౧ అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి ఇలా చెప్పు, దేవుడు యెహోవా ఇలా చెప్పమన్నాడు. ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.’ ౨ నువ్వు గనక వాళ్ళను వెళ్ళనివ్వకుండా ఇంకా నిర్బంధంలో ఉంచినట్టయితే, ౩ యెహోవా చెయ్యి చాపి ఎంతో బాధ కలిగించే తెగులు పంపిస్తాడు. ఆ తెగులు నీ పశువులకు, గుర్రాలకు, గాడిదలకు, ఒంటెలకు, ఎద్దులకు, గొర్రెలకు పాకుతుంది.
౪ అయితే యెహోవా ఇశ్రాయేలు ప్రజల పశువులను ఐగుప్తు పశువులను వేరు చేస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందిన వాటిలో ఒక్కటి కూడా చనిపోదని హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నాడు. ౫ దేశంలో రేపు నిర్ణీత సమయానికి యెహోవా ఈ కార్యం జరిగిస్తాడు” అని చెప్పాడు.
౬ తరువాతి రోజున యెహోవా తెగులు పంపించినప్పుడు ఐగుప్తీయుల పశువులన్నీ చనిపోయాయి. అయితే ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చావలేదు. ౭ ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చనిపోలేదనే విషయం ఫరో నిర్ధారణ చేసుకున్నాడు. అయినప్పటికీ ఫరో హృదయం కఠినంగా మారిపోవడం వల్ల ప్రజలను పంపడానికి అంగీకరించలేదు.
౮ అప్పుడు యెహోవా “మీరు మీ పిడికిళ్ల నిండా బూడిద తీసుకోండి. మోషే ఫరో చూస్తూ ఉండగా దాన్ని ఆకాశం వైపు చల్లండి. ౯ అప్పుడు అది ఐగుప్తు దేశమంతా సన్నని దుమ్ములాగా మారి దేశంలోని మనుష్యుల మీదా, జంతువుల మీదా చీము పట్టే కురుపులు కలగజేస్తుంది” అని మోషే అహరోనులతో చెప్పాడు.
౧౦ మోషే అహరోనులు బూడిద తీసుకుని ఫరో దగ్గర నిలబడ్డారు. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లాడు. దానివల్ల మనుష్యులకు, జంతువులకు చీము కురుపులు పుట్టాయి. ౧౧ ఆ కురుపుల దురదల వల్ల మాంత్రికులు మోషే ఎదుట నిలబడలేకపోయారు. ఆ కురుపులు మాంత్రికులకు, ఐగుప్తీయులందరికీ పుట్టాయి. ౧౨ అయినప్పటికీ యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు వాళ్ళ మాట వినలేదు.
౧౩ తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఉదయం కాగానే లేచి ఫరో ఎదుటికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు. ౧౪ భూమి అంతటిలో నాలాంటివాడు ఎవరూ లేరని నీవు తెలుసుకోవాలని నీ హృదయం తీవ్రంగా కలత చెందేలా ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ సేవకుల పైకి, నీ దేశ ప్రజల పైకి పంపుతాను. ౧౫ ఇంతకు ముందే నేను నా చెయ్యి చాపి నిన్నూ నీ ప్రజలనూ విపత్తుతో కొట్టి భూమి మీద లేకుండా నాశనం చేసి ఉండేవాణ్ణి.
౧౬ నిన్ను బతికి ఉంచిన కారణం నా సామర్ధ్యం నీకు చూపడానికే. తద్వారా భూలోకమంతటా నా పేరు ప్రఖ్యాతి పొందాలి. ౧౭ నువ్వు ఇంకా నా ప్రజలను వెళ్ళనీయకుండా వాళ్ళపై మిడిసిపడుతున్నావు. ౧౮ ఇదిగో విను, రేపు ఈ పాటికి నేను తీవ్రమైన బాధ కలిగించే వడగళ్ళు కురిపిస్తాను. ఐగుప్తు సామ్రాజ్యం ఏర్పడినది మొదలు ఇప్పటి వరకూ అలాంటి వడగళ్ళు కురియలేదు.
౧౯ అందువల్ల నువ్వు నీ పశువులను, పొలాల్లో ఉన్న నీ పంటలనూ త్వరగా భద్రం చేయించుకో. ఇంటికి చేరకుండా పొలంలో ఉన్న ప్రతి వ్యక్తీ ప్రతి జంతువూ వడగళ్ళ బారిన పడి చనిపోతారు.” ౨౦ యెహోవా మోషే చేత పలికించిన మాటలు విన్న ఫరో సేవకుల్లో కొందరు తమ పశువులను ఇళ్లలోకి తెప్పించుకున్నారు. ౨౧ యెహోవా మాట లక్ష్యపెట్టనివారు తమ పనివాళ్ళను, పశువులను పొలంలోనే ఉండనిచ్చారు. ౨౨ యెహోవా “నీ చెయ్యి ఆకాశం వైపు చాపు. ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల మీదా, జంతువుల మీదా పంటలన్నిటి మీదా వడగళ్లు కురుస్తాయి” అని మోషేతో చెప్పాడు.
౨౩ మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములు వడగండ్లు కురిపించాడు. భూమి మీద పిడుగులు పడుతున్నాయి. ఐగుప్తు దేశం అంతటా యెహోవా వడగళ్ళు కురిపించాడు. ౨౪ ఆ విధంగా వడగళ్ళు, వడగళ్ళతో కూడిన పిడుగులు ఎంతో బాధ కలిగించాయి. ఐగుప్తు దేశం ఏర్పడినది మొదలు ఇలాంటిది సంభవించ లేదు. ౨౫ ఐగుప్తు దేశమంతటా కురిసిన ఆ వడగళ్ళు మనుష్యులను, జంతువులను, బయట ఉండిపోయిన సమస్తాన్నీ నాశనం చేశాయి. పొలంలో ఉన్న పంట అంతా నాశనం అయ్యింది. చెట్లన్నీ విరిగిపోయాయి. ౨౬ అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషెను దేశంలో మాత్రం వడగళ్ళు పడలేదు.
౨౭ ఇది చూసిన ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. “ఈసారి నేను తప్పు చేశాను. యెహోవా న్యాయవంతుడు, నేనూ నా ప్రజలూ దుర్మార్గులం. ౨౮ ఇంతవరకూ జరిగింది చాలు. ఈ భయంకరమైన ఉరుములు, వడగళ్ళు ఇంకా రాకుండా యెహోవాను వేడుకోండి. ఇక నేను మిమ్మల్ని ఆపను, మీరు కోరిన చోటికి వెళ్ళనిస్తాను” అని వాళ్ళతో చెప్పాడు. ౨౯ మోషే అతనితో “నేను ఈ పట్టణం నుండి బయటకు వెళ్ళి నా చేతులు యెహోవా వైపు ఎత్తుతాను. ఈ ఉరుములు ఆగిపోతాయి, వడగళ్ళు ఇకపై కురియవు. దీన్నిబట్టి ఈ లోకమంతా యెహోవాదేనని నువ్వు తెలుసుకొంటావు. ౩౦ అయినప్పటికీ నీకూ, నీ సేవకులకూ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు ఏర్పడలేదని నాకు తెలుసు” అన్నాడు.
౩౧ ఆ రోజుల్లో జనపనార చెట్లు మొగ్గ తొడిగాయి. బార్లీ చేలు వెన్నులు వేశాయి కనుక అవన్నీ నాశనం అయ్యాయి. ౩౨ గోదుమలు, మిరప మొక్కలు మొలకలు వేయనందువల్ల అవి పాడవలేదు. ౩౩ మోషే ఫరోతో మాట్లాడి ఆ పట్టణం నుండి బయటకు వెళ్లి యెహోవా వైపు తన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు వాన ఆగిపోయింది. ఉరుములు, వడగళ్ళు నిలిచిపోయాయి.
౩౪ అయితే వర్షం, వడగళ్ళు, ఉరుములు ఆగిపోవడం చూసిన ఫరో, అతని సేవకులు ఇంకా పాపం చేస్తూ తమ హృదయాలను కఠినం చేసుకున్నారు. ౩౫ యెహోవా మోషేకు చెప్పినట్టు ఫరో హృదయం కఠినంగా మారింది, అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.