౨౧
౧ నువ్వు ఈ న్యాయ నిర్ణయాలు వాళ్ళు పాటించేలా చెయ్యాలి. ౨ మీరు హెబ్రీవాడైన వ్యక్తిని దాసుడుగా కొనుక్కున్న పక్షంలో ఆరు సంవత్సరాలపాటు మీకు దాసుడుగా ఉండి, ఏడో సంవత్సరంలో మీకు ఏమీ చెల్లించకుండానే మీ నుండి విడుదల పొందవచ్చు, ౩ ఆ దాసుడు ఒంటరిగా వస్తే ఒంటరిగా వెళ్లవచ్చు. భార్యతో కలసి వస్తే వాడి భార్యను కూడా తీసుకుని వెళ్ళవచ్చు. ౪ ఒకవేళ వాడి యజమాని అతనికి భార్యగా ఒక స్త్రీని అప్పగించినప్పుడు ఆమెకు ఆ దాసుడి ద్వారా కొడుకులు గానీ, కూతుళ్ళు గానీ పుట్టినట్టయితే ఆ భార్య, పిల్లలు ఆమె యజమానికి సొంతం అవుతారు, వాడు ఒంటరిగానే వెళ్లిపోవాలి.
౫ అయితే ఆ దాసుడు “నేను నా యజమానిని, నా భార్య పిల్లలను ప్రేమిస్తున్నాను, వాళ్ళను విడిచిపెట్టి విడుదల పొందను” అని తేటగా చెబితే ౬ వాడి యజమాని అతణ్ణి న్యాయాధిపతి దగ్గరకి తీసుకు రావాలి. తరువాత ఆ యజమాని వాణ్ణి తలుపు దగ్గరికి గానీ, గుమ్మం దగ్గరికి గానీ తీసుకువచ్చి వాడి చెవిని సన్నని కదురుతో గుచ్చాలి. అప్పటి నుంచి వాడు ఎల్లకాలం ఆ యజమానికి దాసుడుగా ఉండిపోవాలి.
౭ ఒకడు తన కూతురిని దాసిగా అమ్మేస్తే దాసులుగా ఉండే పురుషులు స్వతంత్రంగా వెళ్లిపోయినట్టు ఆమె వెళ్ళిపోకూడదు. ౮ ఆమెను భార్యగా ఉంచుకోదలచే ఆమె యజమానికి ఆమె నచ్చక పోతే వెల ఇచ్చి ఆమెను విడిపించడానికి ఆమె బంధువులకు అవకాశం ఇవ్వాలి. యజమాని ఆమె పట్ల అన్యాయం జరిగించిన కారణంగా ఆమెను విదేశీయులకు అమ్మే హక్కు అతనికి ఉండదు.
౯ యజమాని తన కొడుక్కి ఆమెను ఇస్తే తన కూతుళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తాడో అదే విధంగా ఆమె పట్ల కూడా వ్యవహరించాలి. ౧౦ ఆ కొడుకు మరొకామెను చేసుకున్నా మొదటి ఆమెకు తిండి, బట్ట, సంసార ధర్మం విషయంలో ఏమీ తక్కువ చేయకూడదు. ౧౧ ఈ మూడు విషయాల్లో ఏది తక్కువ చేసినా వెల ఏమీ చెల్లించకుండా ఆమె విడుదల పొందవచ్చు.
౧౨ ఒక వ్యక్తిని చనిపోయేలా కొట్టిన వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి. ౧౩ అయితే ఉద్దేశపూర్వకంగా కాక, అనుకోకుండా వాడి ద్వారా ఆ హత్య జరిగితే వాడు పారిపోవడానికి ఒక స్థలం మీకు నిర్ణయిస్తాను. ౧౪ అయితే ఒకడు తన పొరుగువాడిపై కోపంతో, కుయుక్తితో వాణ్ణి చంపేసి నా బలిపీఠం దగ్గర ఆశ్రయం పొందాలని చూస్తే వాణ్ణి బయటకు లాగి చంపాలి. ౧౫ తన తండ్రిని, తల్లిని కొట్టేవాడు తప్పకుండా మరణశిక్షకు అర్హుడు.
౧౬ ఎవడైనా ఒక వ్యక్తిని దొంగిలించి అమ్మినా, తన దగ్గర అక్రమంగా ఉంచుకొన్నా వాడు తప్పకుండా మరణశిక్షకు అర్హుడు. ౧౭ తన తండ్రిని, తల్లిని దూషించేవాడు తప్పక మరణశిక్ష పొందుతాడు. ౧౮ ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు ఒకడు మరొకడిని రాయితో కొట్టి గానీ, పిడికిలితో గుద్దిగానీ చనిపోకుండా మంచాన పడేలా చేస్తే, ౧౯ తరువాత గాయపడ్డవాడు లేచి తన చేతికర్ర సాయంతో తిరుగుతుంటే అతణ్ణి కొట్టిన వాడికి శిక్ష ఏమీ ఉండదు. అయితే గాయపడిన వ్యక్తి పని చేయలేకపోయిన కాలానికి సరిపడ్డ సొమ్ము కొట్టినవాడు ఇచ్చి, అతణ్ణి పూర్తిగా బాగుచేయించాలి.
౨౦ ఎవరైనా ఒకడు తన దాసుణ్ణి, దాసిని చనిపోయేలా కర్రతో కొట్టినప్పుడు అతడు తప్పకుండా శిక్షకు అర్హుడు. ౨౧ అయితే ఆ దాసులు ఒకటి రెండు రోజులు చనిపోకుండా బతికితే ఆ శిక్ష అతనికి ఉండదు. ఎందుకంటే ఆ దాసులు అతని సొమ్ము. ౨౨ ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భస్రావం జరిగితే, గర్భస్రావం కాక మరి ఏ ఇతర హానీ కలగకపోతే ఆ స్త్రీ భర్త హాని కలిగించినవాడిపై మోపిన నష్టాన్ని వాడు చెల్లించాలి. అయితే అది న్యాయాధిపతుల నిర్ణయం మేరకు వాళ్ళ సమక్షంలో జరగాలి.
౨౩ తీవ్రగాయం కలిగినప్పుడు మీరు విధించ వలసిన శిక్షలు: ప్రాణానికి ప్రాణం, ౨౪ కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు, ౨౫ వాతకు వాత, గాయానికి గాయం, దెబ్బకు దెబ్బ.
౨౬ ఒకడు తన దాసుణ్ణి గానీ, దాసిని గానీ కొట్టి వాళ్ళ కన్ను పోయేలా చేస్తే ఆ కన్నుకు పరిహారంగా వాళ్ళను విడుదల చెయ్యాలి. ౨౭ తన దాసుడి, దాసి దంతం ఊడిపోయేలా కొట్టినప్పుడు ఆ దంతానికి పరిహారంగా వాళ్ళను విడుదల చెయ్యాలి.
౨౮ ఎవరిదైనా ఎద్దు పురుషుణ్ణి గానీ, స్త్రీని గానీ పొడిచి చంపితే ఆ ఎద్దును కచ్చితంగా రాళ్లతో కొట్టి చంపాలి. అలా చనిపోయిన ఎద్దు మాంసం తినకూడదు. ఈ విషయంలో ఎద్దు యజమానికి దోషం అంటదు. ౨౯ అయితే ఆ ఎద్దు ఇతరులను పొడుస్తుంది అని ఇంతకు ముందు దాని యజమానికి తెలిసి కూడా అతడు దాన్ని అదుపు చేయక పోవడం వల్ల దాని ద్వారా పురుషుడు గానీ, స్త్రీ గానీ చనిపోతే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. అప్పుడు దాని యజమానికి మరణశిక్ష విధించాలి. ౩౦ మరణశిక్షకు బదులు జరిమానా విధిస్తే అతడు ఆ మొత్తం చెల్లించి తన ప్రాణం దక్కించుకోవాలి. ౩౧ ఆ ఎద్దు చిన్న పిల్లవాణ్ణి గానీ చిన్న పిల్లనుగానీ పొడిచినప్పుడు ఈ నియమం వర్తిస్తుంది. ౩౨ ఎద్దు దాసుణ్ణి గానీ, దాసిని గానీ పొడిచినప్పుడు ఆ దాసుల యజమానికి ఎద్దు యజమాని 30 తులాల వెండి చెల్లించాలి. ఇంకా ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి.
౩౩ ఒక గొయ్యి మీద మూత తీసి ఉంచినప్పుడు గానీ, గొయ్యి తవ్వి దానిపై కప్పు ఉంచక పోవడం వల్ల గానీ దాన్లో వేరొకరి ఎద్దు గానీ, గాడిద గానీ పడి చనిపోతే ౩౪ ఆ గొయ్యి ఉన్న స్థలం యజమానులు ఆ నష్టానికి బాధ్యత వహించాలి. వాటి యజమానికి తగిన మొత్తం చెల్లించాలి. అప్పుడు చచ్చిన జంతువు అతని సొంతం అవుతుంది.
౩౫ ఒకరి ఎద్దు వేరొకరి ఎద్దును చనిపోయేలా పొడిచినప్పుడు బతికి ఉన్న ఎద్దును అమ్మి దానికి వచ్చిన మొత్తాన్ని ఇద్దరూ పంచుకోవాలి. చచ్చిన ఎద్దు మాంసం కూడా పంచుకోవాలి. ౩౬ అయితే ఆ ఎద్దు ఇతరులను పొడుస్తుంది అని ఇంతకు ముందు దాని యజమానికి తెలిసి కూడా అతడు దాన్ని అదుపు చేయకపోతే వాడు తప్పకుండా ఎద్దుకు బదులు ఎద్దును ఇవ్వాలి, చనిపోయిన ఎద్దు అతనిది అవుతుంది.