29
ఐగుప్తుకు వ్యతిరేకంగా ప్రవచనం
1 బబులోను చెరలో ఉన్న కాలంలో, పదో సంవత్సరం పదో నెల పన్నెండో రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
2 “నరపుత్రుడా, నీ ముఖాన్ని ఐగుప్తురాజు ఫరో వైపు తిప్పి అతని గురించి, ఐగుప్తు దేశమంతటిని గురించి ప్రవచించు. యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే
3 ఐగుప్తు రాజు ఫరో, నైలునదిలో పడుకున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని.
నైలునది నాది, నేనే దాన్ని కలగచేశాను, అని నువ్వు చెప్పుకుంటున్నావు.
4 నేను నీ దవడకు గాలాలు తగిలిస్తాను. నీ నైలు నదిలోని చేపలను నీ పొలుసులకు అంటుకునేలా చేస్తాను. నీ నది మధ్యలో నుంచి నిన్నూ నీ పొలుసులకు అంటిన చేపలన్నిటినీ బయటికి లాగేస్తాను.
5 నిన్నూ నైలు నది చేపలన్నిటినీ ఎడారిలో పారబోస్తాను.
నువ్వు నేల మీద పడతావు. నిన్నెవరూ ఎత్తలేరు, లేపరు.
నిన్ను అడవి జంతువులకు ఆకాశపక్షులకు ఆహారంగా ఇస్తాను!
6 అప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులంతా తెలుసుకుంటారు.
ఐగుప్తు, ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లలాగా ఉంది.
7 వాళ్ళు నిన్ను చేత పట్టుకున్నప్పుడు నువ్వు విరిగిపోయి వారి పక్కలో గుచ్చుకున్నావు.
వాళ్ళు నీ మీద ఆనుకుంటే నువ్వు వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టి వారి నడుములు బెణికేలా చేశావు.”
8 కాబట్టి యెహోవా ప్రభువు ఈ మాట చెబుతున్నాడు. నేను నీ మీదికి కత్తి దూస్తాను. నీ మనుషులనూ పశువులనూ చంపుతాను.
9 ఐగుప్తుదేశం పాడైపోయి నిర్మానుష్యమై పోతుంది. అప్పుడు నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే “నైలు నది నాది, నేనే దాన్ని కలగచేశాను” అని భయంకర సముద్ర జంతువు అనుకుంటున్నాడు.
10 కాబట్టి నేను నీకూ నీ నదికీ విరోధిని. ఐగుప్తు దేశాన్ని మిగ్దోలు నుంచి సెవేనే వరకూ కూషు సరిహద్దు వరకూ పూర్తిగా పాడు చేసి ఎడారిగా చేస్తాను.
11 దాని మీదుగా ఏ కాలూ కదలదు. ఏ జంతువూ అటుగుండా వెళ్ళదు. నలభై ఏళ్ళు దానిలో ఎవరూ ఉండరు.
12 నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల మధ్య ఐగుప్తుదేశాన్ని పాడైన దానిగా చేస్తాను. పాడైపోయిన పట్టణాల్లో దాని పట్టణాలు నలభై ఏళ్ళు పాడై ఉంటాయి. ఐగుప్తీయులను ఇతర ప్రజల మధ్యకు చెదరగొడతాను. ఇతర దేశాలకు వారిని వెళ్ళగొడతాను.
13 యెహోవా ప్రభువు ఈ మాట చెబుతున్నాడు. నలభై ఏళ్ళు గడిచిన తరువాత నానాప్రజల్లో చెదరిపోయిన ఐగుప్తీయులను నేను సమకూరుస్తాను.
14 ఐగుప్తు కోల్పోయిన దాన్ని మళ్ళీ ఇచ్చి, పత్రోసు అనే తమ సొంత ప్రాంతానికి చేరుస్తాను. అక్కడ వాళ్ళు అల్పమైన రాజ్యంగా ఉంటారు.
15 రాజ్యాల్లో అది అల్పమైన రాజ్యంగా ఉంటుంది. ఇక ఇతర రాజ్యాల మీద అతిశయపడదు. వాళ్ళిక ఇతర రాజ్యాలపై పెత్తనం చేయకుండా నేను వారిని తగ్గిస్తాను.
16 ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషాన్ని మనసుకు తెచ్చుకుని ఐగుప్తు వైపు తిరిగితే అప్పటినుంచి వారికి నమ్మకం కుదరదు. అప్పుడు నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.
17 బబులోను చెరలో ఉన్న కాలంలో, ఇరవై ఏడవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజు యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు.
18 నరపుత్రుడా, తూరు మీద బబులోనురాజు నెబుకద్నెజరు తన సైన్యంతో చాలా కష్టమైన పని చేయించాడు. వారందరి జుట్టు ఊడిపోయింది. వారి భుజాలు కొట్టుకుపోయాయి. అయినా తూరుకు విరోధంగా అతడు పడిన కష్టానికి అతనికి గానీ అతని సైన్యానికి గానీ కూలి కూడా రాలేదు.
19 కాబట్టి యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, ఐగుప్తు దేశాన్ని బబులోను రాజు నెబుకద్నెజరుకు నేను అప్పగిస్తున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకుని దాని సొమ్మును దోచుకుంటాడు. అది అతని సైన్యానికి జీతమవుతుంది.
20 తూరు పట్టణం మీద అతడు చేసింది నా కోసమే కాబట్టి అందుకు బహుమానంగా దాన్ని అప్పగిస్తున్నాను. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
21 ఆ రోజు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము పైకి వచ్చేలా చేస్తాను. వారితో మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. అప్పుడు నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.