38
యెహోవా మాటలు
అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు.
జ్ఞానం లేని మాటలు చెప్పి నా పథకాలను చెడగొడుతున్న వీడెవడు?
పౌరుషంగా నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేస్తాను. నాకు జవాబియ్యాలి.
నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు అంత తెలివి తేటలుంటే చెప్పు.
నీకు తెలిస్తే చెప్పు, దాని పరిమాణం ఎవరు నిర్ణయించారు? దానికి కొలతలు వేసిన దెవరు?
6-7 దాని పునాదులు దేనిపై ఉన్నాయి? ఉదయ నక్షత్రాలు కలిసి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందంగా జయజయధ్వానాలు చేస్తుండగా దాని మూలరాయి నిలబెట్టింది ఎవరు?
సముద్రం దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపులు వేసి దాన్ని మూసిన వాడెవడు?
నేను మేఘాలకు బట్టలు తొడిగినప్పుడు గాఢాంధకారాన్ని దానికి పొత్తిగుడ్డగా వేసినప్పుడు నువ్వు ఉన్నావా?
10 సముద్రానికి నా సరిహద్దు నియమించి, దాని తలుపులను, గడియలను అమర్చినప్పుడు,
11 “నువ్వు ఇంతవరకే మరి దగ్గరికి రాకూడదు, ఇక్కడే నీ తరంగాల గర్వం అణిగిపోవాలి” అని నేను సముద్రానికి చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా?
12 నీ జీవితకాలమంతటిలో ఎప్పుడైనా ప్రాతఃకాలాన్ని రమ్మని ఆజ్ఞాపించావా? తెల్లవారి సూర్యోదయానికి దాని స్థానాన్ని నియమించావా?
13 దుష్టులు దానిలో ఉండకుండా దులిపివేసేలా భూమి అంచులను అది ఒడిసి పట్టేలా ఉదయాన్ని పంపించావా?
14 ముద్ర బంకమట్టి రూపాన్ని మార్చినట్టు భూతలం రూపాంతరం చెందుతూ ఉంటుంది. దానిపై ఉన్నవన్నీ వస్త్రం మీది మడతల్లాగా స్పష్టంగా కనబడతాయి.
15 దుష్టుల వెలుగు వారి నుండి తొలిగిపోతుంది. వారు ఎత్తిన చెయ్యి విరగ్గొట్టబడుతుంది.
16 సముద్రపు ఊటల్లోకి నువ్వు చొరబడ్డావా? సముద్రం అడుగున తిరుగులాడావా?
17 మరణద్వారాలు నీకు తెరుచుకున్నాయా? మరణాంధకార ద్వారాలను నువ్వు చూశావా?
18 భూమి వైశాల్యం ఎంతో నువ్వు గ్రహించావా? ఇదంతా నీకేమైనా తెలిస్తే చెప్పు.
19 వెలుగు విశ్రాంతి తీసుకునే చోటుకు దారి ఏది? చీకటి అనేదాని ఉనికిపట్టు ఏది?
20 వెలుగును, చీకటిని అవి ఉద్యోగాలు చేసే చోటులకు నువ్వు తీసుకుపోగలవా? వాటి పని అయిపోయాక వాటిని మళ్లీ వాటి ఇళ్ళకు తీసుకుపోగలవా?
21 ఇవన్నీ నీకు తెలుసు కదా! నువ్వు అప్పటికే పుట్టావట గదా. నువ్వు బహు వృద్ధుడివి మరి.
22-23 నువ్వు మంచును నిలవ చేసిన గిడ్డంగుల్లోకి వెళ్లావా? వడగండ్లను దాచి ఉంచిన కొట్లను నువ్వు చూశావా?
ఆపత్కాలం కోసం యుద్ధ దినాల కోసం నేను వాటిని దాచి ఉంచాను.
24 మెరుపులను వాటి వాటి దారుల్లోకి పంపించే చోటు ఏది? తూర్పు గాలి ఎక్కడనుండి బయలుదేరి భూమి మీద నఖముఖాలా వీస్తుంది?
25 మనుషులు లేని తావుల్లో వర్షం కురిపించడానికి, నిర్జన ప్రదేశాల్లో వాన కురియడానికి,
26 చవిటి నేలలను, జన సంచారం లేని ఎడారులను తృప్తి పరచడానికి, అక్కడ లేత గడ్డి పరకలు మొలిపించడానికి,
27 వర్ష ధారలకోసం కాలవలను, ఉరుములు గర్జించడానికి దారులను ఏర్పరచిన వాడెవడు?
28 వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను కన్నది ఎవరు?
29 మంచు గడ్డ ఎవరి గర్భంలోనుండి వస్తుంది? ఆకాశం నుండి జాలువారే మంచును ఎవరు పుట్టించారు?
30 జలాలు దాక్కుని రాయిలాగా గడ్డకట్టుకుపోతాయి. అగాధజలాల ఉపరితలం ఘనీభవిస్తుంది.
31 కృత్తిక నక్షత్రాలను నువ్వు బంధించగలవా? మృగశిరకు కట్లు విప్పగలవా?
32 వాటి కాలాల్లో నక్షత్ర రాసులను వచ్చేలా చేయగలవా? సప్తర్షి నక్షత్రాలను వాటి ఉపనక్షత్రాలను నువ్వు నడిపించగలవా?
33 ఆకాశమండల నియమాలు నీకు తెలుసా? అది భూమిని పరిపాలించే విధానం నువ్వు స్థాపించగలవా?
34 జడివాన నిన్ను కప్పేలా మేఘాలకు గొంతెత్తి నువ్వు ఆజ్ఞ ఇయ్యగలవా?
35 మెరుపులు బయలుదేరి వెళ్లి “చిత్తం ఇదుగో ఉన్నాం” అని నీతో చెప్పేలా నువ్వు వాటిని బయటికి రప్పించగలవా?
36 మేఘాల్లో జ్ఞానం ఉంచిన వాడెవడు? పొగమంచుకు తెలివినిచ్చిన వాడెవడు?
37 నైపుణ్యంగా మేఘాలను లెక్కబెట్ట గలవాడెవడు?
38 మట్టి గడ్డల్లోకి ధూళి దూరి అవి ఒక దానికొకటి అంటుకొనేలా మేఘ కలశాల్లో నుండి నీటిని ఒలికించగలిగింది ఎవరు?
39 ఆడసింహం కోసం నువ్వు జంతువును వేటాడతావా?
40 సింహం పిల్లలు తమ గుహల్లో పడుకుని ఉన్నప్పుడు, తమ మాటుల్లో పొంచి ఉన్నప్పుడు నువ్వు వాటి ఆకలి తీరుస్తావా?
41 కాకి పిల్లలు దేవునికి మొరపెట్టేటప్పుడు, ఆకలికి అలమటించేటప్పుడు వాటికి ఆహారం ఇచ్చేవాడెవడు?