36
మోషే “పవిత్ర స్థలం లో జరిగే సేవ కోసం అన్నిరకాల పనులు చేయడానికి బెసలేలు, అహోలీయాబు మొదలైన ప్రతిభావంతులను నియమించాము. ఈ పనులు చేయడానికి యెహోవా వాళ్లకు జ్ఞానం, వివేకం ప్రసాదించాడు. వీళ్ళు యెహోవా ఆజ్ఞాపించినట్టు పనులు జరిగిస్తారు” అన్నాడు. బెసలేలు, అహోలీయాబులతో పాటు యెహోవా ఎవరి హృదయాల్లో జ్ఞాన వివేకాలు ఉంచి ఆ పని చేయడానికి ప్రేరేపణ కలిగించాడో వాళ్ళందరినీ మోషే పిలిపించాడు.
గుడారం నిర్మాణం కోసం స్వేచ్చార్పణలు
వాళ్ళు వచ్చి పవిత్ర స్థలం లో సేవ జరగడానికి, పవిత్ర స్థలం కట్టించడానికి ఇశ్రాయేలు ప్రజలు తీసుకువచ్చిన సామగ్రి అంతటినీ మోషే దగ్గర నుండి తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఇంకా ప్రతిరోజూ మనస్ఫూర్తిగా మోషే దగ్గరికి కానుకలు తెస్తూనే ఉన్నారు. అప్పుడు పవిత్ర స్థలానికి చెందిన వేరు వేరు పనులు చేసే నిపుణులందరూ తాము చేస్తున్న పని వదిలిపెట్టి మోషే దగ్గరికి వచ్చారు. “సేవ జరిగించడానికి యెహోవా చేయమని చెప్పిన పని కోసం ప్రజలు కావలసిన దానికంటే చాలా ఎక్కువగా తీసుకు వస్తున్నారు” అని మోషేతో చెప్పారు.
మోషే “ఇక నుండి ఏ పురుషుడు గానీ, స్త్రీ గానీ పవిత్ర స్థలం పని కోసం ఎలాంటి కానుకలూ తేవద్దు” అని ప్రకటించాడు. శిబిరం అంతటా ఈ విషయం చాటింపు వేయించారు. ఆ పని మొత్తం జరిగించడానికి సరిపోయినంత సామగ్రి జమ అయింది. అంతకంటే ఎక్కువగానే సమకూడింది. ఇక ప్రజలు కానుకలు తేవడం మానుకున్నారు.
గుడారం నిర్మాణం
నిర్గ 26:1-37
ఆ పని చేసినవాళ్ళలో నిపుణులైన వారంతా నీలం, ఊదా, ఎర్రని రంగులతో నేసిన సన్నని దారాలతో దైవ సన్నిధి గుడారం కోసం కెరూబు నమూనాతో పది తెరలు చేశారు. ఇది అత్యంత నైపుణ్యం గల బెసలేలు చేతి పని. ఒక్కొక్క తెర పొడవు 28 మూరలు, వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటి కొలతలు ఒక్కటే. 10 ఐదు తెరలు చొప్పున రెండు జతలుగా ఒక దానితో ఒకటి కూర్చారు.
11 ఒక తెరల కూర్పు చివరి తెర అంచున నీలం రంగు నూలుతో ఉంగరాలు చేశారు. రెండవ కూర్పు బయటి తెర అంచుకు కూడా అదే విధంగా చేశారు. 12 మొదటి కూర్పులో ఒక తెరకు ఏభై ఉంగరాలు, రెండవ కూర్పులో ఉన్న తెర అంచుకు ఏభై ఉంగరాలు చేశారు. అవి ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి.
13 ఏభై బంగారు గుండీలను సిద్ధం చేసి ఆ గుండీలతో ఆ రెండు తెరలను ఒక దానితో ఒకటి కలిపినప్పుడు అది దైవ సన్నిధి మందిరంగా నిలిచింది. 14 దైవ సన్నిధి మందిరం పైకప్పుగా మేక వెంట్రుకలతో పదకొండు తెరలు సిద్ధం చేశారు.
15 ఒక్కో తెర పొడవు ముప్ఫై మూరలు, వెడల్పు నాలుగు మూరలు. 16 ఆ పదకొండు తెరల కొలతలు ఒక్కటే. ఐదు తెరలను ఒక కూర్పుగా, ఆరు తెరలను ఒక కూర్పుగా చేశారు. 17 మొదటి కూర్పులో బయటి తెర అంచుకు ఏభై ఉంగరాలు, రెండవ కూర్పులో బయటి తెర అంచుకు ఏభై ఉంగరాలు ఏర్పాటు చేశారు.
18 వాటిని ఒక గుడారంగా కలపడానికి ఏభై యిత్తడి గుండీలు ఉపయోగించారు. 19 ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారం కప్పునూ, గండుచేప తోళ్ళతో దానికి పైకప్పునూ సిద్ధం చేశారు.
20 దైవ నివాసమైన మందిరం కోసం తుమ్మ కర్రతో నిలువు పలకలు చేశారు. 21 ఒక్కో పలక పొడవు పది మూరలు, వెడల్పు మూరన్నర. 22 ప్రతి పలకకు ఒకదాని కొకటి సమానమైన నిడివిలో రెండు కుసులు చేశారు. అదే విధంగా పలకలన్నిటికి అమర్చారు.
23 మందిరానికి దక్షిణం దిక్కున, అంటే కుడివైపున ఇరవై పలకలు ఉండేలా చేశారు. 24 ఒక్కొక్క పలక చొప్పున ఇరవై పలకల కింద రెండు కుసులకు రెండు దిమ్మలు, మొత్తం నలభై వెండి దిమ్మలు చేశారు.
25 మందిరం రెండవ వైపు, అంటే ఉత్తరం వైపు ఇరవై పలకలను వాటి నలభై వెండి దిమ్మలను, 26 ఒక్కో పలక కింద రెండు దిమ్మలను చేశారు.
27 పడమటి దిక్కున మందిరం వెనక ఆరు పలకలు చేశారు. 28 వెనుక వైపు మందిరం మూలలకు రెండు పలకలు చేశారు. 29 ఆ పలకలు కింది భాగంలో నిలిపి మొదటి ఉంగరం దాకా ఒకదానితో ఒకటి అంచు దాకా కలిపారు. అలా రెండు మూలల్లో ఆ రెండు పలకలు చేశారు.
30 ఎనిమిది పలకలు ఉన్నాయి. వాటికి అమర్చిన వెండి దిమ్మలు పదహారు. ప్రతి పలక అడుగునా రెండు దిమ్మలు ఉన్నాయి. 31 తుమ్మకర్రతో వాటికి అడ్డకర్రలు చేశారు. మందిరం ఒకవైపు పలకలకు ఐదు అడ్డకర్రలు, 32 రెండో వైపు పలకలకు ఐదు అడ్డకర్రలు, పడమటి వైపు మందిరం వెనుక వైపు పలకలకు ఐదు అడ్డకర్రలు చేశారు.
33 పలకల మధ్యలో ఉన్న ముఖ్యమైన అడ్డకర్ర ఈ అంచు నుండి ఆ అంచు వరకూ కలిసి ఉండేలా చేశారు. 34 ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించారు. వాటి అడ్డకర్రలు ఉండే గుండ్రని కమ్మీలు బంగారంతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులు పొదిగించారు.
35 నీలం ఊదా ఎర్రని రంగులు గల సన్నని నారతో పేని అడ్డతెరను సిద్ధం చేశారు. కెరూబు రూపాలను నైపుణ్యం గల పనితనంతో చేశారు. 36 దాని కోసం తుమ్మకర్రతో నాలుగు స్తంభాలు సిద్ధం చేసి వాటికి బంగారు రేకులు పొదిగించారు. వాటి బంగారపు కొక్కేల కోసం నాలుగు వెండి దిమ్మలు పోతపోశారు.
37 గుడారం ద్వారం కోసం నీలం, ఊదా, ఎర్ర రంగుల దారాలతో పేనిన సన్నని నారతో, అడ్డ తెరను నేయించారు. 38 దాని ఐదు స్తంభాలూ, వాటి కొక్కేలూ తయారు చేశారు. ఆ స్థంభాలకూ, వాటి కొక్కేలకూ, వాటి పెండె బద్దలకూ బంగారం రేకులు పొదిగించారు. వాటికి ఉన్న ఐదు దిమ్మలు ఇత్తడివి.