40
దేవుని ప్రజలకు ఆదరణ
1 మీ దేవుడు చెబుతున్నది ఏమంటే,
2 “ఓదార్చండి, నా ప్రజలను ఓదార్చండి.” యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి.
ఆమె యుద్ధకాలం ముగిసింది. ఆమెకు పాపాల వలన కలిగిన దోషం తీరిపోయింది.
ఆమెకు చెప్పండి, యెహోవా చేతిలో ఆమె తన సమస్త పాపాల నిమిత్తం రెండింతల ఫలితం పొందిందని.
3 వినండి, అడవిలో ఒకడు ఈ విధంగా ప్రకటన చేస్తున్నాడు,
“అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచండి. ఎడారిలో మా దేవుని రాజమార్గం తిన్నగా చేయండి.”
4 ప్రతి లోయను ఎత్తు చేయాలి. ప్రతి పర్వతాన్ని, ప్రతి కొండను అణిచివేయాలి.
వంకర వాటిని తిన్నగా, గరుకైన వాటిని నునుపుగా చేయాలి.
5 యెహోవా మహిమ వెల్లడి అవుతుంది. ఎవ్వరూ తప్పిపోకుండా ప్రతి ఒక్కరూ దాన్ని చూస్తారు.
ఎందుకంటే యెహోవా దేవుడే ఇలా సెలవిచ్చాడు.
6 వినండి “ప్రకటించండి” అని ఒక స్వరం పలికింది.
“నేనేం ప్రకటించాలి?” మరొక స్వరం పలికింది. “శరీరులంతా గడ్డివంటివారు, వారి అందమంతా అడవి పువ్వులాటిది.
7 యెహోవా తన ఊపిరి ఊదినప్పుడు గడ్డి ఎండిపోతుంది. పువ్వులు వాడిపోతారు. మనుషులు నిజంగా గడ్డిలాంటివారే.
8 గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది. మన దేవుని వాక్యమైతే నిత్యమూ నిలిచి ఉంటుంది.”
9 సువార్త ప్రకటిస్తున్న సీయోనూ, ఎత్తయిన కొండ ఎక్కు. సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమూ, భయపడకుండా స్థిరంగా ప్రకటించు.
“ఇదిగో మీ దేవుడు” అని యూదా పట్టణాలకు ప్రకటించు.
10 ఇదిగో, ప్రభువైన యెహోవా జయశాలి అయిన యోధునిగా వస్తున్నాడు. తన బలమైన చేతితో ఆయన పాలిస్తాడు.
ఆయన ఇవ్వదలచిన బహుమానం ఆయనతో ఉంది. ఆయన ఇచ్చే ప్రతిఫలం ఆయనకు ముందుగా నడుస్తున్నది.
11 ఒక గొర్రెల కాపరిలాగా ఆయన తన మందను మేపుతాడు. తన చేతులతో గొర్రెపిల్లలను ఎత్తి రొమ్మున ఆనించుకుని మోస్తాడు.
పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తాడు.
12 తన దోసిలిలో జలాలను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశాలను కొలిచిన వాడెవడు?
భూమిలోని మన్ను అంతటినీ కొలపాత్రలో ఉంచిన వాడెవడు?
త్రాసుతో పర్వతాలను, తూనికతో కొండలను తూచిన వాడెవడు?
13 యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఒక మంత్రిలాగా ఆయనకు సలహా చెప్పిన వాడెవడు?
ఆయన ఎవరినైనా ఎప్పుడైనా ఆలోచన అడిగాడా?
14 ఆయనకు తెలివిని ఇచ్చిన వాడెవడు? న్యాయమార్గాలను ఆయనకు నేర్పిన వాడెవడు?
ఆయనకు జ్ఞానాభ్యాసం చేసిన వాడెవడు? ఆయనకు బుద్ధిమార్గం బోధించిన వాడెవడు?
15 రాజ్యాలు చేద నుండి జారిపడే నీటి బిందువుల్లాంటివి. ప్రజలు త్రాసు మీది దుమ్మువంటివారు.
ద్వీపాలు గాలికి ఎగిరే సూక్ష్మ రేణువుల్లా ఉన్నాయి.
16 అగ్నికి లెబానోను వృక్షాలు సరిపోవు. దహనబలికి దాని పశువులు చాలవు.
17 ఆయన దృష్టికి సమస్త రాజ్యాలు లేనట్టుగానే ఉంటాయి.
ఆయన వాటిని విలువ లేనివిగా, వ్యర్ధంగా ఎంచుతాడు.
18 కాబట్టి మీరు దేవుణ్ణి ఎవరితో పోలుస్తారు? ఏ విగ్రహ రూపాన్ని ఆయనకు సమానం చేస్తారు?
19 విగ్రహాన్ని గమనిస్తే, ఒక శిల్పి దాన్ని పోతపోస్తాడు.
కంసాలి దాన్ని బంగారు రేకులతో పొదిగి దానికి వెండి గొలుసులు చేస్తాడు.
20 విలువైన దాన్ని అర్పించలేని పేదవాడు పుచ్చిపోని చెక్కను తీసుకొస్తాడు.
స్థిరంగా నిలిచే విగ్రహాన్ని చేయడానికి నేర్పుగల పనివాణ్ణి పిలుస్తాడు.
21 మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరూ మీతో చెప్పలేదా?
భూమి పునాదులు చూసి మీరు దాన్ని గ్రహించలేదా?
22 ఆయన భూమండలానికి పైగా ఆసీనుడు అయ్యాడు
దాని నివాసులు ఆయన ఎదుట మిడతల్లాగా కనబడుతున్నారు.
ఒకడు ఒక తెరను విప్పినట్లు ఆయన ఆకాశాలను పరచి ఒక గుడారంలాగా దాన్ని నివాసస్థలంగా ఏర్పరిచాడు.
23 రాజులను ఆయన శక్తిహీనులుగా చేస్తాడు. భూమిని పాలించే వారిని నిరర్ధకం చేస్తాడు.
24 చూడు, వారు నాటారో లేదో, వారు పాతిపెట్టారో లేదో, వారి కాండం భూమిలో వేరు తన్నిందో లేదో, ఆయన వారి మీద ఊదీ ఊదగానే వారు వాడిపోతారు.
సుడిగాలి పొట్టును ఎగర గొట్టినట్టు ఆయన వారిని ఎగరగొడతాడు.
25 “ఇతడు నీతో సమానుడు అని మీరు నన్నెవరితో పోలుస్తారు?” అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు.
26 మీ కళ్ళు పైకెత్తి చూడండి. ఆ నక్షత్రాలన్నిటినీ ఎవరు సృజించారు? వాటిని వరుసలో నిలిపి వాటి పేరుల చొప్పున పిలిచేవాడే గదా.
తన అధికశక్తి చేతా తన బలాతిశయం చేతా ఆయన ఒక్కటి కూడా విడిచిపెట్టడు.
27 యాకోబూ “నా మార్గం యెహోవాకు తెలియదు, నా న్యాయం నా దేవునికి కనబడదు” అని నీవెందుకు అంటున్నావు? ఇశ్రాయేలూ, నీవెందుకు ఇలా చెబుతున్నావు?
28 నీకు తెలియలేదా? నీవు వినలేదా?
భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు.
ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం.
29 అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే.
30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.
31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.
వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.
అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.