12
దేవుని సంఘంలో పరిచర్య, ఆరాధనకై ఆత్మ వరాలు
1 సోదరీ సోదరులారా, ఆత్మవరాలను గూర్చి మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు.
2 పూర్వం మీరు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఎటుబడితే అటు కొట్టుకుపోతూ మూగవిగ్రహాలను ఆరాధించేవారని మీకు తెలుసు.
3 అందుచేత నేను మీతో చెప్పేదేమంటే, దేవుని ఆత్మ వలన మాట్లాడే వారెవరూ, “యేసు శాపగ్రస్తుడు” అని చెప్పరు. అలాగే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరూ, “యేసే ప్రభువు” అని చెప్పలేరు.
ఆత్మవరాల వాడకమే నిజమైన పరిచర్య
ఎఫెసీ 4:7-16
4 దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన అనుగ్రహించే కృపావరాలు వేరు వేరు.
5 అలాగే ప్రభువు ఒక్కడే గాని పరిచర్యలు వేరు వేరు విధాలు.
6 వేరు వేరు కార్యాలు ఉన్నాయి గాని అందరిలో, అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే.
7 అందరి ప్రయోజనం కోసం ప్రతి ఒక్కడికీ ఆత్మ తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు.
8 ఎలా అంటే, ఒకే ఆత్మ ఒకడికి బుద్ధి వాక్కు, ఒకడికి జ్ఞాన వాక్కు,
9 మరొకడికి విశ్వాసం, మరొకడికి స్వస్థత వరం ఇస్తాడు.
10 ఆ ఆత్మే ఒకడికి అద్భుతాలు చేసే శక్తి, మరొకడికి ప్రవచనాలు పలికే శక్తి, మరొకడికి ఆత్మలను గుర్తించే శక్తి, మరొకడికి వివిధ రకాల భాషలు మాట్లాడే సామర్ధ్యం, మరొకడికి ఆ భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహిస్తున్నాడు.
11 ఆ ఆత్మ ఒక్కడే ఇవన్నీ చేస్తూ తనకు నచ్చినట్టు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచిపెడుతున్నాడు.
ప్రతి విశ్వాసి క్రీస్తు శరీరంలో భాగమే గనక ప్రతి ఒక్కరికీ స్పష్టమైన పరిచర్య ఉంది
12 శరీరం ఒక్కటే, అందులో అనేక అవయవాలు ఉన్నాయి. అవన్నీ ఒకే శరీరంలో అవయవాలైనా శరీరం ఒకటే. క్రీస్తు కూడా అలానే ఉన్నాడు.
13 ఎలాగంటే, యూదులైనా, గ్రీకులైనా, దాసులైనా, స్వతంత్రులైనా, మనమంతా ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మలోనే బాప్తిసం పొందాం. మనమంతా ఒకే ఆత్మను పానం చేశాం.
14 శరీరం అంటే ఒక్క అవయవమే కాదు, అది అనేక అవయవాలతో ఉంది.
15 పాదం ‘నేను చేతిని కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు’ అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు.
16 అలాగే చెవి ‘నేను కన్ను కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు’ అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు.
17 శరీరమంతా ఒక్క కన్నే ఉంటే ఇక వినడం ఎలా? శరీరమంతా ఒక్క చెవే అయితే వాసన ఎలా చూడాలి?
18 అందుకే దేవుడు ప్రతి అవయవాన్నీ తన ఇష్టం ప్రకారం శరీరంలో ఉంచాడు.
19 అవన్నీ ఒకే అవయవం అయితే శరీరమేది?
20 అయితే ఇప్పుడు అవయవాలు అనేకం, శరీరం మాత్రం ఒక్కటే.
21 కాబట్టి కన్ను చేతితో, “నీవు నాకక్కర లేదు” అనీ, తల పాదాలతో, “మీరు నాకక్కర లేదు” అనీ చెప్పడానికి వీలు లేదు.
22 అంతేకాక, శరీరంలో బలహీనంగా కనిపించే అవయవాలు ఎక్కువ అవసరమైనవి.
23 శరీరంలో ఘనత లేనివని తలంచే అవయవాలను మరి ఎక్కువగా ఘనపరుస్తాం. అందం లేదని తలచే అవయవాలకు ఎక్కువ అందాన్ని కలిగిస్తాం.
24-25 అందమైన అవయవాలకు మరింత అందం అక్కర లేదు. ఆ విధంగా దేవుడు శరీరంలో వివాదాలు రాకుండా అవయవాలన్నీ ఒకదాని పట్ల మరొకటి శ్రద్ధ వహించేలాగా, తక్కువ దానికే ఎక్కువ ఘనత కలిగించి, శరీరాన్ని అమర్చాడు.
26 కాబట్టి ఒక అవయవం బాధపడితే మిగిలిన అవయవాలన్నీ దానితో కలిసి బాధపడతాయి. ఒకటి ఘనత పొందితే అవయవాలన్నీ దానితో కలిసి సంతోషిస్తాయి.
27 మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు.
28 దేవుడు సంఘంలో మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో ఉపదేశకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరం గలవారిని, ఉపకారాలు చేసేవారిని, కార్యాలు పర్యవేక్షించేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించాడు.
29 అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధకులు కారు, అందరూ అద్భుతాలు చేయరు.
30 అందరికీ స్వస్థత వరం లేదు. అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్థం చెప్పలేరు.
31 కృపావరాల్లో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో కోరుకోండి. అయితే నేను వీటన్నిటికీ మించిన సర్వ శ్రేష్ఠ మార్గాన్ని మీకు చూపిస్తాను.