13
ఇతర దేవుళ్ళను పూజించుట
1 ప్రవక్త గానీ కలలు కనేవాడు గానీ మీ ఎదుట సూచక క్రియను లేక మహత్కార్యాన్ని చూపించి,
2 మీరు ఎరుగని “ఇతర దేవుళ్ళను అనుసరించి పూజిద్దాం రండి” అని చెబుతాడేమో.
3 అలా చెప్పినప్పుడు అతడు మీతో చెప్పిన సూచక క్రియ లేక మహత్కార్యం జరిగినా సరే, ఆ ప్రవక్త, లేక కలలు కనేవాడి మాటలు వినవద్దు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోడానికి మీ దేవుడు యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు.
4 మీరు మీ యెహోవా దేవునికి లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను పాటించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయననే హత్తుకుని ఉండాలి.
5 మీరు నడుచుకోవాలని మీ దేవుడు యెహోవా మీకాజ్ఞాపించిన మార్గం నుండి మిమ్మల్ని తొలగించి, ఐగుప్తు దేశం అనే బానిసల ఇంట్లో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించారు కాబట్టి ఆ ప్రవక్తకు, లేక కలలు కనేవాడికి మరణశిక్ష విధించాలి. ఆ విధంగా మీ మధ్య నుండి ఆ దుష్టత్వాన్ని పరిహరించాలి.
6 మీ తల్లి కొడుకు, మీ సోదరుడు, మీ కొడుకు, మీ కూతురు, మీ భార్య, ప్రాణస్నేహితుడు,
7 ఎవరైనా సరే, భూమి ఈ చివరి నుండి ఆ చివర వరకూ మీకు దగ్గరైనా, దూరమైనా, మీరు, మీ పూర్వీకులు ఎరగని మీ చుట్టూ ఉన్న ప్రజల దేవుళ్ళను పూజిద్దాం రమ్మని రహస్యంగా మిమ్మల్ని ప్రేరేపిస్తే
8 వారి మాటకు ఒప్పుకోవద్దు. వారి మాట వినవద్దు. వారిని విడిచిపెట్టవద్దు, వారి మీద దయ చూపవద్దు. వారిని తప్పించడానికి ప్రయత్నించకుండా వారిని తప్పకుండా చంపాలి.
9 వారిని చంపడానికి ప్రజలందరి కంటే ముందుగా మీ చెయ్యి వారి మీద పడాలి.
10 రాళ్లతో వారిని చావగొట్టాలి. ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి బానిసల ఇంటి నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా నుండి మిమ్మల్ని దూరం చేయడానికి వారు ప్రయత్నించారు.
11 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా అది విని భయపడి, మళ్ళీ అలాంటి చెడ్డ పని మీ మధ్య చేయరు.
12 మీరు నివసించడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న వాటిలో ఏదైనా ఒక పట్టణంలో
13 దుష్టులైన కొందరు మీరు ఎరుగని ఇతర దేవుళ్ళను పూజిద్దాం రండని తమ పట్టణ ప్రజలను ప్రేరేపించారని వింటే, మీరు ఆ సంగతిని బాగా పరీక్షించి విచారించాలి.
14 అది నిజమైతే, అంటే అలాంటి హేయమైన పని మీ మధ్య జరిగి ఉంటే
15 ఆ పట్టణస్తులను తప్పకుండా కత్తితో చంపి, దానినీ దానిలో ఉన్న సమస్తాన్నీ దాని పశువులనూ కత్తితో చంపివేయాలి.
16 దానిలో దోచుకున్న సొమ్మంతటినీ దాని వీధిలో పోగుచేసి, మీ దేవుడు యెహోవా పేరున ఆ పట్టణాన్ని, దాని సొత్తునీ పూర్తిగా కాల్చివేయాలి. దాన్ని ఇక ఎన్నటికీ తిరిగి కట్టకూడదు, అది పాడుదిబ్బలాగా ఉండిపోవాలి.
17 ఈ రోజు నేను మీకాజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ
18 మీ దేవుడైన యెహోవా దృష్టికి సరైన దాన్ని చేస్తూ, ఆయన మాట వినాలి. యెహోవా తన కోపం నుండి మళ్లుకుని మిమ్మల్ని కనికరించి, దయ చూపి మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన విధంగా మిమ్మల్ని విస్తరింపజేయాలంటే నాశనం చేయాల్సిన దానిలో కొంచెమైనా మీ దగ్గర ఉంచుకోకూడదు.