5
దర్యావేషుకు తత్తెనై లేఖ
1 హగ్గయి ప్రవక్త, ఇద్దో కొడుకూ ప్రవక్తా అయిన జెకర్యా, యూదా దేశంలో, యెరూషలేములో ఉంటున్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట ప్రకటించారు.
2 షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యోజాదాకు కొడుకు యేషూవ ఇద్దరూ బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. దేవుని ప్రవక్తలు వారితో ఉండి వారికి సహాయం చేస్తూ వచ్చారు.
3 అప్పుడు నది ఇవతల అధికారులుగా ఉన్న తత్తెనై, షెతర్బోజ్నయి, వారితోబాటు మరికొందరు, యూదుల దగ్గరికి వచ్చారు. వారు “ఈ మందిరం కట్టడానికి, గోడలు నిలబెట్టడానికి, మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?” అని ప్రశ్నించారు.
4 దాన్ని నిర్మిస్తున్న వారి పేర్లు, ఇతర విషయాలు కూడా వాళ్ళు అడిగారు.
5 అయితే యూదుల దేవుడు వారిపై తన కాపుదల ఉంచడం వలన ఈ విషయంలో చక్రవర్తి దర్యావేషు నుండి అనుమతి వచ్చేవరకూ అధికారులు కట్టడం పని జరగకుండా అడ్డుకోలేదు.
6 నది ఇవతల అధికారులైన తత్తెనై, షెతర్బోజ్నయి, వారితో ఉన్న ఇతర అధికారులు చక్రవర్తి దర్యావేషుకు పంపిన ఉత్తరం నకలు ప్రతి ఇది.
7 “రాజైన దర్యావేషుకు సమస్త క్షేమ సుఖాలు కలుగు గాక.
8 రాజువైన మీకు తెలియాల్సిన విషయాలు ఏమిటంటే, మేము మహా దేవుని మందిరం ఉన్న యూదుల ప్రాంతానికి వెళ్ళాం. దాన్ని పెద్ద పెద్ద రాళ్లతో కడుతూ ఉన్నారు. గోడల మధ్యలో స్థంభాలు వేస్తున్నారు. ఈ పని త్వరత్వరగా కొనసాగుతూ పూర్తి కావస్తున్నది.
9 ‘ఈ మందిరం కట్టడానికి, గోడలు నిలబెట్టడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?’ అని అక్కడున్న పెద్దలను మేము అడిగాం.
10 మీకు తెలియజేయడం కోసం అజమాయిషీ చేస్తున్న అధికారుల పేర్లు వ్రాసి ఇమ్మని కూడా అడిగాం.
11 దానికి వారు ఇలా జవాబిచ్చారు, భూమి, ఆకాశాలకు దేవుడైన వాడికి సేవకులం. చాలా సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయుల్లో ఒక గొప్ప రాజు కట్టించి పూర్తి చేసిన మందిరాన్ని మేము తిరిగి కడుతున్నాం.
12 మా పూర్వీకులు ఆకాశంలో నివాసముండే దేవునికి కోపం పుట్టించినందువల్ల ఆయన వారిని కల్దీయుడైన బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. అతడు ఈ మందిరాన్ని నాశనం చేసి ప్రజలను బబులోను దేశానికి బందీలుగా తీసుకువెళ్ళాడు.
13 అయితే బబులోను రాజు కోరెషు తన పాలన మొదటి సంవత్సరంలో దేవుని మందిరం తిరిగి కట్టుకోవడానికి అనుమతి ఇచ్చాడు.
14 అంతే కాక నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయం నుండి తీసుకువెళ్ళి బబులోను గుడిలో ఉంచిన వెండి బంగారు సామగ్రిని రాజైన కోరెషు ఆ గుడిలో నుండి తెప్పించాడు.
15 షేష్బజ్జరును గవర్నరుగా నియమించి దేవుని మందిరాన్ని అది ఉన్న స్థలం లో కట్టించి, ఆ సామగ్రిని తీసుకువెళ్ళి యెరూషలేము పట్టణంలోని దేవాలయంలో ఉంచే బాధ్యతలు అతనికి అప్పగించాడు.
16 కాబట్టి షేష్బజ్జరు వచ్చి యెరూషలేములోని దేవుని మందిరం పునాది వేయించాడు. అప్పటినుండి నేటివరకూ దాన్ని కడుతూ ఉన్నాము. పని ఇంకా పూర్తి కాలేదు.
17 కాబట్టి చక్రవర్తికి ఇష్టమైతే బబులోను పట్టణంలో ఉన్న రాజుకు చెందిన ఖజానాలో వెతికించి, యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని కట్టించాలని కోరెషు రాజు నిర్ణయించాడో లేదో తెలుసుకోవచ్చు. అప్పుడు చక్రవర్తి ఈ విషయంలో తన నిర్ణయం తెలియజేయాలని కోరుకొంటున్నాం.”