62
సీయోను పునరుద్ధరణ
1 సీయోను నీతి, సూర్యకాంతిలా కనబడే వరకూ దాని రక్షణ, దీపాలుగా వెలిగే వరకూ
సీయోను పక్షంగా నేను మౌనంగా ఉండను. యెరూషలేము కోసం నేను ఊరుకోను.
2 రాజ్యాలు నీ నీతి చూస్తారు. రాజులంతా నీ మహిమను చూస్తారు.
యెహోవా కోరే కొత్త పేరు నీకు పెడతారు.
3 నువ్వు యెహోవా చేతిలో అందమైన కిరీటంగా నీ దేవుని చేతిలో రాజ్యకిరీటంగా ఉంటావు.
4 నిన్ను ఇంకెప్పుడూ “విడువబడిన దానివి” అనీ, నీ దేశాన్ని “పాడైపోయినది” అనీ ఇక అనరు.
దాని బదులు నిన్ను “ప్రియమైనది” అనీ, నీ దేశాన్ని “కళ్యాణి” అనీ అంటారు.
ఎందుకంటే యెహోవా నిన్నుబట్టి ఆనందిస్తున్నాడు. నీ దేశానికి వివాహం జరుగుతుంది.
5 యువకుడు ఒక యువతిని పెళ్లిచేసుకున్నట్టు నీ కొడుకులు నిన్ను పెళ్లి చేసుకుంటారు.
పెళ్ళికొడుకు తన పెళ్ళికూతురుతో సంతోషించేలా నీ దేవుడు నిన్ను చూచి సంతోషిస్తాడు.
6 యెరూషలేమా, నీ గోడలమీద నేను కావలి వారిని ఉంచాను.
రాత్రి పగలూ వారు మౌనంగా ఉండరు.
యెహోవాకు గుర్తుచేస్తూ ఉండే మీరు విరామం తీసుకోవద్దు.
7 ఆయన యెరూషలేమును సుస్థిరం చేసే వరకు
లోకమంతటా దానికి ప్రసిద్ధి కలిగించే వరకు ఆయన్ని వదలొద్దు.
8 తన కుడి చెయ్యి తోడనీ తన బలమైన హస్తం తోడనీ యెహోవా ఇలా ప్రమాణం చేశాడు,
“నేను నీ ధాన్యాన్ని నీ శత్రువులకు ఆహారంగా ఇక ఎన్నడూ ఇవ్వను. నువ్వు కష్టపడి తీసిన ద్రాక్షారసాన్ని విదేశీయులు తాగరు.
9 కోత కోసినవాళ్ళే దాన్ని తింటారు. యెహోవాను స్తుతిస్తారు.
ద్రాక్ష పళ్ళు కోసినవాళ్ళే నా పవిత్రాలయ ఆవరణాల్లో దాని రసం తాగుతారు.”
10 ద్వారాల గుండా రండి! రండి! ప్రజలకు దారి సిద్ధం చేయండి!
జాతీయ మార్గాన్ని కట్టండి! రాళ్ళు ఏరి పారవేయండి!
రాజ్యాల కోసం జండా సూచన ఎత్తండి!
11 వినండి. ప్రపంచమంతటికీ యెహోవా తెలియచేశాడు.
“సీయోను ఆడపడుచుతో ఇలా చెప్పండి. ఇదిగో, నీ రక్షకుడు వస్తున్నాడు!
ఇదిగో, ఆయన బహుమానం ఆయన దగ్గర ఉంది. తానిచ్చే జీతం ఆయన తీసుకు వస్తున్నాడు.”
12 “పరిశుద్ధప్రజలు” “యెహోవా విమోచించిన వారు” అని వీళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. “కోరతగినది” అనీ “తిరస్కారానికి గురి కాని పట్టణం” అనీ నిన్ను పిలుస్తారు.