3
ఒక మనిషి తన భార్యను విడిచిపెట్టి ఆమెను పంపి వేస్తే ఆమె అతని దగ్గర నుండి వెళ్ళి ఇంకొకడికి భార్య అయ్యింది.
అప్పుడు అతడు ఆమెను తిరిగి చేర్చుకుంటాడా? అదే జరిగితే ఆ దేశం ఎంతో అపవిత్రమవుతుంది కదా.
నువ్వు అనేకమంది విటులతో వ్యభిచారం చేశావు. అయినా నా దగ్గరికి తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు.
నీ తలెత్తి చెట్లు లేని కొండప్రదేశాలను చూడు. మనుషులు నీతో వ్యభిచారం చేయని స్థలం ఏదైనా ఉందా?
ఎడారి దారిలో సంచార జాతి వాడు కాచుకుని ఉన్నట్టు నువ్వు వారి కోసం దారి పక్కన కూర్చుని ఎదురు చూశావు.
నీ వ్యభిచారంతో, నీ దుష్ట ప్రవర్తనతో నువ్వు దేశాన్ని అపవిత్రం చేశావు.
కాబట్టి వానలు కురవడం లేదు. కడవరి వర్షం ఆగిపోయింది.
అయినా నువ్వు కులట మొహం వేసుకుని సిగ్గు పడడం లేదు.
అయినా ఇప్పుడు నువ్వు “నా తండ్రీ, చిన్నప్పటి నుండి నాకు దగ్గర స్నేహితుడివి” అని నాకు మొర పెడుతున్నావు.
“నువ్వు ఎల్లప్పుడూ కోపిస్తావా? ఇక నీ ఆగ్రహం మానవా?”
అని అంటూనే నువ్వు చేయాలనుకున్న దుష్కార్యాలు చేస్తూనే ఉన్నావు.
నమ్మకత్వం లేని ఇశ్రాయేలు
యోషీయా రాజు పాలన సమయంలో యెహోవా నాకిలా చెప్పాడు.
“ఇశ్రాయేలు ఎంత అపనమ్మకం చూపిందో చూశావా? ఆమె ఎత్తయిన ప్రతి కొండమీదికీ పచ్చని ప్రతి చెట్టు కిందికీ వెళ్ళి అక్కడ వ్యభిచారం చేస్తున్నది.
ఆమె వాటన్నిటినీ చేసినా ఆమెను నా దగ్గరికి తిరిగి రమ్మన్నాను కానీ ఆమె రాలేదు. ద్రోహి అయిన ఆమె సోదరి అయిన యూదా దాన్ని చూసింది.
ఇశ్రాయేలు వ్యభిచారం చేసినందుకే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు విడాకులిచ్చి పంపేశాను. విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా దాన్ని చూసి ఆమె కూడా భయం లేకుండా వ్యభిచారం చేస్తూ ఉంది.
రాళ్ళతో, మొద్దులతో విగ్రహాలను చేసుకుని, ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్రపరచింది.
10 ఇంత జరిగినా విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా పైపైనే గాని తన పూర్ణహృదయంతో నా దగ్గరికి రావడం లేదు.
11 కాబట్టి యూదా చేసిన ద్రోహం చూస్తే దానికంటే ఇశ్రాయేలే కొంచెం మంచిది అనిపిస్తున్నది. 12 నువ్వు వెళ్లి ఉత్తరం వైపుకు ఇలా ప్రకటించు, విశ్వాసం లేని ఇశ్రాయేలూ, తిరిగి రా. మీ మీద నేను కోపపడను. నేను దయగలవాణ్ణి కాబట్టి శాశ్వతంగా కోపించేవాణ్ణి కాను.” ఇదే యెహోవా వాక్కు.
13 నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ, నా మాట తోసిపుచ్చి ప్రతి పచ్చని చెట్టు కిందా అన్యులతో* వ్యభిచరించావు.
నువ్వు నీ దోషాన్ని ఒప్పుకోవాలి. ఇదే యెహోవా వాక్కు.
14 చెడిపోయిన పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానిని. ఇదే యెహోవా వాక్కు
ఒక్కొక్క ఊరిలోనుండి ఒకణ్ణి, ఒక్కొక్క వంశం లోనుండి ఇద్దరినీ, సీయోనుకు తీసుకొస్తాను.
15 నాకిష్టమైన కాపరులను మీపైన నియమిస్తాను, వారు జ్ఞానంతో, వివేకంతో మిమ్మల్ని పాలిస్తారు.
16 ఆ రోజుల్లో మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరిస్తూ ఉన్నప్పుడు ప్రజలు యెహోవా నిబంధన మందసం గురించి మాట్లాడరు. అది వారి మనస్సుకు తట్టదు. దాన్ని జ్ఞాపకం చేసుకోరు. అది లేనందుకు బాధపడరు, ఇక ముందు దాన్ని తయారు చేయరు. ఇదే యెహోవా వాక్కు. 17 ఆ కాలంలో యెరూషలేమును యెహోవా సింహాసనం అంటారు. అన్యజాతులు వారి చెడ్డ హృదయాలను అనుసరించి మూర్ఖులుగా నడుచుకోక ఘనమైన యెహోవా పేరు విని యెరూషలేముకు గుంపులుగా వస్తారు. 18 ఆ రోజుల్లో యూదా వారూ ఇశ్రాయేలు వారూ కలిసి ఉత్తరదేశం నుండి నేను మీ పూర్వీకులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి తిరిగి వస్తారు.
19 నిన్ను నా కొడుకుగా చేసుకుని, ఏ జనానికీ లేనంత సుందరమైన దేశాన్ని నీకు వారసత్వంగా ఇవ్వాలని కోరుకున్నాను.
నువ్వు నా తండ్రీ అని పిలుస్తూ నా వెంట రావాలని కోరుకున్నాను.
20 అయినా స్త్రీ తన భర్త పట్ల అపనమ్మకం చూపినట్టు ఇశ్రాయేలు ప్రజలారా,
నిజంగా మీరు నాపట్ల అపనమ్మకస్తులయ్యారు. ఇదే యెహోవా వాక్కు.
21 వినండి, చెట్లు లేని ఉన్నత స్థలాల్లో ఒక స్వరం వినబడుతున్నది.
వినండి, దుర్మార్గులైన ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవాను మరచిపోయినందుకు రోదనలు, విజ్ఞాపనలు చేస్తున్నారు.
22 ద్రోహులైన ప్రజలారా, తిరిగి రండి. మీ అవిశ్వాసాన్ని నేను బాగుచేస్తాను.
“మా దేవుడు యెహోవా నీవే, నీ దగ్గరకే మేం వస్తున్నాం” అనే ఈ మాటలన్నీ అబద్ధాలు.
23 నిజంగా కొండల మీద జరిగేదంతా మోసం. పర్వతాల మీద చేసిన తంతులన్నీ నిష్‌ప్రయోజనం.
నిజంగా మా దేవుడైన యెహోవా వలన మాత్రమే ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది.
24 మా బాల్యంనుండి మా పూర్వీకుల కష్టార్జితాన్నంతా అసహ్యమైన విగ్రహాలు మింగివేశాయి.
వారి గొర్రెల్నీ పశువులను, కొడుకులను, కూతుళ్ళను మింగేస్తూ ఉన్నాయి.
25 మన దేవుడైన యెహోవా మాట వినకుండా మనమూ మన పూర్వికులూ బాల్యం నుండి ఈ రోజు వరకూ ఆయనకు విరోధంగా పాపం చేశాం.
కాబట్టి రండి, సిగ్గుతో సాష్టాంగపడదాం. మనం కనబడకుండా మన అవమానం మనలను కప్పివేస్తుంది గాక.
* 3:13 3:13 అన్యులతో అన్య దేవతలతో