3
ప్రధాన యాజకుని గూర్చిన దర్శనం
1 పిమ్మట దేవదూత ప్రధాన యాజకుడైన యెహోషువను నాకు చూపించాడు. యెహోవా దూత ముందు యెహోషువ నిలబడి ఉన్నాడు. యెహోషువాకి కుడి పక్కగా సాతాను నిలబడి ఉన్నాడు. యెహోషువ మీద చెడు పనులు చేసినట్లునింద మోపటానికి సాతాను అక్కడ ఉన్నాడు.
2 అప్పుడు యెహోవా దూత ఇలా చెప్పాడు: “సాతానూ, యెహోవా నిన్ను విమర్శించు గాక నీవు అపరాధివని యెహోవా తీర్పు ఇచ్చుగాక! యెరూషలేమును యెహోవా తన ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఆ నగరాన్ని రక్షించాడు. అది నిప్పులోనుండి లాగిన మండే కట్టెలా ఉంది.”
3 యెహోషువ దేవదూత ముందు నిలుచున్నాడు. యెహోషువ ఒక మురికి వస్త్రం ధరించివున్నాడు.
4 అప్పుడు దేవదూత తనవద్ద నిలబడిన ఇతర దేవ దూతలతో, “యెహోషువ వేనుకున్న మురికి వస్త్రాలను తీసివేయండి” అని చెప్పాడు. పిమ్మట దేవదూత యెహోషువతో మాట్లాడినాడు. అతడు ఇలా అన్నాడు: “ఇప్పుడు నీ నేరాన్ని నేను తీసివేశాను. నీకు నూతన వస్త్రాలను ఇస్తున్నాను.”
5 అప్పుడు నేను, “అతని తలపై శుభ్రమైన తలపాగా ఉంచు” అని అన్నాను. కావున ఒక శుభ్రమైన తల పాగాను వారతని తలపై పెట్టారు. యెహోవా దూత అక్కడ నిలబడి వుండగా వారు అతనికి నూతన వస్త్రాలు తొడిగారు.
6 పిమ్మట యెహోషువాకు యెహోవా దేవదూత ఈ విషయాలు చెప్పాడు:
7 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు:
“నేను చెప్పిన విధంగా జీవించు.
నేను చెప్పినవన్నీ చెయ్యి.
నీవు నా ఆలయానికి అధి కారినిగా ఉంటావు.
నీవు దాని ఆవరణ విషయం శ్రద్ధ తీసుకుంటావు.
ఇక్కడ నిలబడిన దేవదూతలవలె
నీవు నా ఆలయంలో ఎక్కడికైనా వెళ్లటా నికి నీకు స్వేచ్ఛ ఉంది.
8 కావున యెహోషువ, నీవూ, నీతో వున్న ప్రజలూ నేను చెప్పేది తప్పక వినాలి.
నీవు ప్రధాన యాజకుడవు. నీతో ఉన్న జనులు నిజంగా అద్భుతాలు నెరవేర్చగలరు.
నేను నిజంగా నా వ్రత్యేక సేవకుని తీసుకువస్తాను.
అతడు ‘కొమ్మ’ ( చిగురు ) అని పిలువబడతాడు.
9 చూడండి, యెహోషువ ముందు నేనొక రాతిని పెట్టాను.
ఆ రాతికి ఏడు పక్కలు ( కండ్లు ) ఉన్నాయి.
ఆ రాతి మీద నేనొక ప్రత్యేక వర్తమానం చెక్కుతాను.
నేను ఒక్క రోజులో ఈ దేశంలోని పాపాలన్నీ తీసివేస్తానని ఇది తెలియ జేస్తుంది.”
10 సర్వశక్తిమంతుడైన యెహోవా చెవుతున్నాడు:
“ఆ సమయంలో ప్రజలు తమ స్నేహితులతోను,
పొరుగువారితోను కూర్చొని మాట్లాడుకుంటారు.
ప్రతి ఒక్కడూ తన అంజూరపు చెట్టు కింద,
తన ద్రాక్షాలత క్రింద ప్రశాంతంగా కూర్చుంటాడు.”