4
మొర్దెకై ఎస్తేరును సహాయం కోరడం
1 జరిగినదంతా మొర్దెకై విన్నాడు. అతడు తన బట్టలు చింపుకుని గోనెపట్ట వేసుకుని బూడిద పోసుకున్నాడు. నగరం నడిబొడ్డుకు వెళ్లి మహా శోకంతో విలపించాడు.
2 అతడు రాజ భవన ద్వారం వరకూ మాత్రమే వచ్చాడు. ఎందుకంటే గోనె కట్టుకున్న వాడు రాజు ద్వారం గుండా ప్రవేశించకూడదు అనే ఆజ్ఞ ఉంది.
3 రాజాజ్ఞ, శాసనం అందిన సంస్థానాలన్నిటిలో అక్కడి యూదులంతా దుఃఖంలో మునిగిపోయి ఉపవాసం ఉంటూ గొప్ప శోకంతో, రోదనతో ఉన్నారు. చాలా మంది గోనె కట్టుకుని బూడిద పోసుకుని పడి ఉన్నారు.
4 ఎస్తేరు దాసీలు, ఆమె దగ్గరున్న నపుంసకులు వచ్చి జరిగిన సంగతి ఆమెకు తెలియజేశారు. రాణికి చాలా దిగులు కలిగింది. మొర్దెకై కట్టుకున్న గోనెపట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి, అతడు కట్టుకోవడానికి బట్టలు పంపించిందిగానీ అతడు వాటిని తీసుకోలేదు.
5 అప్పుడు ఎస్తేరు తనను సేవించడానికి రాజు నియమించిన నపుంసకుల్లో హతాకు అనే వాణ్ణి పిలిచి ఏమి జరిగిందో అదంతా ఎందుకో తెలుసుకుని రమ్మని పంపింది.
6 హతాకు రాజద్వారం ఎదురుగా ఉన్న పట్టణ కూడలిలో మొర్దెకై దగ్గరికి వచ్చాడు.
7 మొర్దెకై తనకు జరిగినదంతా అతనికి వివరించాడు. హామాను యూదులను నాశనం చేయడానికి రాజు ఖజానాకు తూచి ఇస్తానని చెప్పిన సొమ్ము మొత్తం ఇంత అని అతనికి తెలిపాడు.
8 ఎస్తేరుకు చూపించడం కోసం యూదుల ఊచకోతకై షూషనులో విడుదల చేసిన ఆజ్ఞ ప్రతిని కూడా అతనికి ఇచ్చాడు. ఆమె తన జాతి ప్రజల పక్షంగా రాజు సముఖానికి వెళ్లి అతనికి విజ్ఞప్తి చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పాడు.
9 అప్పుడు హతాకు వెళ్లి మొర్దెకై చెప్పినదంతా ఎస్తేరుకు తెలియజేశాడు.
10 అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకుతో ఇలా చెప్పి పంపింది.
11 “పిలుపు రాకుండా పురుషుడు గానీ స్త్రీ గానీ రాజు గారి అంతఃపురం లోకి అడుగు పెడితే చట్ట ప్రకారం ఆ మనిషికి శిక్ష మరణమే. రాజు తన బంగారు రాజ దండాన్ని ఎవరివైపు చాపుతాడో ఆ వ్యక్తి మాత్రమే బ్రతుకుతాడు. ఈ కఠినమైన ఆజ్ఞ రాజసేవకులందరికీ రాజ సంస్థానాల్లోని వారందరికీ తెలుసు. ముప్ఫై రోజులుగా రాజు సముఖానికి వెళ్ళడానికి నాకు పిలుపు రాలేదు.”
12 హతాకు ఎస్తేరు మాటలు మొర్దెకైకి తెలిపాడు.
13 మొర్దెకై ఎస్తేరుకు ఇలా కబురంపాడు. “రాజ భవనంలో ఉన్నంత మాత్రాన ఇతర యూదులకు భిన్నంగా నువ్వు తప్పించుకుంటావనుకోవద్దు.
14 నువ్వు ఈ సమయంలో ఏమీ మాట్లాడక పోతే యూదులకు సహాయం, విడుదల వేరొక దిక్కునుండి వస్తుంది. అయితే నువ్వూ నీ తండ్రి వంశమూ నశిస్తారు. నువ్వొకవేళ ఇలాటి తరుణం కోసమే ఈ రాజరికానికి వచ్చావేమో ఎవరికి తెలుసు?”
15 అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఇలా చెప్పి పంపింది.
16 “షూషనులో ఉన్న యూదులందరినీ సమకూర్చి నాకోసం ఉపవాసముండేలా చెయ్యి. మూడు రోజులు ఏమీ తినవద్దు, తాగవద్దు. నేనూ నా దాసీలు కూడా ఉపవాసం ఉంటాము. చట్టవ్యతిరేకం అయినప్పటికీ నేను రాజు దగ్గరికి వెళ్తాను. నేను నశిస్తే నశిస్తాను.”
17 మొర్దెకై వెళ్లి ఎస్తేరు తనకు చెప్పినదంతా చేశాడు.