33
యాకోబు ఏశావు కలుసుకున్నారు
యాకోబు కళ్ళెత్తి చూసినప్పుడు ఏశావు, అతనితో నాలుగువందల మంది మనుషులు వస్తూ ఉన్నారు. అప్పుడు అతడు తన పిల్లలను లేయా, రాహేలులకు, ఇద్దరు దాసీలకు అప్పగించాడు. అతడు ముందు దాసీలనూ వారి పిల్లలనూ, వారి వెనక లేయానూ ఆమె పిల్లలనూ, ఆ వెనక రాహేలునూ యోసేపునూ ఉంచాడు. తాను వారి ముందు వెళ్తూ తన సోదరుణ్ణి సమీపించే వరకూ ఏడు సార్లు నేలపై సాగిలపడ్డాడు. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కోడానికి పరుగెత్తి అతనిని కౌగలించుకుని అతని మెడను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఏశావు ఆ స్త్రీలనూ పిల్లలనూ చూసి “వీరు నీకేమౌతారు?” అని అడిగాడు. అతడు “వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే” అని చెప్పాడు.
అప్పుడు ఆ దాసీలూ వారి పిల్లలూ దగ్గరికి వచ్చి ఏశావు ఎదుట సాగిలపడ్డారు. లేయా ఆమె పిల్లలూ దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు. ఆ తరువాత యోసేపూ రాహేలు దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. ఏశావు “నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతా ఎందుకు?” అని అడిగాడు. అతడు “నా ప్రభువు దయ నా మీద కలగడానికే” అని చెప్పాడు. అప్పుడు ఏశావు “తమ్ముడూ, నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకో” అని చెప్పాడు. 10 అప్పుడు యాకోబు “అలా కాదు, నీ అనుగ్రహం నా మీద ఉంటే దయచేసి ఈ కానుకను అంగీకరించు. దేవుని ముఖం చూసినట్టుగా నీ ముఖం చూశాను. నీ దయ నా మీద ఉంది కదా. 11 నేను నీ కోసం తెచ్చిన కానుకను దయచేసి అంగీకరించు. దేవుడు నన్ను కనికరించాడు. పైగా, నాకు కావలసినంత ఉంది” అని చెప్పి అతన్ని బలవంతం చేశాడు కాబట్టి అతడు దాన్ని పుచ్చుకుని 12 “మనం వెళదాం, నేను నీకు ముందుగా సాగిపోతాను” అని చెప్పగా 13 అతడు “నాదగ్గర ఉన్న పిల్లలు పసిపిల్లలనీ, గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చేవి అని నా ప్రభువుకు తెలుసు. ఒక్క రోజే వాటిని వేగంగా తోలితే ఈ మంద అంతా చస్తుంది. 14 నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళాలి. నేను నా ప్రభువు దగ్గరికి శేయీరుకు వచ్చేవరకూ, ముందున్న మందలూ, ఈ పిల్లలూ నడవగలిగిన కొలదీ వాటిని మెల్లగా నడిపించుకుంటూ వస్తాను” అని అతనితో చెప్పాడు. 15 అప్పుడు ఏశావు “నీ కిష్టమైతే నా దగ్గర ఉన్న ఈ మనుషుల్లో కొందరిని నీ దగ్గర విడిచిపెడతాను” అనగా అతడు “అదెందుకు? నా ప్రభువు కటాక్షం నా మీద ఉంది. అది చాలు” అన్నాడు. 16 ఆ రోజునే ఏశావు తన దారిలో శేయీరుకు తిరిగి వెళ్ళిపోయాడు. 17 అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై వెళ్లి తమకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించాడు. అందుకు ఆ చోటికి “సుక్కోతు” అనే పేరు వచ్చింది.
యాకోబు షెకెము చేరుకోవడం
18 ఆ విధంగా యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలో ఉన్న షెకెము అనే ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందు తన గుడారాలు వేశాడు. 19 అతడు గుడారాలు వేసిన పొలంలోని భాగాన్ని షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల దగ్గర నూరు వెండి నాణాలకు కొన్నాడు. 20 అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి “*ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలు” అని పేరు పెట్టాడు.
* 33:20 33:20 అంటే దేవుడు, ఇశ్రాయేలు వారి దేవుడు, ప్రభావ శాలి