6
చెర తప్పనిసరి
సీయోనులో హాయిగా సుఖపడే వారికి బాధ తప్పదు.
సమరయ కొండల మీద దర్జాగా బతికే వారికి బాధ తప్పదు.
ఇశ్రాయేలు వారికి సలహాదారులుగా ఉన్న గొప్ప రాజ్యాల్లోని ముఖ్య పెద్దలకు బాధ తప్పదు.
మీ నాయకులు ఇలా చెబుతున్నారు, కల్నేకు వెళ్లి చూడండి.
అక్కడ నుంచి హమాతు అనే గొప్ప పట్టణానికి వెళ్ళండి.
ఆ తరువాత ఫిలిష్తీయుల పట్టణం గాతు వెళ్ళండి.
అవి మీ రెండు రాజ్యాలకంటే గొప్పవి కావా?
వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటే విశాలమైనవి కావా?
విపత్తు రోజు దూరంగా ఉందనుకుని
దౌర్జన్య పాలన త్వరగా రప్పించిన వారవుతున్నారు.
వాళ్ళు దంతపు మంచాల మీద పడుకుని,
పరుపుల మీద ఆనుకుని కూర్చుంటారు.
మందలోని గొర్రె పిల్లలను, సాలలో కొవ్విన దూడలను కోసుకుని తింటారు.
తీగ వాయిద్యాల సంగీతంతో పిచ్చిపాటలు పాడుతూ
దావీదులాగా వాయిద్యాలను మరింత మెరుగ్గా వాయిస్తారు.
ద్రాక్షారసంతో పాత్రలు నింపి తాగుతారు.
పరిమళ తైలాలు పూసుకుంటారు కానీ
యోసేపు వంశం వారికి వచ్చే నాశనానికి విచారించరు.
కాబట్టి బందీలుగా వెళ్లే వారిలో వీళ్ళే మొదట వెళతారు.
సుఖభోగాలతో జరుపుకునే విందు వినోదాలు ఇక ఉండవు.
ఇశ్రాయేలు గర్వం అణచివేత
“యాకోబు వంశీకుల గర్వం నాకు అసహ్యం.
వారి రాజ భవనాలంటే నాకు ద్వేషం.
కాబట్టి వారి పట్టణాన్ని దానిలో ఉన్నదంతా ఇతరుల వశం చేస్తాను.
నేను, ప్రభువైన యెహోవాను.
నా తోడని ప్రమాణం చేశాను.”
సేనల దేవుడు, యెహోవా ప్రభువు వెల్లడించేది ఇదే.
ఒక్క కుటుంబంలో పదిమంది మిగిలి ఉన్నా వాళ్ళంతా చస్తారు. 10 వాళ్ళ శవాలను ఇంట్లో నుంచి తీసుకు పోడానికి ఒక బంధువు వాటిని దహనం చేసే వాడితోపాటు వచ్చి, ఇంట్లో ఉన్న వాడితో “నీతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా?” అని అడిగితే ఆ వ్యక్తి “లేడు” అంటాడు. “మాట్లాడకు. మనం యెహోవా పేరు ఎత్తకూడదు” అంటాడు.
11 ఎందుకంటే గొప్ప కుటుంబాలు,
చిన్న కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి, అని
మీకు యెహోవా ఆజ్ఞ ఇస్తాడు.
12 గుర్రాలు బండల మీద పరుగెత్తుతాయా?
అలాంటి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుతారా?
అయితే మీరు న్యాయాన్ని విషతుల్యం చేశారు.
13 లొదెబారు* పట్ల ఆనందించే మీరు,
“మా సొంత బలంతో కర్నాయింను వశం చేసుకోలేదా?” అంటారు.
14 అయితే సేనల దేవుడు, యెహోవా ప్రభువు చెప్పేది ఇదే,
“ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికి ఒక రాజ్యాన్ని రప్పిస్తాను.
వాళ్ళు లెబో హమాతు ప్రదేశం మొదలు అరాబా వాగు వరకూ
మిమ్మల్ని బాధిస్తారు.”
* 6:13 6:13 లొదెబారు ఏమిలేదు 6:13 6:13 కర్నాయిం కొమ్ములు; కొమ్ము బలం సూచిస్తుంది