2
ప్రజలు వారి జీవితాలు మార్చుకోవాలి అని యెహోవా అడగటం
1 సిగ్గులేని ప్రజలారా మీ జీవితాలు మార్చుకోండి.
2 అదీ, మీరు వాడిపోయి చనిపోతున్న పుష్పంలా కాకముందే. పగటి ఎండకు ఒక పుష్పం వాడిపోతుంది, చనిపోతుంది. యెహోవా తన భయంకర కోపం చూపించినప్పుడు మీరు అలానే ఉంటారు. కనుక మీ మీద యెహోవా కోపపు రోజు వస్తుంది మీ బతుకులు మార్చుకోండి!
3 దీనులైన సర్వజనులారా, యెహోవా దగ్గరకు రండి! ఆయన చట్టాలకు విధేయులుగా ఉండండి. మంచి పనులు చేయటం నేర్చుకోండి. వినయంగా ఉండటం నేర్చుకోండి. ఒకవేళ అప్పుడు యెహోవా తన కోపం చూపించేవేళ మీరు క్షేమంగా ఉంటారేమో.
ఇశ్రాయేలీయుల పొరుగువారిని యెహోవా శిక్షిస్తాడు
4 గాజాలో ఏ ఒక్కరూ విడువబడరు. అష్యెలోను నాశనం చేయబడుతుంది. మధ్యాహ్నానికల్లా అష్డోదునుండి ప్రజలు బలవంతంగా వెళ్లగొట్టబడతారు. ఎక్రోను శూన్యం అవుతుంది!
5 ఫిలిష్తీ ప్రజలారా, సముద్ర తీరంలో నివసించే ప్రజలారా, యెహోవా దగ్గరనుండి వచ్చిన ఈ సందేశం మిమ్మల్న గూర్చిందే. కనాను దేశమా, పాలస్తీనా దేశమా, నీవు నాశనం చేయ బడతావు-అక్కడ ఎవ్వరూ నివసించరు!
6 సముద్రం పక్కన ఉన్న మీ దేశం గొర్రెల కాపరులకు, వారి గొర్రెలకు బంజరు పొలాలుగా అవుతుంది.
7 అప్పుడు యూదా వారిలో శేషించిన వారికి ఆ దేశం చెందుతుంది. ఆ యూదా ప్రజలను యెహోవా జ్ఞాపకం చేసు కొంటాడు. ఆ ప్రజలు ఒక విదేశంలో బందీలుగా ఉన్నారు. కాని యెహోవా వారిని వెనుకకు తీసుకొని వస్తాడు. అప్పుడు యూదా ప్రజలు ఆ పొలాల్లో తమ గొర్రెలను గడ్డి మేయనిస్తారు. రాత్రిళ్ళు అవి అష్యెలోను ఖాళీ ఇండ్లలో పండుకొంటాయి.
8 యెహోవా ఇలా అంటున్నాడు: “మోయాబు మరియు అమ్మోను ప్రజలు ఏమి చేసారో నాకు తెలుసు! ఆ ప్రజలు నా ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఆ ప్రజలు వారి స్వంత దేశాలను విశాల పరచు కొనేందుకు వారి భూమిని తీసుకొన్నారు.
9 కనుక నేను బ్రతికి ఉన్నంత నిశ్చయంగా, మోయాబు మరియు అమ్మోను ప్రజలు సొదొమ, గొమొర్రాల్లా నాశనం చేయబడుతారు. నేను ఇశ్రాయేలీయుల దేవుడను, సర్వశక్తిగల యెహోవాను. ఆ దేశాలు శాశ్వతంగా సర్వనాశనం చేయబడతాయని ెనేను వాగ్దానం చేస్తున్నాను. వారి దేశంనిండా కలుపు మొక్కలు పెరిగి పొతాయి. వారి దేశం మృత సముద్రపు ఉప్పుచేత కప్పబడిన దేశంలా ఉంటుంది. నా ప్రజలలో శేషించినవారు ఆ దేశాన్ని, అందులో మిగిలిన వాటన్నింటినీ తీసుకొంటారు.”
10 మోయాబు మరియు అమ్నోను ప్రజలు గర్వపడి, దేవుని ప్రజలను గేళిచేసి, సర్వశక్తిగల యెహోవా ప్రజల పట్ల క్రూరంగా పవర్తించారు. వారిని అవమాన పర్చారు. కనుక వాళ్లకు అవి జరిగే తీరుతాయి.
11 ఆ ప్రజలు యెహోవాకు భయపడుతారు. ఎందుకంటే యెహోవా వారి దేవతలను నాశనం చేస్తాడు గనుక. అప్పుడు దూర దేశాలన్నింటిలోని మనుష్యులందరూ యెహోవాను ఆరాధిస్తారు.
12 కూషీయులారా, దీని అర్థం మీరు కూడాను! యెహోవా ఖడ్గం మీ ప్రజలను కూడా చంపుతుంది.
13 మరియు యెహోవా ఉత్తరంగా తిరిగి అష్షూరును శిక్షిస్త్తాడు. నీనెవెను ఆయన నాశనం చేస్తాడు-ఆ పట్టణం ఎండిన ఎడారిలా శూన్యంగా ఉంటుంది.
14 అప్పుడు గొర్రెలు, అడవి జంతువులు మాత్రమే శిథిలమైన ఆ పట్టణంలో నివసిస్త్తాయి. అక్కడ మిగిలిపోయిన స్తంభాలమీద గుడ్లగూబలు, కాకులు కూర్చుంటాయి. వాటి అరువులు కిటికీల గుండా వినిపిస్తాయి. గుమ్మాల మీద కాకులు కూర్చుంటాయి. ఆ ఖాళీ ఇండ్లలో నల్ల పక్షులు కూర్చుంటాయి.
15 నీనెవె ఇప్పుడు ఎంతో గర్వంగా ఉంది. అది చాలా సంతోషంలో నిండిన పట్టణంగా ఉంది. ఆ ప్రజలు క్షేమంగా ఉన్నామని తలుస్తున్నారు. ప్రపంచ మంతటిలో నీనెవె పట్టణమే మహా గొప్ప పట్టణమని వారు తలుస్తున్నారు. కాని ఆ పట్టణం నాశనం చేయబడుతుంది! అది అడవి జంతువులు పండు కొనేందుకు వెళ్లే శూన్య ప్రదేశం అవుతుంది. ఆ స్థలం ప్రక్కగా వెళ్ళే మనుష్యులు ఆ పట్టణం అంత విపరితంగా నాశనం చేయబడటం చూసినప్పుడు వారు తలలు ఊవుతూ ఈలలు వేస్తారు.