3
శరీర సంబంధమైన స్థితి ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవరోధకం
1 సోదరులారా, ఆత్మసంబంధులైన మనుషులతో మాట్లాడే విధంగా నేను మీతో మాట్లాడ లేకపోయాను. శరీర స్వభావం గలవారితోనూ, క్రీస్తులో పసిబిడ్డలతోనూ మాట్లాడే విధంగా మీతో మాట్లాడవలసి వచ్చింది.
2 మిమ్మల్ని పాలతోనే పెంచాను గాని బలమైన ఆహారం తినిపించలేదు. ఇప్పుడు కూడా మీరు దాన్ని తీసుకునే స్థితిలో లేరు.
3 ఎందుకంటే మీరింకా శరీర స్వభావంతోనే ఉన్నారు. మీ మధ్య అసూయ, కలహం ఉన్నాయి. దాన్ని బట్టి మీరు శరీర స్వభావం కలిగి మానవ రీతిగా నడచుకొనేవారే కదా?
4 మీలో ఒకడేమో “నేను పౌలుకు చెందినవాణ్ణి,” మరొకడు “నేను అపొల్లోకు చెందిన వాణ్ణి,” అని చెబుతూ ఉంటే మీరు శరీర స్వభావులే కదా
5 అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? ఇద్దరూ పరిచారకులే గదా. ఇద్దరికీ ప్రభువు ఇచ్చిన బాధ్యతలకు అనుగుణంగా వారి ద్వారా మీరు నమ్మారు.
6 నేను నాటాను, అపొల్లో నీరు పోశాడు. అయితే దాన్ని నీరు పోశాడు చేసింది దేవుడే.
7 కాబట్టి పెరిగేలా చేసిన దేవునిలోనే ఉంది గాని, నాటేవాడిలో గాని, నీరు పోసేవాడిలో గాని ఏమీ లేదు.
8 నాటే వాడూ నీరు పోసేవాడూ ఒక్కటే. ఒక్కొక్కరు కష్టపడిన కొద్దీ ప్రతిఫలం పొందుతారు.
9 మేము దేవునితో కలిసి పని చేసే వాళ్ళం. మీరు దేవుని పొలం, దేవుని కట్టడం.
క్రైస్తవ సేవ, దాని ప్రతిఫలాలు
10 దేవుడు నాకు దయచేసిన కృప వలన నేను నైపుణ్యం గల నిర్మాణకునిగా పునాది వేశాను. మరొకడు దాని మీద నిర్మిస్తున్నాడు. అయితే దాని మీద కడుతున్న ప్రతి ఒక్కరూ తాము ఏ విధంగా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి.
ఒకే పునాది
11 పునాది యేసు క్రీస్తే. వేసిన ఈ పునాది కాక, వేరే పునాది ఎవరూ వేయలేరు.
రెండు రకాల పరిచర్యలు, వాటి ఫలితాలు
12 ఈ పునాది మీద ఎవరైనా బంగారం, వెండి, విలువైన రాళ్ళు, చెక్క, చెత్త పరకలు, ఇలాటి వాటితో కడితే
13 వారి వారి పని బయట పడుతుంది. ఆ రోజు దాన్ని స్పష్టంగా వెల్లడి చేస్తుంది. ఎందుకంటే అది అగ్నివల్ల బయట పడుతుంది. ప్రతి ఒక్కరి పనినీ మంటలే పరీక్షిస్తాయి.
14 పునాది మీద ఎవరి పని నిలబడుతుందో అతనికి ప్రతిఫలం దొరుకుతుంది.
15 ఎవరి పని కాలిపోతుందో అతనికి నష్టం వస్తుంది. అతడు తప్పించుకుంటాడు గానీ మంటల్లో నుండి తప్పించుకొన్నట్టుగా ఉంటాడు.
16 మీరు దేవుని ఆలయమనీ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనీ మీకు తెలియదా?
17 దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు అతణ్ణి పాడు చేస్తాడు. దేవుని ఆలయం పవిత్రమైనది. ఆ ఆలయం మీరే.
18 ఎవరూ తనను తాను మోసగించుకోవద్దు. మీలో ఎవరైనా ఈ లోకరీతిగా తాను జ్ఞానం గలవాడిని అనుకుంటే, జ్ఞానం పొందడం కోసం అతడు తెలివి తక్కువవాడు కావాలి.
19 ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి తెలివి తక్కువతనమే. “జ్ఞానులను వారి కుయుక్తుల్లోనే ఆయన పట్టుకుంటాడు” అనీ,
20 “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థం అని ప్రభువుకు తెలుసు” అనీ రాసి ఉంది కదా.
21 కాబట్టి మనుషులను బట్టి ఎవరూ అతిశయించ కూడదు. ఎందుకంటే అన్నీ మీవే.
22 పౌలైనా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, అన్నీ మీవే.
23 మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవాడు.