాము ఇక్కడే వున్నాడు. అతనిని నా ప్రభువైన నీతో తీసుకొని వెళ్లు. అతనితో నీకు ఏ పని కావాలంటే అది చేయించుకో.”
38 “కింహాము నాతోనే వస్తాడు. నీ కొరకు అతని పట్ల నేను దయగలిగి వుంటాను. నీ కొరకు నేనేమైనా చేస్తాను.” అని రాజు సమాధానమిచ్చాడు.
దావీదు ఇంటికి తిరిగి వెళ్లటం
39 రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని ఆశీర్వదించాడు. బర్జిల్లయి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. రాజు, అతని పరివారం నదిని దాటారు.
40 గిల్గాలుకు వెళ్లటానికి రాజు యొర్దాను నదిని దాటినప్పుడు, కింహాము కూడ అతనితో వెళ్లాడు. యూదా ప్రజలంతా, ఇశ్రాయేలు ప్రజలలో సగంమంది, దావీదును నది దాటించారు.
ఇశ్రాయేలీయులు యూదా వారితో వాదించటం
41 ఇశ్రాయేలీయులంతా రాజు వద్దకు వచ్చి, “యూదావారైన మా సోదరులు నిన్ను ఎత్తుకు పోయారు. మళ్లీ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరివారాన్నీ తిరిగి తీసుకొని వచ్చారు! ఎందువలన?” అని ప్రశ్నించారు.
42 యూదా ప్రజలంతా ఇశ్రాయేలీయులకు ఇలా సమాధానం చెప్పారు: “మేము ఆ విధంగా ఎందుకు చేశామంటే రాజు మాకు దగ్గర బంధువు కాబట్టి ఈ విషయంలో మీరు మా పట్ల ఎందుకు కోపంగావున్నారో తెలియటం లేదు. అయినా రాజు చేత ఖర్చు పెట్టించి మేము ఏమి తినలేదు! పైగా రాజు మాకు ఏమీ బహుమానాలు ఇవ్వనూలేదు!”
43 అప్పుడు ఇశ్రాయేలీయు ఇలా అన్నారు “రాజును ఎంపిక చేసుకోవటంలో మేము అత్యధిక సంఖ్యలో పాల్గొన్నాము. దావీదులో మాకు పది భాగాలున్నాయి.§ కావున దావీదుతో వ్యవహారానికి మీకంటె మాకే ఎక్కువ హక్కు వుంది! కాని మీరు మమ్మల్ని లక్ష్యపెట్టలేదు! ఎందువల్ల? నిజానికి రాజును తిరిగి తీసుకొని రావాలని మేము ముందుగా అనుకున్నాము!”
కాని యూదా ప్రజలు ఇశ్రాయేలీయులతో బాగా నిందారోపణ చేస్తూ చెడుగా మాట్లాడారు. యూదా వారి మాటలు ఇశ్రాయేలీయులు అన్నవాటికంటె చాలా తీవ్రంగా వున్నాయి.
* 19:8 నగర ద్వారం ఇక్కడే బహిరంగ సభలు కూడ జరుగుతాయి. 19:20 యోసేపు కుటుంబము బహుశః వీరు అబ్షాలోమును అనుసరించిన ఇశ్రాయేలీయులు కావచ్చు. ఉత్తర దేశపు వంశాలన్నిటికీ యోసేపు కుమారుల్లో ఒకడైన ఎఫ్రాయిము పేరు అనేక పర్యాయాలు వాడబడింది. 19:23 షిమీని … చెప్పినా షిమీని దావీదు చంపలేదు. కాని దావీదు కుమారుడు సొలోమోను కొన్న సంవత్సరాల తరువాత షిమీని చంపటానికి ఆజ్ఞ యిచ్చాడు. చూడండి 1 రాజులు 2:44-46. § 19:43 దావీదులో … భాగాలున్నాయి రాజ్య విభజన జరిగినప్పుడు యూదావారు, బెన్యామీనీయులు కలసి యూదా రాజ్యంగా ఏర్పడ్డారు. మిగిలిన పది వంశాలవారు ఇశ్రాయేలు రాజ్యంలో ఉండి.