4
కుటుంబం, లోకం, కపట బోధకుల విషయంలో జాగ్రత్త
ప్రియులారా, లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ప్రతి ఆత్మనూ నమ్మకండి. ఆ ఆత్మలు దేవునికి సంబంధించినవో, కావో, పరీక్షించి చూడండి.
క్రీస్తు గురించి వారి తప్పుడు బోధ
ఏ ఆత్మైనా దేవునికి చెందినదా లేదా అన్న విషయాన్ని ఈ విధంగా గుర్తించగలుగుతాము. యేసు క్రీస్తు మానవునిగా వచ్చాడు అని అంగీకరించే ప్రతి ఆత్మా దేవునికి చెందినది. యేసును అంగీకరించని ప్రతి ఆత్మా దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధికి చెందిన ఆత్మ. అది రాబోతున్నదని మీరు విన్నారు. కానీ అది ఇప్పటికే ఈ లోకంలో ఉంది. పిల్లలూ, మీరు దేవుని సంబంధులు. మీరు ఆ ఆత్మలను జయించారు. ఎందుకంటే, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు.
వారి లక్షణాలు
ఆ ఆత్మలు లోకానికి చెందినవారు కాబట్టి వారు చెప్పేది లోక సంబంధంగా ఉంటుంది. లోకం వారి మాట వింటుంది. మనం దేవుని సంబంధులం. దేవుణ్ణి తెలుసుకున్నవాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దీన్ని బట్టి ఏ ఆత్మ సత్యమైనదో, ఏ ఆత్మ అసత్యమైనదో మనం తెలుసుకుంటాం.
నిజమైన పిల్లలు జన్మించిన విధానం
ప్రియులారా, ఒకరిని ఒకరు ప్రేమించుకుందాం. ఎందుకంటే, ప్రేమ దేవునినుండి వస్తుంది. ప్రేమించే ప్రతి మనిషీ దేవుని ద్వారా పుట్టి, దేవుణ్ణి తెలుసుకున్న వాడు. ప్రేమించని వాడికి దేవుడు తెలియదు. ఎందుకంటే దేవుడు ప్రేమ. దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి, ఆయన ద్వారా మనం జీవించాలన్నది ఆయన ఉద్దేశం. దీని ద్వారా దేవుని ప్రేమ మన మధ్య వెల్లడి అయ్యింది. 10 మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు గాని ఆయనే మనలను ప్రేమించి, మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా మనకోసం తన కుమారుణ్ణి పంపించాడు. ప్రేమంటే ఇదే.
11 ప్రియులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 12 ఎవ్వరూ, ఎన్నడూ, దేవుణ్ణి చూడలేదు. మనం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే, దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మనలో సంపూర్ణం అవుతుంది. 13 దీనివలన మనం ఆయనలో నిలిచి ఉన్నామనీ, ఆయన మనలో నిలిచి ఉన్నాడనీ తెలుసుకుంటాము. ఎందుకంటే, ఆయన తన ఆత్మను మనకిచ్చాడు.
14 తండ్రి తన కుమారుణ్ణి ఈ లోక రక్షకుడుగా పంపించడం మేము చూశాము. దానికి మేము సాక్షులం. 15 యేసు దేవుని కుమారుడని ఎవరు అంగీకరిస్తారో అతనిలో దేవుడు నిలిచి ఉంటాడు. అతడు దేవునిలో నిలిచి ఉంటాడు. 16 దేవునికి మనపై ఉన్న ప్రేమను మనం తెలుసుకుని విశ్వసించాము. దేవుడు ప్రేమ. ప్రేమలో నిలిచి ఉన్నవాడు దేవునిలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. 17 తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా మన మధ్య ఈ ప్రేమ పరిపూర్ణం అయ్యింది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆయన ఉన్నట్టే ఉన్నాం.
18 ప్రేమలో భయం లేదు. పరిపూర్ణ ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. ఎందుకంటే భయం శిక్షకు సంబంధించింది. భయం ఉన్నవాడు ఇంకా ప్రేమలో పరిపూర్ణత పొందలేదు. 19 దేవుడే మొదట మనలను ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం.
20 “నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను” అని చెబుతూ, తన సోదరుణ్ణి ద్వేషిస్తే, అతడు అబద్ధికుడే. కనిపిస్తున్న సోదరుణ్ణి ప్రేమించని వాడు, కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు. 21 దేవుణ్ణి ప్రేమించేవాడు తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలి, అన్న ఆజ్ఞ ఆయన నుండి మనకు ఉంది.