18
గేత్సెమనేలో యేసు
మత్తయి 26:36-46; మార్కు 14:32-42; లూకా 22:39-46
యేసు ఇలా మాట్లాడిన తరువాత తన శిష్యులతో కలిసి కెద్రోను లోయ దాటి, అక్కడ ఉన్న తోటలో ప్రవేశించాడు.
ద్రోహం, అరెస్టు కావడం
మత్తయి 26:47-56; మార్కు 14:43-50; లూకా 22:47-53
యేసు తన శిష్యులతో తరచు అక్కడికి వెళ్తూ ఉండేవాడు కాబట్టి, ఆయనను పట్టించబోతున్న యూదాకు కూడా ఆ ప్రదేశం తెలుసు. అతడు సైనికుల గుంపును, ముఖ్య యాజకులు, పరిసయ్యులు తనకు ఇచ్చిన దేవాలయ అధికారులను వెంట తీసుకుని, కాగడాలతో, దీపాలతో ఆయుధాలతో అక్కడికి వచ్చాడు. అప్పుడు యేసు, తనకు జరుగుతున్నవన్నీ తెలిసినవాడే కాబట్టి, ముందుకు వచ్చి వారితో, “మీరు ఎవరి కోసం చూస్తున్నారు?” అని అడిగాడు. వారు “నజరేతు వాడైన యేసు” అని జవాబిచ్చారు. యేసు వారితో, “నేనే ఆయన్ని” అన్నాడు. ద్రోహంతో యేసును పట్టించిన యూదా కూడా ఆ సైనికులతో నిలుచుని ఉన్నాడు. ఆయన వారితో, “నేనే” అని చెప్పినప్పుడు వారు వెనక్కి తూలి నేల మీద పడ్డారు.
ఆయన మళ్ళీ, “మీరు ఎవరి కోసం చూస్తున్నారు?” అని అడిగాడు. వారు మళ్ళీ, “నజరేతు వాడైన యేసు కోసం” అన్నారు. యేసు వారితో, “ఆయన్ని నేనే అని మీతో చెప్పాను. మీరు నా కోసమే చూస్తూ ఉంటే, మిగిలిన వారిని వెళ్ళిపోనివ్వండి” అన్నాడు. “నువ్వు నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ నేను పోగొట్టుకోలేదు” అనే ఆయన వాక్కు నెరవేరేలా ఆయన ఈ మాట అన్నాడు. 10 అప్పుడు సీమోను పేతురు, తన దగ్గర ఉన్న కత్తి దూసి, ప్రధాన యాజకుని సేవకుడి కుడి చెవి తెగ నరికాడు. ఆ సేవకుడి పేరు మల్కు. 11 యేసు పేతురుతో, “కత్తిని దాని ఒరలో పెట్టు, తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను తాగకుండా ఉంటానా?” అన్నాడు.
ప్రధాన యాజకుని ముందు యేసు
మత్తయి 26:57-68; మార్కు 14:53-65; లూకా 22:66-71
12 అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతీ, యూదుల అధికారులు, యేసును పట్టుకుని బంధించారు. 13 మొదట ఆయనను అన్న దగ్గరికి తీసుకువెళ్ళారు. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకునిగా ఉన్న కయపకు మామ. 14 ప్రజలందరి కోసం ఒక మనిషి చనిపోవడం అవశ్యం అని యూదులకు ఆలోచన చెప్పినవాడే ఈ కయప.
యేసు ఎవరో తెలియదని పేతురు నిరాకరణ
మత్తయి 26:69-75; మార్కు 14:66-72; లూకా 22:54-62
15 సీమోను పేతురూ, ఇంకొక శిష్యుడూ, యేసును దూరం నుంచి వెంబడించారు. ఆ శిష్యుడు ప్రధాన యాజకుడికి పరిచయం ఉన్నవాడు కాబట్టి అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోకి యేసుతో కూడా వెళ్ళాడు. 16 కాని, పేతురు గుమ్మం దగ్గర బయటే నిలబడి ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకుడికి పరిచయం ఉన్న శిష్యుడు బయటకు వచ్చి గుమ్మానికి కాపలా ఉన్న దాసీతో మాట్లాడి పేతురును లోపలికి తీసుకొచ్చాడు. 17 గుమ్మం దగ్గర కాపలా ఉన్న దాసి పేతురుతో, “నువ్వు ఆతని శిష్యుల్లో ఒకడివి కదూ?” అంది. అతడు, “కాదు” అన్నాడు. 18 చలిగా ఉన్న కారణంగా అక్కడ ఉన్న సేవకులు, అధికారులు చలి మంట వేసుకుని దాని చుట్టూ నిలుచుని చలి కాచుకొంటున్నారు. పేతురు కూడా వారితో నిలుచుని చలి కాచుకొంటున్నాడు.
19 ప్రధాన యాజకుడు ఆయన శిష్యుల గురించీ, ఆయన ఉపదేశం గురించీ యేసును అడిగాడు. 20 యేసు జవాబిస్తూ, “నేను బహిరంగంగానే ఈ లోకంతో మాట్లాడాను. నేను ఎప్పుడూ యూదులు సమావేశమయ్యే సమాజ మందిరాల్లో, దేవాలయంలో ఉపదేశం చేశాను. చాటుగా ఏమీ మాట్లాడలేదు. 21  నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు? నేనేం మాట్లాడానో, నా మాటలు విన్న వారిని అడుగు. నేను మాట్లాడిన సంగతులు ఈ ప్రజలకు తెలుసు” అన్నాడు.
22 యేసు ఇలా అన్నప్పుడు, అక్కడ నిలుచుని ఉన్న అధికారుల్లో ఒకడు, యేసును తన అరచేతితో చెంప మీద కొట్టి, “ప్రధాన యాజకుడికి నువ్వు జవాబిచ్చే విధానం ఇదేనా?” అన్నాడు. 23 యేసు అతనికి జవాబిస్తూ, “నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే, ఆ తప్పు ఏమిటో చెప్పు. కాని, నేను సరిగానే చెప్పి ఉంటే, నన్ను ఎందుకు కొడతావు?” అన్నాడు.
24 తరువాత అన్న బంధితుడైన యేసును ప్రధాన యాజకుడు కయప దగ్గరికి పంపాడు. 25 అప్పుడు సీమోను పేతురు నిలుచుని చలి కాచుకొంటూ ఉన్నాడు. అక్కడున్న వారు అతనితో, “నువ్వు కూడా అతని శిష్యుల్లో ఒకడివి కాదా?” అన్నారు. పేతురు ఒప్పుకోలేదు. “కాదు” అన్నాడు. 26 పేతురు ఎవరి చెవి నరికాడో వాడి బంధువు ప్రధాన యాజకుని సేవకుల్లో ఒకడు. వాడు పేతురుతో, “నువ్వు తోటలో ఆయనతో ఉండడం నేను చూడలేదా?” అన్నాడు. 27 పేతురు మళ్ళీ ఒప్పుకోలేదు. వెంటనే కోడి కూసింది.
పిలాతు ఎదుట యేసు
మత్తయి 27:1-4; మార్కు 15:1-5; లూకా 23:1-7, 13, 16
28 వారు యేసును కయప దగ్గరనుంచి రోమా రాజ్యాధికార భవనానికి తీసుకు వచ్చారు. అది తెల్లవారుతూ ఉన్న సమయం. పస్కా భోజనం తినడానికి ముందు మైల పడకుండా ఉండడానికి వారు ఆ రోమా రాజ్యాధికార భవనంలో ప్రవేశించలేదు. 29 కాబట్టి పిలాతు బయట ఉన్న వారి దగ్గరికి వచ్చి, “ఈ మనిషి మీద మీరు ఏ నేరం మోపుతున్నారు?” అన్నాడు.
30 వారు అతనితో, “ఇతను దుర్మార్గుడు కాకపోతే ఇతన్ని నీకు అప్పగించే వారం కాదు” అన్నారు. 31 అందుకు పిలాతు వారితో, “అతణ్ణి మీరే తీసుకుపోయి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చుకోండి” అన్నాడు. యూదులు, “ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు” అన్నారు. 32 తాను ఎలాంటి మరణం పొందుతాడో, దాని గురించి ఆయన ముందుగానే చెప్పిన మాట నెరవేరేలా వారు ఈ మాట పలికారు. 33 అప్పుడు పిలాతు మళ్ళీ రోమా రాజ్యాధికార భవనంలోకి వెళ్ళి, యేసును పిలిచి, ఆయనతో, “నువ్వు యూదులకు రాజువా?” అన్నాడు. 34 యేసు జవాబిస్తూ, “ఈ మాట నీ అంతట నువ్వే అంటున్నావా, లేక ఎవరైనా నా గురించి నీతో చెప్పారా?” అన్నాడు. 35  అందుకు పిలాతు, “నేను యూదుణ్ణి కాదు. అవునా? నీ సొంత ప్రజలు, ముఖ్య యాజకులు, నిన్ను నాకు అప్పగించారు. నువ్వేం చేశావు?” అని అడిగాడు.
36 యేసు, “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించిందే అయితే, నేను యూదుల చేతిలో పడకుండా నా సేవకులు పోరాటం చేసేవాళ్ళే. నిజానికి నా రాజ్యం ఇక్కడిది కాదు” అని జవాబిచ్చాడు. 37 అప్పుడు పిలాతు, “అయితే నువ్వు రాజువా??” అని యేసుతో అన్నాడు. యేసు, “నేను రాజునని నువ్వు అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను. అందుకే నేను ఈ లోకంలోకి వచ్చాను. సత్యానికి సంబంధించిన వారందరూ నా మాట వింటారు” అని జవాబిచ్చాడు. 38 పిలాతు ఆయనతో, “సత్యం అంటే ఏమిటి?” అన్నాడు.
యేసుకు మరణ శిక్ష, బరబ్బా విడుదల
మత్తయి 27:15-26; మార్కు 15:6-15; లూకా 23:18-25
అతడు ఇలా అన్న తరువాత మళ్ళీ బయటకు వెళ్ళి యూదులతో, “ఈ మనిషిలో నాకు ఏ అపరాధం కనిపించ లేదు, 39 పస్కా సమయంలో నేను ఒకణ్ణి విడుదల చేసే ఆనవాయితీ ఉంది కదా? కాబట్టి యూదుల రాజును మీకు విడుదల చెయ్యమంటారా?” అన్నాడు. 40 అప్పుడు వారు మళ్ళీ పెద్దగా కేకలు పెడుతూ, “ఈ మనిషిని కాదు. బరబ్బాను విడుదల చెయ్యండి!” అన్నారు. బరబ్బా బందిపోటు దొంగ.