21
బెన్యామీనీయుల కోసం భార్యలు
ఇశ్రాయేలీయులు మిస్పాలో సమావేశమై “మనలో ఎవరూ మన కుమార్తెలను బెన్యామీనీయులకు వివాహానికి ఇవ్వకూడదు” అని శపథం చేశారు. తరువాత వారంతా బేతేలుకు వెళ్ళారు. అక్కడే సాయంత్రం వరకూ దేవుని సన్నిధిలో కూర్చున్నారు. “యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, ఈ రోజున ఇశ్రాయేలీయుల్లో ఒక గోత్రం లేకుండా పోయింది. ఇశ్రాయేలుకు ఇది ఎందుకు జరిగింది” అంటూ ఎంతో ఏడ్చారు.
తరువాత రోజున ప్రజలు ఉదయాన్నే లేచి అక్కడ బలిపీఠం కట్టి దహన బలులనూ, సమాధాన బలులనూ అర్పించారు. అప్పుడు ఇశ్రాయేలీయులు “ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో మిస్పాలో యెహోవా ఎదుట జరిగిన సమావేశానికి రాకుండా ఉన్నదెవరు” అంటూ వాకబు చేసారు. ఎందుకంటే అలాంటి వారికి కచ్చితంగా మరణ శిక్ష విధించాలని శపథం చేశారు.
ఇశ్రాయేలీయులు తమ సోదరులైన బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడి ఇలా చెప్పుకున్నారు “ఈ రోజున ఒక ఇశ్రాయేలీయుల గోత్రం అంతరించి పోయింది. మిగిలిన వారికి ఎవరికీ మన కూతుళ్ళను పెళ్ళికి ఇవ్వకూడదని యెహోవా పేరుమీద శపథం చేశాం కదా, ఇప్పుడు మిగిలిన వారికి భార్యలు ఎవరు చూస్తారు? ఇక వారి విషయంలో మనం ఏం చేయగలం?”
వారు ఇశ్రాయేలీయుల గోత్రాల్లో యెహోవా ఎదుట మిస్పాలో జరిగిన సమావేశానికి రానిది ఎవరు, అని విచారించినప్పుడు యాబేష్గిలాదునుండి సైన్యంలోకి ఎవరూ రాలేదని తెలిసింది. ప్రజలంతా అక్కడ జన గణనలో చేరినప్పుడు యాబేష్గిలాదు నివాసుల్లో ఒక్కడు కూడా అక్కడ లేడు.
10 కాబట్టి సమాజపు వారు ధైర్యవంతులైన పన్నెండు వేలమంది మనుషులను యాబేష్గిలాదు మీద దాడి చేసి అక్కడ స్త్రీలూ, పిల్లలతో సహా అందర్నీ చంపమనే ఆదేశంతో పంపించారు. 11 “మీరు ఇలా చేయండి, ప్రతి మగవాణ్ణీ అలాగే కన్య కాని ప్రతి స్త్రీనీ చంపండి” అని చెప్పారు. 12 యాబేష్గిలాదు నివాసుల్లో పురుష సాంగత్యం తెలియని నాలుగు వందలమంది స్త్రీలను వాళ్ళు చూసారు. వాళ్ళను కనాను దేశంలోని షిలోహు లో ఉన్న సైన్యం శిబిరానికి తీసుకు వచ్చారు.
13 అప్పుడు సమాజం రిమ్మోను కొండ దగ్గర ఉన్న బెన్యామీనీయులతో శాంతి చేసుకోడానికి సమాచారం పంపించారు. 14 ఆ సమయంలో బెన్యామీనీయులు తిరిగి వచ్చారు. యాబేష్గిలాదు నుండి తీసుకు వచ్చిన స్త్రీలను వారికిచ్చి పెళ్ళిళ్ళు చేశారు. అయితే ఆ స్త్రీలు వాళ్లకు సరిపోలేదు. 15 యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రాల్లో లోపం కలగ చేశాడని ప్రజలంతా బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడ్డారు.
16 సమాజంలో ప్రముఖులు ప్రధానులు బెన్యామీను గోత్రంలో స్త్రీలు నశించి పోవడం చూసి “మిగిలిన వారికి మనం భార్యలను ఎక్కడనుండి తీసుకు రావాలి” అని మధన పడ్డారు. 17 “ఇశ్రాయేలీయుల్లోనుండి ఒక గోత్రం అంతరించి పోకుండా బెన్యామీనీయుల్లో తప్పించుకున్న వారికి వారసులు ఉండాలి” అన్నారు.
18 “ఇశ్రాయేలీయుల్లో ఎవరైనా సరే, తన కూతుర్ని బెన్యామీనీయుడికి ఇస్తే వాణ్ణి నాశనం చేయాలని శపథం చేశాం. కాబట్టి మన కూతుళ్ళను వారికిచ్చి పెళ్ళి చేయకూడదు,” అని చెప్పుకున్నారు. 19 కాబట్టి వాళ్ళు బెన్యామీనీయులతో ఇలా అన్నారు “చూడండి, బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెముకు వెళ్ళే రాజమార్గానికి తూర్పున ఉన్న లెబోనాకు దక్షిణ దిక్కున ఉన్న షిలోహు లో ప్రతి సంవత్సరం యెహోవాకు పండగ జరుగుతుంది.
20 మీరు వెళ్లి ద్రాక్షతోటల్లో చాటున దాక్కుని ఉండండి. షిలోహు నుండి స్త్రీలు నాట్యమాడటానికి బయటకు వస్తారు. 21 ద్రాక్షతోటల్లో నుండి వేగంగా బయటకు వచ్చి మీలో ప్రతి ఒక్కడూ ఒక్కో షిలోహు అమ్మాయిని పట్టుకుని భార్యగా చేసుకోడానికి మీ బెన్యామీనీయుల దేశానికి పారిపొండి.
22 ఆ తరువాత ఆ అమ్మాయిల తండ్రులు గానీ సోదరులు గానీ మా దగ్గరికి వచ్చి వాదిస్తే మేము వారితో ‘మీరు కాస్త మా పట్ల దయ చూపండి. యుద్ధం కారణంగా వాళ్ళలో ప్రతి వాడికీ పెళ్ళి చేసుకోడానికి స్త్రీలు దొరకలేదు. కాబట్టి ఆ స్త్రీలను ఉండనివ్వండి. మీ అంతట మీరే వాళ్ళను పెళ్లికివ్వలేదు కాబట్టి శపథం విషయంలో మీరు నిరపరాధులు అవుతారు’ అని చెబుతాము” అన్నారు.
23 బెన్యామీనీయులు సరిగ్గా అలాగే చేసి నాట్యమాడుతున్న స్త్రీలలో నుండి తమకు కావలసిన స్త్రీలను పట్టుకుని తమకు భార్యలుగా తీసుకు వెళ్ళారు. తమ వారసత్వ స్థలానికి వెళ్ళి అక్కడ పట్టణాలను కట్టి వాటిలో నివసించారు. 24 ఆ తరువాత ఇశ్రాయేలీయులలో ప్రతివాడూ అక్కడనుండి తమ తమ గోత్రాలుండే ప్రాంతాలకూ, తమ కుటుంబాల దగ్గరకూ వారసత్వ భూమికీ వెళ్ళి పోయారు. 25 ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు ఒక రాజు అంటూ లేడు. ప్రతి వాడూ తన ఇష్టం చొప్పున ప్రవర్తిస్తూ ఉన్నారు.