6
ఇశ్రాయేలు పర్వతాల గూర్చి ప్రవచనం
నా దగ్గరికి తిరిగి యెహోవా వాక్కు వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు. “నరపుత్రుడా, ఇశ్రాయేలు పర్వతాలకు అభిముఖంగా నిలబడి ఇలా ప్రకటించు. ఇశ్రాయేలు పర్వతాల్లారా, ప్రభువైన యెహోవా మాట వినండి. ప్రభువైన యెహోవా పర్వతాలతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఇలా చెప్తున్నాడు. చూడండి! మీకు విరోధంగా ఖడ్గాన్ని పంపుతున్నాను. మీ ఉన్నత స్థలాలను నాశనం చేస్తాను.
తరువాత మీ బలిపీఠాలు పాడై పోతాయి. మీ దేవతా స్తంభాలు ధ్వంసం అవుతాయి. హతమైన మీ వాళ్ళను మీ విగ్రహాల ఎదుట పారవేస్తాను. ఇశ్రాయేలు ప్రజల శవాలను వారి విగ్రహాల ఎదుట పేరుస్తాను. వాళ్ళ ఎముకలను మీ బలిపీఠాల చుట్టూ వెదజల్లుతాను.
మీరు ఏ పట్టణంలో నివసించినా ఆ పట్టణాలు నాశనం అవుతాయి. మీ బలిపీఠాలు నాశనం, నిర్జనం అవుతాయి. తరువాత అవి పగిలి పోతాయి. మాయమై పోతాయి. మీ దేవతా స్తంభాలు విరిగిపోతాయి. మీరు చేసినవన్నీ తుడిచిపెట్టుకు పోతాయి. ప్రజలు చనిపోయి మీ మధ్యలో కూలిపోతారు. నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
అయితే మీలో కొంత శేషాన్ని నేను భద్రం చేస్తాను. మీరు వివిధ దేశాల్లోకి చెదరిపోయినప్పుడు మీలో కొంతమంది ఖడ్గాన్ని తప్పించుకుంటారు. అప్పుడు అలా తప్పించుకుని ఇతర జాతుల మధ్య బందీలుగా ఉన్నవారు నా గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి నన్ను దూరం చేసిన తమ లైంగిక విశృంఖలత, విగ్రహాలపట్ల వాళ్ళకున్న అనురక్తీ నన్నెలా వేదనకి గురి చేసిందో ఆలోచిస్తారు. చండాలమైన పనులన్నిటితో తాము సాగించిన దుర్మార్గత పట్ల వాళ్ళ ముఖాలపై అసహ్యం కనిపిస్తుంది. 10 అప్పుడు నేనే యెహోవాను అని తెలుసుకుంటారు. వాళ్ళ పైకి కీడు రప్పిస్తానని నేను చెప్పిన మాట వెనుక ఒక కారణం ఉంది.”
11 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “నీ చేతులు చరిచి నీ పాదాలు నేలకు తన్ను! ఇశ్రాయేలు జాతి సాగించిన అసహ్యమైన పనుల కోసం ‘అయ్యో’ అని రోదించు. ఎందుకంటే వాళ్ళని ఖడ్గం, కరువు, తెగులు హతం చేస్తాయి. 12 దూరంగా ఉన్నవాళ్ళు తెగులు వల్ల చస్తారు. సమీపంలో ఉన్నవాళ్ళను ఖడ్గం హతం చేస్తుంది. మిగిలిన వాళ్ళు కరువు వల్ల చనిపోతారు. ఈ విధంగా నా క్రోధాన్ని అమలు చేస్తాను.
13 వాళ్ళలో హతం అయిన వాళ్ళు ఎత్తయిన కొండలన్నిటి పైనా బలిపీఠాల చుట్టూ ఉన్న విగ్రహాల మధ్యలోనూ, పర్వత శిఖరాల పైనా, తమ విగ్రహాలకి పరిమళ ధూపం వేసిన పచ్చని చెట్లన్నిటి మధ్యా, సింధూర వృక్షాల మధ్యా పడి ఉంటారు. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు. 14 నా శక్తిని కనుపరుస్తాను. వాళ్ళ దేశాన్నీ, వాళ్ళు నివసించే ప్రాంతాలన్నిటినీ దిబ్లాతు ఎడారిలా నిర్జనం గానూ, వ్యర్ధంగానూ చేస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని వాళ్లు తెలుసుకుంటారు.”