3
ఆదర్శ సోదరుడు. విశ్వాసి పవిత్రీకరణ
1 కాబట్టి ఇక ఆగలేక ఏతెన్సులో మేము ఒంటరిగానైనా ఉండడం మంచిదే అని నిశ్చయించుకుని
2-3 ఈ హింసల మూలంగా మీలో ఎవరూ చెదరిపోకుండా విశ్వాసం విషయంలో మిమ్మల్ని ఆదరించడానికీ బలపరచడానికీ మన సోదరుడూ క్రీస్తు సువార్త విషయంలో దేవుని సేవకుడూ అయిన తిమోతిని మీ దగ్గరికి పంపించాం. ఈ కష్టాలు అనుభవించాలని దేవుడే నియమించాడని మీకు తెలుసు.
4 మేము మీ దగ్గర ఉన్నప్పుడు “మనం హింసలు పొందాలి” అని ముందుగానే మీతో చెప్పాం కదా! మీకు తెలిసినట్టుగానే ఇప్పుడు అలా జరుగుతూ ఉంది.
5 అందుకే ఇక నేను కూడా ఉండబట్టలేక ఒకవేళ దుష్ట ప్రేరకుడు మిమ్మల్ని ప్రేరేపించాడేమో అనీ, మా ప్రయాస అంతా వ్యర్థమైపోయిందేమో అనీ మీ విశ్వాసం ఎలా ఉందో తెలుసుకోడానికి తిమోతిని పంపాను.
6 ఇప్పుడు అతడు మీ దగ్గర నుండి తిరిగి వచ్చి క్రీస్తు పట్ల మీ విశ్వాస ప్రేమలను గురించీ, మేము మిమ్మల్ని చూడాలని ఆశ పడుతున్నట్టే మీరు కూడా మమ్మల్ని చూడాలని ఆశ పడుతున్నారనీ, మమ్మల్ని ఎప్పుడూ ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారనీ మీ గురించి సంతోషకరమైన వార్త అతడు తీసుకుని వచ్చాడు.
7 అందుచేత సోదరులారా, మీ విశ్వాసం చూసి మా ఇబ్బందులన్నిటిలో హింసలన్నిటిలో ఆదరణ పొందాం.
8 ఎందుకంటే మీరు ప్రభువులో నిలకడగా ఉంటే మా జీవితం సార్థకం అయినట్టే.
9 మీ గురించీ, దేవుని ఎదుట మీ విషయంలో మాకు కలిగే ఆనందం గురించి దేవునికి మేము ఏమని కృతజ్ఞతలు చెల్లించగలం?
10 మీ ముఖాలు చూడాలనీ, మీ విశ్వాసంలో కొరతగా ఉన్నవాటిని సరిచేయాలనీ రాత్రింబగళ్ళు తీవ్రంగా ప్రార్థనలో వేడుకుంటున్నాం
11 మన తండ్రి అయిన దేవుడూ, మన ప్రభు యేసూ మమ్మల్ని మీ దగ్గరికి ఎలాంటి ఆటంకం లేకుండా తీసుకువస్తాడు గాక!
12 మీ పట్ల మా ప్రేమ ఎలా అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతూ ఉన్నదో అలాగే మీరు కూడా ఒకరిపట్ల ఒకరు, ఇంకా, అందరి పట్ల కూడా ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లేలా ప్రభువు అనుగ్రహించు గాక.
13 మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసి వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలు పరిశుద్ధత విషయంలో నిందారహితంగా ఉండేలా ఆయన స్థిరపరచు గాక!