2
కార్యాచరణలో పౌలు పద్ధతులు-వివరణ
1 నేను బాధ కలిగించేలా మీ దగ్గరికి తిరిగి రాకూడదని నా అంతట నేనే నిశ్చయించుకున్నాను.
2 నేను మీకు బాధ కలిగిస్తే బాధ పొందినవాడు తప్ప ఇంకెవరు నన్ను సంతోషపరచగలరు?
3 నేను వచ్చేటప్పుడు ఎవరి వలన నాకు సంతోషం కలగాలో వారి వలన నాకు దుఃఖం కలగకుండా ఉండాలని ఈ సంగతి మీకు రాశాను. నా సంతోషమే మీ అందరి సంతోషమని నా నమ్మకం.
4 మీకు బాధ కలగాలని కాదు, మీ పట్ల నాకున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఎంతో బాధతో, హృదయ వేదనతో, కన్నీళ్ళు కారుస్తూ రాశాను.
5 ఎవరైనా నాకు బాధ కలగజేసి ఉంటే, నాకు మాత్రమే కాదు, కొంతవరకూ మీకందరికీ బాధ కలగజేశాడు (ఇంతకంటే కఠినంగా మాట్లాడడం నాకిష్టం లేదు).
6 అలాంటి వాడికి మీలో ఎక్కువమంది వలన కలిగిన ఈ శిక్ష చాలు.
7 కాబట్టి మీరిక అతణ్ణి శిక్షించకుండా క్షమించి, ఆదరించడం మంచిది. లేకపోతే అతడు అధిక దుఃఖంలో మునిగిపోతాడేమో.
8 అందుచేత అతని పట్ల మీ ప్రేమ స్థిరపరచమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.
9 మీరన్ని విషయాల్లో విధేయులై ఉంటారో లేదో అని మిమ్మల్ని పరీక్షించేందుకే అలా రాశాను.
10 మీరు ఎవరినైనా దేని గురించి అయినా క్షమిస్తే నేనూ అతన్ని క్షమిస్తాను.
11 నేను దేనినైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండా, మీ కోసం, క్రీస్తు ముఖం చూసి క్షమించాను. సాతాను ఎత్తుగడలు మనకు తెలియనివి కావు.
12 క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయ పట్టణానికి వచ్చినప్పుడు, ప్రభువు నాకు ద్వారం తెరిచాడు. అయినా నా సోదరుడు తీతు కనిపించకపోవడంతో
13 నాకు మనశ్శాంతి లేక, వారి దగ్గర సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియకు బయలుదేరాను.
విజయవంతమైన పరిచర్య
14 దేవుడు క్రీస్తులో విజయ సూచకమైన తన ఊరేగింపులో మమ్మల్ని ఎప్పుడూ నడిపిస్తున్నాడు. క్రీస్తును గురించిన జ్ఞాన పరిమళాన్ని మా ద్వారా అంతటా గుబాళించేలా చేస్తున్న ఆయనకు ధన్యవాదాలు.
15 విమోచన పొందుతున్న వారిమధ్య, నాశనమైపోతున్న వారిమధ్య, మేము దేవునికి క్రీస్తు పరిమళంగా ఉన్నాము.
16 నాశనమైపోతున్న వారికి మరణపు వాసనగా, విమోచన పొందుతున్న వారికి జీవపు సువాసనగా ఉన్నాము. వీటికి యోగ్యులెవరు?
17 దేవుని వాక్యాన్ని లాభం కోసం చాలామంది అమ్మేస్తున్నారు. మేము అలాంటి వాళ్ళం కాదు. మేమైతే సదుద్దేశంతో ఉన్నాం. దేవుడు మమ్మల్ని పంపించాడు. క్రీస్తులో దేవుని ఎదుట బోధిస్తున్నాం.