9
1 నా తల జలమయంగా నా కళ్ళు కన్నీటి ఊటగా ఉండు గాక.
ఎందుకంటే హతమైన నా ప్రజలను గూర్చి నేను రాత్రింబగళ్ళూ విలపించాలని కోరుతున్నాను.
2 నా ప్రజలంతా వ్యభిచారులు, ద్రోహుల గుంపులాగా ఉన్నారు.
నేను వారిని విడిచిపెట్టి వెళ్లి ఉండడానికి అరణ్యంలో ఒక బాటసారుల నివాసం నాకు దొరికితే బాగుండును.
3 విల్లును వంచినట్టుగా వారు తమ నాలుకను అబద్ధమాడడానికి వంచుతారు. ఈ భూమిపై వారు నమ్మదగిన వారు కాదు. వారు ఒకటి తరవాత మరొకటి చెడుకార్యాలు జరిగిస్తున్నారు. “నేను ఎవరో వారు ఎరుగరు” అని యెహోవా చెబుతున్నాడు.
4 మీలో ప్రతివాడూ తన పొరుగువాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఏ సోదరుణ్నీ నమ్మవద్దు. ఎందుకంటే నిజంగా ప్రతి సోదరుడూ మోసం చేసేవాడే.
ప్రతి పొరుగువాడూ అపనిందలు వేస్తూ తిరుగుతుంటాడు.
5 ప్రతివాడూ సత్యం చెప్పకుండా తన పొరుగువాడిని మోసం చేస్తాడు. అక్రమం జరిగించడం వారికి అలవాటై పోయింది. ఎంతసేపూ ఎదుటి వారిలో తప్పులు పట్టాలని చూస్తారు.
6 కపటం మధ్యలో నువ్వు నివసిస్తున్నావు. వారి కపటంలో వారు నన్ను తెలుసుకోలేక పోతున్నారు. ఇదే యెహోవా వాక్కు.
7 కాబట్టి సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే, చూడూ, నేను వారిని లోహం లాగా కరిగించి పరీక్షించబోతున్నాను. వారికి ఇంతకంటే మరేమి చెయ్యను?
8 వారి నాలుక పదును పెట్టిన బాణం, అది కపటమే పలుకుతుంది.
ఒకడు తన పొరుగువారితో పైకి స్నేహపూర్వకంగా మాట్లాడతాడు గాని మనస్సులో మాత్రం మోసపూరితమైన ఆలోచనలు ఉంటాయి.
9 ఈ సంగతులు తెలిసీ నేను వారిని శిక్షించకూడదా?
ఈ దేశాన్ని దండించ కూడదా? ఇదే యెహోవా వాక్కు.
10 పర్వతాల గురించి ఏడుస్తాను, విలాప గీతం ఆలపిస్తాను. వాటి మేతస్థలాల గురించి రోదిస్తాను.
ఎందుకంటే అవి పాడైపోయాయి. వాటిగుండా ఎవరూ వెళ్ళడం లేదు. వాటిలో పశువుల అరుపులు వినబడడం లేదు.
ఆకాశ పక్షులు, జంతువులు అన్నీ పారిపోయాయి.
11 యెరూషలేమును పాడుదిబ్బగా నక్కల నివాసంగా చేస్తాను.
యూదా పట్టణాలను ఎవరూ నివసించలేకుండా పాడు చేస్తాను.
12 ఈ సంగతిని అర్థం చేసుకోగల జ్ఞానం ఎవరికుంది? దాన్ని వివరించడానికి యెహోవా ఎవరికి తన నోటి మాట ఇచ్చాడు?
ఎవరూ ప్రయాణం చేయలేకుండా ఆ దేశం ఎందుకు ఎడారిలా మారిపోయింది?
13 యెహోవా చెప్పేదేమంటే, “దానికి కారణం, వారు నా మాట వినలేదు, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా తోసిపుచ్చారు.
14 తమ హృదయంలోని మూర్ఖత్వం ప్రకారం చేశారు. తమ పూర్వికుల దగ్గర నేర్చుకున్నట్టు బయలు దేవుళ్ళను పూజించారు. అందుకే వారి దేశం పాడైపోయింది.”
15 సైన్యాల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, “నేను ఈ ప్రజలు చేదుకూరలు తినేలా చేస్తాను. విషజలం తాగిస్తాను.
16 వారు గానీ, వారి పూర్వికులు గానీ ఎరగని జాతి ప్రజల్లోకి వారిని చెదరగొడతాను. వారు పూర్తిగా నాశనం అయ్యేవరకూ వారి పైకి ఖడ్గం పంపుతాను.”
17 సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “ఆలోచించండి. రోదనం చేసే స్త్రీలను వెతికి వారిని పిలిపించండి.
విలాపంలో నైపుణ్యం గల స్త్రీలను వెదికి వారిని పిలవండి.
18 మనం కన్నీళ్లు విడిచేలా, మన కనురెప్పల నుండి నీళ్లు కారిపోయేలా వారు త్వరగా వచ్చి రోదన ధ్వని చేయమని చెప్పండి.”
19 “మనం నాశనమయ్యాం, చాలా అవమానానికి గురయ్యాం. వారు మన ఇళ్ళను కూలదోశారు.
మనం దేశం విడిచి వెళ్ళాల్సివచ్చింది” అని సీయోనులో రోదన ధ్వని వినబడుతున్నది.
20 స్త్రీలారా, యెహోవా మాట వినండి. ఆయన నోటి నుండి వచ్చే సందేశాలను జాగ్రత్తగా ఆలకించండి.
మీ కూతుళ్ళకు విలాప గీతం నేర్పండి. ఒకరికొకరు అంగలార్పు గీతాలు నేర్పండి.
21 మరణం మన ఇంటి కిటికీల గుండా ఎక్కుతూ ఉంది. మన రాజభవనాల్లో అడుగు పెడుతూ ఉంది.
అది వీధుల్లో పసిపిల్లలు, రాజమార్గాల్లో యువకులు లేకుండా వారిని నాశనం చేస్తున్నది.
22 యెహోవా చెప్పేదేమంటే “పొలాల్లో పేడ పడేలా, కోతపనివారి వెనక పనలు పడేలా మనుషుల శవాలు కూలుతాయి.
వాటిని పోగు చేయడానికి ఎవరూ ఉండరు.”
23 యెహోవా చెప్పేదేమంటే “తెలివైనవాడు తన తెలివిని బట్టీ బలవంతుడు తన బలాన్ని బట్టీ గర్వించకూడదు. అలాగే ధనవంతుడు తన ఆస్తిని బట్టి గర్వించకూడదు.
24 దేనిలో అతిశయించాలంటే, ఈ భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడంలోనే అతిశయించాలి.
అలాటి వాటిలోనే నేను ఆనందిస్తాను.”
25 యెహోవా చెప్పేదేమంటే “అన్యజాతి ప్రజలు సున్నతి పొందలేదు. ఇశ్రాయేలీయులేమో హృదయ సంబంధమైన సున్నతి పొందలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో సున్నతి పొందని వారినీ, పొందిన వారినీ కలిపి శిక్షిస్తాను.
26 అంటే ఐగుప్తు వారు, యూదులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఎడారిలో నివసిస్తూ తమ గడ్డాలు చెంపలపై గొరిగించుకునేవారు, వీరందరినీ నేను శిక్షిస్తాను.”