ఎఫెసీయులకు రాసిన పత్రిక
గ్రంథకర్త
1:1 ప్రకారం ఎఫెసి పత్రిక రచయిత అపోస్తలుడు పౌలు. సంఘం ఆరంభ కాలం నుంచీ ఈ పత్రిక రాసినది పౌలేనని ఎంచారు. ఆరంభ అపోస్తలిక పితరులు రోమ్ నివాసి క్లెమెంటు, ఇగ్నేషియస్, హెర్మే, పాలికార్పు దీన్నే సమర్థించారు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 60 - 63
రోమ్ లో చెరసాలలో ఉన్నప్పుడు పౌలు ఇది రాసి ఉంటాడు.
స్వీకర్త
ముఖ్యంగా ఎఫెసు సంఘం. తన లేఖ అందుకుంటున్న వారు యుదేతరులని పౌలు స్పష్టంగా గుర్తించాడు. 2:11-13 లో వారు పుట్టుకతో యూదేతరులు అని చెప్పాడు. కాబట్టి యూదులు వీరిని “వాగ్దాన నిబంధనకు నోచుకోని వారుగా ఎంచారు (2:12). పౌలు ఈ ఎఫెసీయులకు “యూదేతరులైన మీకు నేను ఖైదీని” అని రాస్తున్నాడు.
ప్రయోజనం
క్రీస్తును పోలిన పరిణతి కోసం ఎదురు చూసే వారు తన లేఖ అందుకోవాలని పౌలు కోరాడు. నిజమైన దేవుని పిల్లలుగా ఎదగాలంటే అవసరమైన విషయాలు ఈ పత్రికలో పొందు పరచాడు. అంతేకాదు, ఎఫెసి పత్రిక పారాయణం విశ్వాసిని బలపరచి దేవుడిచ్చిన పిలుపునూ ఉద్దేశాన్ని అతనిలో నెరవేరుస్తుంది. ఎఫెసు విశ్వాసులు తమ క్రైస్తవ జీవితంలో బలపడేందుకు సంఘం యొక్క నైజం, ప్రయోజనం పౌలు వివరిస్తున్నాడు. యూదేతర క్రైస్తవులకు వారు గతంలో పాటించిన మతం మూలంగా పరిచయం ఉన్న అనేక పదాలు ఈ పత్రికలో కనిపిస్తున్నాయి. శరీరం, శిరస్సు, సంపూర్ణత, మర్మం యుగం, పరిపాలకుడు మొదలైనవి. క్రీస్తు ఎలాటి దేవతాగణం కన్నా ఆత్మ జీవులకన్నా ఎంతో ఉన్నతుడు అని నిరూపించడానికి పౌలు ఈ పదాలు వాడాడు.
ముఖ్యాంశం
క్రీస్తు ఇచ్చే దీవెనలు.
విభాగాలు
1. చర్చి సభ్యులు కోసం సిద్ధాంతములు — 1:1-3:21
2. చర్చ్ సభ్యులు కోసం విధులు — 4:1-6:24
1
అపొస్తలుని అభివందనాలు
1 ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు, క్రీస్తు యేసులో విశ్వాసముంచిన వారికి దేవుని సంకల్పం ప్రకారం క్రీస్తు యేసు అపొస్తలుడు పౌలు రాస్తున్న విషయాలు.
2 మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి సమాధానాలు కలుగు గాక.
కృపలో విశ్వాసి స్థితి
3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోక విషయాల్లో సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో క్రీస్తులో మనలను దీవించాడు.
4 క్రీస్తులో మనలను సృష్టికి ముందే దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో పరిశుద్ధులంగా నిందారహితులంగా ఉండేలా ఆయన మనలను ఎన్నుకున్నాడు.
5 యేసు క్రీస్తు ద్వారా మనలను తన సొంత కుమారులుగా స్వీకరించడానికి దేవుడు తన ప్రేమతో ముందుగానే నిర్ణయించుకున్నాడు. అలా చేయడం ఆయనకు ఎంతో ఆనందం. ఆయన ఆశించింది అదే.
6 తన దివ్యకృపను బట్టి స్తుతి పొందాలని దేవుడు దాన్ని తన ప్రియ కుమారుడి ద్వారా మనకు ఉచితంగా ప్రసాదించాడు.
7 దేవుని అపార కృప వల్లనే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది.
8 ఈ కృపను సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనకు విస్తారంగా అందించాడు.
9 ఆయన క్రీస్తు ద్వారా తన ఇష్ట పూర్తిగా ప్రదర్శించిన పథకం తాలూకు రహస్య సత్యాన్ని మనకు తెలియజేశాడు.
10 కాలం సంపూర్ణమైనప్పుడు పరలోకంలోనూ, భూమి మీదా ఉన్న సమస్తాన్నీ క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు.
11 క్రీస్తును ముందుగా నమ్మిన మనం తన మహిమకు కీర్తి కలగజేయాలని,
12 దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ఎన్నుకుని, మనకు వారసత్వం ఏర్పరచాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం ప్రకారం అన్ని కార్యాలనూ జరిగిస్తున్నాడు.
13 మీరు కూడా సత్య వాక్యాన్ని అంటే రక్షణ సువార్తను విని, క్రీస్తులో విశ్వాసముంచారు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ద్వారా మీమీద ముద్ర పడింది.
14 దేవుని మహిమకు కీర్తి కలగడానికి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగే వరకూ ఆత్మ మన వారసత్వానికి హామీగా ఉన్నాడు.
జ్ఞానం, బలం కలగాలని ప్రార్థన
15 ఈ కారణం చేత ప్రభువైన యేసులో మీ విశ్వాసం గురించీ పరిశుద్ధులందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను గురించీ నేను విన్నప్పటి నుంచి,
16 మీ విషయంలో మానకుండా నా ప్రార్థనల్లో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
17 మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు, మహిమ గల తండ్రి, తనను తెలుసుకోడానికి మీకు తెలివిగల ఆత్మనూ, తన జ్ఞాన ప్రత్యక్షతగల మనసునూ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.
18 మీ మనోనేత్రాలు వెలిగి, మన పిలుపు గురించిన నిరీక్షణ ఎలాంటిదో, పరిశుద్ధుల్లో ఆయన మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో మీరు గ్రహించాలని నా ప్రార్థన.
19 తనను నమ్ముకున్న మనలో తన అపరిమిత ప్రభావం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన.
దేవుడు క్రీస్తును ఘనపరిచాడు
20 దేవుడు ఈ శక్తితో క్రీస్తును తిరిగి బ్రతికించి పరలోకంలో తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
21 సర్వాధిపత్యం, అధికారం, ప్రభావం, ప్రభుత్వం కంటే ఈ యుగంలోగానీ రాబోయే యుగంలోగానీ పేరు గాంచిన ప్రతి నామం కంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడు.
22 దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచి, సంఘంలోని అన్నిటి మీదా ఆయనను తలగా నియమించాడు.
23 ఈ సంఘం ఆయన శరీరం, అంతటినీ అన్ని విధాలుగా నింపుతున్న ఆయన సంపూర్ణత.