2
నెబుకద్నెజరు స్వప్నం
1 రాజైన నెబుకద్నెజరు పాలన కాలం రెండవ సంవత్సరంలో అతనికి నిద్రలో కలలు వచ్చాయి. ఆ కలలను బట్టి అతడు కలవరం చెందాడు. అతనికి నిద్రపట్టడం లేదు.
2 తనకు వచ్చిన కలలను గూర్చి తెలియజేయడానికి శకునాలు చెప్పేవాళ్ళను, గారడీ విద్యలు చేసేవాళ్ళను, మాంత్రికులను, జోతిష్యులను పిలవమని ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళందరూ వచ్చి రాజు ఎదుట నిలబడ్డారు.
3 రాజు వాళ్ళతో “నాకు నిద్రలో కలలు వచ్చాయి. ఆ కలల అర్థం తెలుసుకోవాలని నేను ఎంతో ఆదుర్దా పడుతున్నాను” అని చెప్పాడు.
4 అప్పుడు జోతిష్యులు సిరియా భాషలో “రాజు చిరకాలం జీవించు గాక. మీ దాసులమైన మాకు ఆ కలలు ఏమిటో చెప్పండి. దాని భావం మీకు వివరిస్తాం” అన్నారు.
5 అప్పుడు రాజు “నాకు వచ్చిన కలలను నేను మరచిపోయాను. మీరు నాకు వచ్చిన కలను, దాని భావాన్ని చెప్పాలి. చెప్పని పక్షంలో మిమ్మల్ని ఖండ ఖండాలుగా నరికిస్తాను. మీ ఇళ్ళను నేలమట్టం చేయిస్తాను.
6 కలనూ దాని భావాన్నీ చెప్పిన వాళ్ళకు కానుకలు, బహుమతులు ఇస్తాను. వాళ్ళు నా సమక్షంలో సత్కరిస్తాను. కాబట్టి నా కలను, దాని భావాన్ని చెప్పండి” అన్నాడు.
7 అప్పుడు వాళ్ళంతా “రాజా, మీకు వచ్చిన ఆ కలను మీ దాసులమైన మాకు చెప్పిన పక్షంలో మేము దాని భావం చెబుతాము” అని మళ్ళీ జవాబిచ్చారు.
8 అప్పుడు రాజు “నాకు వచ్చిన కలను నేను మరచిపోవడం వల్ల మీరు తాత్సారం చేయాలని చూస్తున్నట్టు నేను గ్రహించాను.
9 నా సన్నిధిలో అబద్ధాలు, వంచన మాటలు పలుకుతూ యుక్తిగా కాలయాపన చేయాలని చూస్తున్నారు. మీరు నాకు వచ్చిన కల ఏమిటో చెప్పకపోతే నేను కచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాను కాబట్టి ముందు నాకు వచ్చిన కల ఏమిటో చెప్పండి. అప్పుడు ఆ కలకు అర్థం చెప్పడానికి మీకు సామర్థ్యం ఉందని నేను తెలుసుకుంటాను” అన్నాడు.
10 అప్పుడు జోతిష్యులు ఇలా జవాబిచ్చారు. “రాజు అడిగిన విషయం చెప్పగలిగినవాడు భూమి మీద ఎవ్వడూ లేడు. ఇంతవరకూ ఏ చక్రవర్తి, ఏ రాజూ, ఏ పరిపాలకుడూ ఇలాంటి విషయం చెప్పమని ఏ జోతిష్యుడినీ, మాంత్రికుడినీ, శకునజ్ఞుడినీ కోరలేదు.
11 రాజు తెలుసుకోవాలని కోరిన విషయం కష్టతరం. దీన్ని దేవుళ్ళు తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. దేవుళ్ళు మనుషుల మధ్య నివసించరు గదా.”
12 అది విని రాజు తీవ్ర కోపం తెచ్చుకున్నాడు. బబులోను దేశంలో ఉన్న జ్ఞానులనందరినీ హతమార్చాలని ఆజ్ఞ జారీ చేశాడు.
13 జ్ఞానులను హతమార్చాలని రాజు ఇచ్చిన ఆజ్ఞను అమలు చేయడానికి సైనికులు బయలుదేరారు. ఆ క్రమంలో దానియేలును, అతని స్నేహితులను కూడా చంపాలని వెదుకుతున్నారు.
14 బబులోనులో ఉన్న జ్ఞానులను చంపడానికి బయలుదేరిన సైనిక దళం అధిపతి అర్యోకు దగ్గరికి దానియేలు వెళ్ళాడు. అతనితో జ్ఞానయుక్తంగా మాట్లాడాడు.
15 రాజు ఇలాంటి ఆజ్ఞ ఇంత త్వరగా ఎందుకు జారీ చేశాడని అడిగాడు. అర్యోకు జరిగిన విషయమంతా దానియేలుకు వివరించాడు.
16 దానియేలు రాజుకు వచ్చిన కల భావం తెలియజేయడానికి తనకు కొంత గడువు ఇవ్వమని రాజు దగ్గర అనుమతి తీసుకున్నాడు.
17 తరువాత దానియేలు తన ఇంటికి వెళ్ళి తన స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలకు విషయం తెలియజేశాడు.
18 తనకు, తన స్నేహితులకు, బబులోనులో ఉన్న మిగిలిన జ్ఞానులకు రాబోతున్న ఆపద తప్పిపోయేలా రాజుకు వచ్చిన కల, ఆ కల భావం తెలియడానికి పరలోకంలో ఉన్న దేవుని నుండి దయ కలిగేలా దేవుణ్ణి వేడుకొమ్మని వాళ్ళను హెచ్చరించాడు.
19 ఆ రాత్రి సమయంలో దానియేలుకు దర్శనంలో ఆ కల, కల అర్థం వెల్లడైనాయి. దీన్నిబట్టి దానియేలు పరలోకంలో ఉన్న దేవుణ్ణి ఈ విధంగా స్తుతించాడు,
20 “అన్ని యుగాల్లో దేవుని నామానికి స్తుతి కలుగు గాక. ఆయన జ్ఞానం, బల ప్రభావాలు కలిగినవాడు.
21 ఆయన కాలాలపై, సమయాలపై సమస్త అధికారం కలిగి ఉన్నవాడు. రాజులను నియమించేవాడూ, తొలగించేవాడూ ఆయనే. వివేకవంతులకు వివేకం, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించేది ఆయనే,
22 ఆయన గుప్తంగా ఉండే విషయాలను, రహస్యాలను వెల్లడి చేశాడు. పాతాళంలో జరిగే విషయాలు ఆయనకు తెలుసు, ఆయన చుట్టూ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది.
23 మా పూర్వీకుల దేవా, నువ్వు నాకు వివేకాన్నీ, బలాన్నీ అనుగ్రహించావు. ఇప్పుడు మేము కోరుకున్నట్టు రాజుకు వచ్చిన సమస్యకు పరిష్కారం నువ్వే నాకు తెలియజేశావు. అందువల్ల నేను నిన్ను స్తుతిస్తున్నాను.”
దానియేలు కల భావాన్ని చప్పడం.
24 జ్ఞానులను సంహరించడానికి రాజు నియమించిన రాజ సైనిక దళం అధిపతి అర్యోకు దగ్గరికి దానియేలు వెళ్ళాడు. అతనితో “బబులోనులో ఉన్న జ్ఞానులను చంపవద్దు. నన్ను రాజు సన్నిధికి తీసుకు వెళ్ళు. నేను ఆ కల భావాన్ని రాజుకు తెలియజేస్తాను” అని చెప్పాడు.
25 అర్యోకు రాజ సన్నిధికి వెళ్లి “రాజుకు వచ్చిన కల భావం తెలియ జేయగలిగే ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను. అతడు చెరపట్టి తీసుకువచ్చిన యూదుల్లో ఒకడు” అని చెప్పి, వెంటనే దానియేలును రాజమందిరానికి తీసుకు వెళ్ళాడు.
26 అప్పుడు రాజు “నాకు వచ్చిన కలను, దాని భావాన్ని నువ్వు వివరించగలవా?” అని బెల్తెషాజరు అనే దానియేలును అడిగాడు.
27 దానియేలు రాజు ఎదుట నిలబడి ఇలా జవాబిచ్చాడు. “రాజు కోరినట్టు ఈ మర్మం వివరించడం జ్ఞానులకైనా, గారడీ విద్యలు చేసేవాళ్ళకైనా, శకునం చెప్పేవాళ్ళకైనా, జ్యోతిష్యులకైనా సాధ్యం కాదు.
28 అయితే గుప్తంగా ఉన్న విషయాలను వెల్లడించే దేవుడు పరలోకంలో ఉన్నాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ఆయన రాజైన నెబుకద్నెజరుకు తెలియపరిచాడు. మీరు మంచం మీద పడుకుని ఉన్నప్పుడు మీ మనస్సులోకి వచ్చిన దర్శనం ఏమిటో మీకు తెలియజేస్తాను.
29 అది ఏమిటంటే, రాజా, మీరు పడక మీద పడుకుని, ప్రస్తుత కాలం గడచిన తరువాత ఏమి జరుగుతుందో అనుకుంటూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో గుప్తమైన విషయాలను వెల్లడించేవాడు జరగబోయే సంగతులు మీకు తెలియజేశాడు.
30 ఈ మర్మం గురించి ఆయన నాకు బయలుపరచిన కారణం నేను ఇతర మనుషులకంటే గొప్ప జ్ఞానిని అని కాదు. రాజా, ఆ కల భావాన్ని, మీ మనస్సులోని ఆలోచననూ మీకు తెలియజేయడానికి దేవుడే దాన్ని నాకు బయలుపరిచాడు.
31 రాజా, మీకు వచ్చిన కల ఇదే. మీరు చూస్తూ ఉండగా బ్రహ్మాండమైన ఒక విగ్రహం కనబడింది. ఈ విగ్రహం గొప్పది, ప్రకాశమానమైనది. అది చూపులకు భయంకరంగా ఉండి మీ ఎదుట నిలబడి ఉంది.
32 ఆ విగ్రహం తల మేలిమి బంగారం. దాని రొమ్ము, భుజాలు వెండివి, దాని పొట్టభాగం, తొడలు ఇత్తడివి.
33 దాని మోకాళ్లు ఇనుపవి. దాని కాళ్ళలో ఒకటి ఇనుపది, ఒకటి కాల్చిన బంకమన్నుతో కూడినది.
34 మీరు చూస్తూ ఉండగా, చేతి సహాయం లేకుండా ఒక రాయి ఇనుము, బంకమన్ను కలిసిన ఆ విగ్రహం కాళ్ళ మీద పడి దాని కాళ్ళను ముక్కలు ముక్కలుగా చేసింది.
35 అప్పుడు ఇనుము, బంకమన్ను, ఇత్తడి, వెండి, బంగారం అన్నీ కలిసి పిండిపిండి అయిపోయాయి. అది కోతకాలంలో కళ్ళంలో దంచిన చెత్తలాగా అయిపోయింది. వాటి ఆచూకీ ఎక్కడా కనబడకుండా గాలికి కొట్టుకుపోయాయి. అయితే ఆ విగ్రహాన్ని విరగగొట్టిన ఆ రాయి గొప్ప పర్వతంగా మారి భూలోకమంతటా వ్యాపించింది.”
36 “ఇప్పుడు దాని భావం మీ సమక్షంలో తెలియజేస్తాను.
37 రాజా, పరలోకంలో ఉన్న దేవుడు రాజ్యాన్నీ, అధికారాన్నీ, బలప్రభావాలనూ ఘనతనూ మీకు అనుగ్రహించాడు. మీరు రాజులకు రాజుగా ప్రఖ్యాతి గాంచారు.
38 దేవుడు రాజ్యంలో ప్రతి ప్రాంతాన్నీ, భూమిపై ఉండే ప్రతి జంతువులను, ఆకాశంలో ఎగిరే సమస్త పక్షిజాతిని అన్నిటినీ మీ ఆధీనంలో ఉంచాడు. ప్రజలందరి మీదా మీకు సర్వాధికారం అనుగ్రహించాడు. దర్శనంలో కనిపించిన ఆ బంగారపు తల మీరే.
39 మీరు మరణించిన తరవాత మీ రాజ్యం కంటే తక్కువ ప్రభావం ఉన్న మరో రాజ్యం పైకి వస్తుంది. తరువాత మూడో రాజ్యం సర్వలోకాన్ని పాలిస్తుంది. అది మీకు కనిపించిన ఇత్తడి వంటిది.
40 ఆ తరువాత నాలుగో రాజ్యం అధికారంలోకి వస్తుంది. అది ఇనుములాగా బలంగా ఉంటుంది. ఇనుము అన్నిటినీ ముక్కలుగా పగలగొట్టి పిండి చేస్తుంది గదా. ఇనుము పగలగొట్టినట్టు అది మిగిలిన రాజ్యాలన్నిటినీ పగలగొట్టి పిండి చేస్తుంది.
41 విగ్రహానికున్న కాళ్ళు, కాలి వేళ్ళు కొంత భాగం బంకమట్టితో, కొంత భాగం ఇనుముతో చేసినట్టు మీకు కనబడ్డాయి కనుక ఆ విధంగా ఆ నాలుగో రాజ్యంలో విభేదాలు ఉంటాయి. ఇనుము బంకమట్టితో కలిసి ఉన్నట్టు మీరు చూశారు కాబట్టి ఆ రాజ్యంలో ఆ విధంగా ఉంటుంది. ఆ రాజ్యం ఇనుములాగా బలం కలిగి ఉంటుంది.
42 కాళ్ళ వేళ్ళు కొంత భాగం ఇనుపవిగా, కొంత భాగం బంకమన్నులాగా ఉన్నట్టు ఆ రాజ్యం ఒక విషయంలో బలంగా, ఒక విషయంలో బలహీనంగా ఉంటుంది.
43 ఇనుము, బంకమన్ను కలిసిపోయి ఉండడం మీరు చూశారు. అదే విధంగా రాజ్యంలోని ప్రజలు మిశ్రమంగా ఉంటారు గానీ ఇనుము మట్టిలో కలవకుండా ఎలా ఉంటుందో అలాగే ప్రజలు ఒకరితో ఒకరు కలవకుండా ఉంటారు.
44 ఆ రాజుల కాలంలో పరలోకంలో ఉన్న దేవుడు శాశ్వతంగా నిలిచి ఉండే వేరే ఒక రాజ్యం నెలకొల్పుతాడు. ఆ రాజ్యాన్ని పొందిన వాళ్ళ చేతుల్లో నుంచి దాన్ని వేరే ఇంకెవ్వరూ స్వాధీనం చేసుకోలేరు. అది ముందు చెప్పిన రాజ్యాలన్నిటినీ తుత్తునియలు చేస్తుంది. అది శాశ్వతంగా నిలుస్తుంది.
45 చేతి సహాయం లేకుండా పర్వతం నుండి వేరైన ఆ రాయి ఇనుముని, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారాన్ని ముక్కలు చేయడం మీరు చూశారు గదా. జరగబోయే విషయాలు ఇలాగే ఉంటాయి. జరగబోయే సంభవాలు దేవుడు ముందుగానే మీకు వెల్లడిపరిచాడు. మీకు వచ్చిన కల యథార్థం. దాని వివరణ నమ్మదగినది” అని దానియేలు రాజుతో చెప్పాడు.
46 అప్పుడు రాజైన నెబుకద్నెజరు దానియేలు ఎదుట సాష్ఠాంగపడి నమస్కారం చేశాడు. అతణ్ణి సన్మానించి నైవేద్యం, ధూపం సమర్పించాలని ఆజ్ఞాపించాడు.
47 రాజు దానియేలుతో “ఈ రహస్య విషయాలు వెల్లడిపరిచే సమర్థత మీ దేవుడు నీకిచ్చాడు. నీ దేవుడు సమస్త దేవుళ్ళకు దేవుడు, రాజులందరికీ ప్రభువు, గూఢమైన విషయాలు వెల్లడి చేసేవాడు” అన్నాడు.
48 రాజు దానియేలుకు ఎన్నో విలువైన బహుమతులు ఇచ్చాడు. అతణ్ణి ఘనపరచి బబులోను ఆస్థానం అంతటిపైన అధికారిగా, దేశాలోని జ్ఞానులందరి మీద పెద్దగా నియమించాడు.
49 దానియేలు విన్నపం మేరకు రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగో అనేవాళ్ళను బబులోను సంస్థానం అంతటి మీదా పాలకులుగా నియమించాడు. అయితే దానియేలు రాజ భవనంలో ఉండిపోయాడు.