31
ఐగుప్తు మీద ఆధారపడిన వారికి బాధ
1 “ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి పట్టించుకోకుండా, ఆలోచన కోసం యెహోవా దగ్గరకి వెళ్ళకుండా
సహాయం కోసం ఐగుప్తుకి వెళ్ళే వాళ్ళకీ, గుర్రాలపై ఆధార పడేవాళ్ళకీ,
అసంఖ్యాకంగా ఉన్న వాళ్ళ రథాలపైనా, లెక్కకు మించిన రౌతుల పైనా నమ్మకం ఉంచే వాళ్ళకీ బాధ!
2 అయినా ఆయన జ్ఞాని. ఆయన నాశనాన్ని పంపిస్తాడు. తన మాటలను ఆయన వెనక్కి తీసుకోడు.
దుర్మార్గుల ఇంటి మీదికీ, పాపులకు సహాయం చేసే వాళ్ళ మీదికీ ఆయన లేస్తాడు.
3 ఐగుప్తు వాడు మనిషే. దేవుడు కాదు. వాళ్ళ గుర్రాలు రక్త మాంసాలే, ఆత్మ కాదు.
యెహోవా తన చేతిని చాపినప్పుడు సహాయం చేసిన వాడూ, సహాయం పొందినవాడూ, ఇద్దరూ పతనమవుతారు. ఇద్దరూ నాశనం అవుతారు.”
4 యెహోవా నాకు ఇలా చెప్పాడు. “ఒక సింహం, ఒక కొదమ సింహం తాను వేటాడి తెచ్చిన జంతువు దగ్గర గర్జించినప్పుడు దాన్ని తప్పించడానికి కొందరు గొర్రెల కాపరులు ఎన్ని శబ్దాలు చేసినా కొదమ సింహం వాళ్ళ శబ్దాలకి ఏ మాత్రం భయపడదు. అక్కడి నుంచి జారుకోడానికి ప్రయత్నించదు. ఆ విధంగా సేనల ప్రభువు అయిన యెహోవా యుద్ధం చేయడానికి సీయోను పర్వతం పైకి దిగి వస్తాడు. ఆ పర్వతంపై ఆయన యుద్ధం చేస్తాడు.
5 ఎగురుతూ ఉండే పక్షిలాగా సేనల ప్రభువు యెహోవా యెరూషలేమును కాపాడుతాడు.
ఆయన దానిపై సంచరించేటప్పుడు దాన్ని సంరక్షిస్తాడు, విడిపిస్తాడు, భద్రపరుస్తాడు.
6 ఇశ్రాయేలు ప్రజలారా, ఎవరి నుండి మీరు పూర్తిగా తొలగిపోయారో ఆయన వైపుకి తిరగండి.
7 మీలో ప్రతి ఒక్కడూ తన చేతులతో పాపం చేసి తయారు చేసిన వెండి విగ్రహాలనూ, బంగారు విగ్రహాలనూ ఆ రోజున పారవేస్తాడు.
8 అష్షూరు కత్తి మూలంగా కూలుతుంది. అయితే అది మనిషి ఝళిపించే కత్తి కాదు.
అతడు ఆ కత్తిని ఎదుర్కోలేక పారిపోతాడు. అతని పిల్లలు బానిసలై బలవంతంగా కఠిన శ్రమ చేస్తారు.
9 మహా భయం చేత వాళ్ళు నమ్మకాన్ని అంతా కోల్పోతారు. అతని అధిపతులు యెహోవా యుద్ధ జెండాను చూసినంతనే భయపడిపోతారు.”
ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. ఆయన అగ్ని సీయోనులోనూ, ఆయన కొలిమి యెరూషలేములోనూ ఉన్నాయి.