7
యూదా విగ్రహరాధన, అక్రమ జీవితం
1 యెహోవా దగ్గర నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు
2 “నువ్వు యెహోవా మందిర ద్వారంలో నిలబడి ఈ మాట ప్రకటించు. యెహోవాను పూజించడానికి ఈ ద్వారాల గుండా వచ్చే యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి.
3 సైన్యాల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, మీరు ఈ స్థలంలో నివసించడానికి నేను అనుమతించాలంటే మీ మార్గాలు, క్రియలు సరి చేసుకోండి.
4 ఇది యెహోవా ఆలయం! యెహోవా ఆలయం! యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనే మోసకరమైన మాటల వలలో పడకండి.”
5 మీ మార్గాలు, క్రియలు మీరు యథార్థంగా సరిచేసుకుని ప్రతివాడూ తన పొరుగువాడి పట్ల న్యాయం జరిగించాలి.
6 పరదేశుల్నీ తండ్రి లేని వారినీ వితంతువులనూ బాధించకూడదు. ఈ స్థలంలో నిర్దోషి రక్తం చిందించకూడదు. మీకు హాని చేసే అన్య దేవతలను పూజించకూడదు.
7 అలా అయితే మీరు శాశ్వతంగా నివసించడానికి పూర్వమే నేను మీ పూర్వికులకు ఇచ్చిన ఈ దేశంలో మిమ్మల్ని ఉండనిస్తాను.
8 అయితే మీరు ప్రయోజనం లేని మోసపు మాటలు నమ్ముతున్నారు.
9 మీరు వ్యభిచారం, దొంగతనం, నరహత్యలు,
10 అబద్ధ ప్రమాణాలు చేస్తూ, బయలు దేవుడికి ధూపం వేస్తూ మీకు తెలియని దేవుళ్ళను అనుసరిస్తున్నారు. అదే సమయంలో నా పేరు పెట్టిన ఈ మందిరంలోకి వచ్చి నా సన్నిధిలో నిలబడి “మేం తప్పించుకున్నాం” అంటున్నారు. మీరు విడుదల పొందింది ఈ అసహ్యమైన పనులు చేయడానికేనా?
11 నా పేరు పెట్టిన ఈ మందిరం మీ కంటికి దొంగల గుహలాగా ఉందా? దీన్నంతా నేను చూస్తూనే ఉన్నానని తెలుసుకోండి. ఇదే యెహోవా వాక్కు.
12 గతంలో నేను నా సన్నిధిని ఉంచిన షిలోహుకు వెళ్లి పరిశీలించండి. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల ద్రోహాన్ని బట్టి నేను దానికి ఏం చేశానో చూడండి.
13 నేను మీతో పదే పదే మాట్లాడినా మీరు వినలేదు. మిమ్మల్ని పిలిచినా మీరు జవాబు చెప్పకుండా మీరు ఈ పనులన్నీ చేశారు.
14 కాబట్టి నేను షిలోహుకు చేసినట్టే నా పేరు పెట్టిన ఈ మందిరానికీ, మీకూ మీ పూర్వికులకూ నేనిచ్చిన ఈ స్థలానికీ చేస్తాను.
15 మీ సోదరులైన ఎఫ్రాయిము సంతానాన్ని నేను వెళ్లగొట్టినట్టు మిమ్మల్ని కూడా నా సన్నిధి నుండి వెళ్లగొడతాను.
16 కాబట్టి యిర్మీయా, నువ్వు ఈ ప్రజల కోసం ప్రార్థన చేయవద్దు. వారి పక్షంగా మొర్రపెట్టడం, విజ్ఞాపన చేయడం చేయవద్దు. నన్ను బతిమాలవద్దు. ఎందుకంటే నేను నీ మాట వినను.
17 యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో వారు చేస్తున్న పనులు నువ్వు చూస్తున్నావు కదా.
18 నాకు కోపం పుట్టించడానికి ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయాలనీ, అన్య దేవుళ్ళకు పానార్పణలు పోయాలనీ పిల్లలు కట్టెలు ఏరుతున్నారు, తండ్రులు అగ్ని రగులబెడుతున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు.
19 నన్ను రెచ్చగొట్టడానికే అలా చేస్తున్నారా? అది వారు తమకు తాము అవమానం తెచ్చుకున్నట్టు కాదా?
20 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం మీదా, ఈ మనుషుల మీదా, జంతువుల మీదా, పొలాలమీదా, చెట్ల మీదా, పంటల మీదా నా కోపాన్ని, నా ఉగ్రతను కుమ్మరిస్తాను. అది ఎన్నటికీ ఆరదు, మండుతూనే ఉంటుంది.
21 సేనల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, మీ దహన బలులూ ఇతర బలులూ కలిపి వాటి మాంసం అంతా మీరే తినండి.
22 నేను ఐగుప్తు దేశం నుండి మీ పూర్వికులను రప్పించిన రోజున వారి నుండి ఏమీ కోరలేదు. దహన బలుల గురించీ ఇంకా ఇతర బలుల గురించీ నేను వారికి ఆజ్ఞాపించలేదు.
23 ఒక్క ఆజ్ఞ మాత్రం ఇచ్చాను. అదేమంటే, “మీరు నా మాటలు అంగీకరిస్తే నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. నేను మీకాజ్ఞాపించిన మార్గాల్లో నడుచుకోండి. అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది.”
24 అయితే వారు వినలేదు, అస్సలు వినలేదు. తమ దుష్టహృదయంలో నుండి వచ్చిన ఆలోచనల ప్రకారం జీవించారు. కాబట్టి వారు ముందుకు సాగలేక వెనకబడిపోయారు.
25 మీ పూర్వికులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకూ నేను ఎడతెగక నా సేవకులైన ప్రవక్తలను మీ దగ్గరికి పంపుతూ వచ్చాను.
26 అయినా వారు నా మాట వినలేదు, పెడచెవిని పెట్టారు. తలబిరుసు తనంతో తమ మనస్సు కఠినం చేసుకున్నారు. వారు తమ పూర్వీకుల కంటే మరీ దుర్మార్గులయ్యారు.
27 నువ్వు ఈ మాటలన్నీ వారితో చెప్పినా వారు నీ మాట వినరు. నువ్వు పిలిచినా వారు బదులు చెప్పరు.
28 కాబట్టి నువ్వు వారితో ఇలా చెప్పు. “ఈ దేశం తమ దేవుడైన యెహోవా మాట వినలేదు. క్రమశిక్షణకు లోబడలేదు. కాబట్టి సత్యం వారిలో నుండి తొలగిపోయింది. అది వారి నోటినుండి కొట్టి వేయబడింది.
29 తనకు కోపం తెప్పించిన తరం ప్రజలను యెహోవా విసర్జించి వెళ్లగొట్టాడు.
నీ తలవెండ్రుకలు కత్తిరించుకో. వాటిని పారవెయ్యి. చెట్లు లేని ఉన్నత స్థలాల్లో రోదన చెయ్యి.
వధ లోయ
30 యెహోవా చెప్పేదేమంటే, యూదా ప్రజలు నా దృష్టికి దుష్టత్వం జరిగిస్తున్నారు,
నా పేరు పెట్టిన మందిరం అపవిత్రమయ్యేలా వారు దానిలో అసహ్యమైన వస్తువులు ఉంచారు.
31 నేనాజ్ఞాపించని దాన్ని, నా ఆలోచనలో లేని దాన్ని వారు చేశారు. అగ్నిలో తమ కొడుకులనూ, కూతుళ్ళనూ కాల్చడానికి బెన్ హిన్నోము లోయలోని తోఫెతులో బలిపీఠాలు కట్టారు.
32 యెహోవా చెప్పేదేమంటే, ఒక రోజు రాబోతున్నది. అప్పుడు దాన్ని తోఫెతు అని గానీ, బెన్ హిన్నోము లోయ అని గానీ పిలవరు, దాన్ని ‘వధ లోయ’ అని పిలుస్తారు. ఎందుకంటే, పాతిపెట్టడానికి స్థలం లేకపోయేటంత వరకూ తోఫెతులో శవాలు పాతిపెడతారు.
33 అప్పుడు ఈ ప్రజల శవాలు ఆకాశ పక్షులకూ భూజంతువులకూ ఆహారంగా మారతాయి. వాటిని తోలివేయడానికి ఎవరూ ఉండరు.
34 ఈ దేశం తప్పకుండా పాడైపోతుంది. యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో ఆనంద ధ్వనులు, కేరింతలు, పెళ్ళికొడుకు, పెళ్ళికూతుళ్ళ స్వరాలు వినబడకుండా చేస్తాను.”