24
షెకెంలో ఒడంబడికను తిరిగి స్థాపించడం
యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటినీ షెకెంలో పోగుచేసి, వారి పెద్దలనూ అధికారులనూ న్యాయాధిపతులనూ నాయకులనూ పిలిపించినపుడు వారు దేవుని సన్నిధిలో హాజరయ్యారు. యెహోషువ ప్రజలందరితో ఇలా అన్నాడు “ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు, మునుపు మీ పూర్వీకులు, అబ్రాహాము నాహోరుల తండ్రి తెరహు, యూఫ్రటీసు నది అవతల నివసించి, ఇతర దేవుళ్ళను పూజించేవారు.
అయితే నేను నది అవతల నుండి మీ పూర్వీకుడు అబ్రాహామును కనాను దేశానికి తీసుకొచ్చి, ఇస్సాకు ద్వారా అతని సంతానాన్ని విస్తరింపజేశాను. ఇస్సాకుకు నేను యాకోబునూ ఏశావునూ ఇచ్చాను. శేయీరు కొండప్రాంతాలను స్వాధీనపరచుకొనేలా ఏశావుకిచ్చాను. అయితే యాకోబు అతని కుమారులు దిగువనున్న ఐగుప్తుకు వెళ్ళారు.
తరువాత నేను మోషే అహరోనులను పంపి, ఐగుప్తీయులను తెగుళ్ళతో బాధపెట్టి మిమ్మల్ని వెలుపలికి రప్పించాను. నేను ఐగుప్తులోనుండి మీ పూర్వీకులను రప్పించినప్పుడు మీరు సముద్రం దగ్గరికి వచ్చారు. ఐగుప్తీయులు రథాలతో రౌతులతో వారిని ఎర్రసముద్రం వరకూ తరిమారు.
మీ పూర్వీకులు యెహోవాకు మొర్రపెడితే ఆయన మీకూ ఐగుప్తీయులకూ మధ్య చీకటి కలిగించాడు. సముద్రం వారి మీద పడి వారిని ముంచి వేసేలా చేశాడు. ఐగుప్తు దేశంలో నేను చేసిన దాన్ని మీరు కళ్ళారా చూశారు. తరువాత మీరు చాలా కాలం ఎడారిలో నివసించారు.
యొర్దాను అవతల ఉండే అమోరీయుల దేశానికి నేను మిమ్మల్ని తీసుకువచ్చాను. వారు మీతో యుద్ధం చేశారు గానీ నేను వారిని మీ చేతికి అప్పగించాను. మీరు వారి దేశాన్ని స్వాధీనపరచుకున్నారు. వారిని మీ ముందే నాశనం చేశాను.
తరువాత సిప్పోరు కొడుకూ మోయాబు రాజు బాలాకూ బయలుదేరి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు. మిమ్మల్ని శపించడానికి బెయోరు కుమారుడు బిలామును పిలిపిస్తే 10 నేను బిలాము మాట వినలేదు. అయితే అతడు మిమ్మల్ని దీవించాడు. అతని చేతినుండి నేనే మిమ్మల్ని విడిపించాను. 11 మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరికి వచ్చారు. అమోరీయులూ పెరిజ్జీయులూ కనానీయులూ హీత్తీయులూ గిర్గాషీయులూ హివ్వీయులూ యెబూసీయులతో కలిసి యెరికో అధికారులు మీతో యుద్ధం చేస్తే నేను వారిని మీ చేతికప్పగించాను.
12 నేను మీకు ముందుగా కందిరీగలను* పంపాను. నీ కత్తి వల్ల నీ విల్లు వల్ల కాదు గాని అవే అమోరీయుల రాజుల నిద్దరిని తోలివేశాయి. 13 మీరు సేద్యం చేయని దేశాన్నీ మీరు కట్టని పట్టణాలనూ మీకిచ్చాను. మీరు వాటిలో నివసిస్తున్నారు. మీరు నాటని ద్రాక్షతోటల పండ్లనూ ఒలీవ తోటల పండ్లనూ తింటున్నారు.
14 కాబట్టి మీరు యెహోవా పట్ల భయభక్తులు కలిగి, ఆయన్ని నిష్కపటంగా నమ్మకంగా సేవించండి. యూఫ్రటీసు నది అవతల ఐగుప్తులో మీ పూర్వీకులు పూజించిన దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవానే సేవించండి. 15 యెహోవాను సేవించడం మీ దృష్టికి చెడుగా ఉంటే మీరు ఎవర్ని సేవిస్తారో, నది అవతల మీ పూర్వీకులు సేవించిన దేవుళ్ళను సేవిస్తారో, మీరు నివసిస్తున్నఅమోరీయుల ఈ దేశంలోని దేవుళ్ళను సేవిస్తారో ఈ రోజే కోరుకోండి. నేనూ నా ఇంటివాళ్ళూ యెహోవానే సేవిస్తాం” అన్నాడు.
16 అందుకు ప్రజలు ఇలా జవాబిచ్చారు. “యెహోవాను విసర్జించి ఇతర దేవుళ్ళను ఎన్నడూ సేవించం. 17 ఐగుప్తుదేశం నుండి, బానిసత్వపు ఇంట్లో నుండి మమ్మల్ని, మా పూర్వీకులను రప్పించి, మా కళ్ళముందు ఆ గొప్ప సూచక క్రియలను చేసి, మేము చేసిన ప్రయాణమంతా, మేము వచ్చిన ప్రాంతాల ప్రజలందరి మధ్య మమ్మల్ని కాపాడిన యెహోవాయే మా దేవుడు. 18 యెహోవా యీ దేశంలో నివసించిన అమోరీయులూ మిగతా ప్రజలందరినీ మా దగ్గరనుండి వెళ్ళగొట్టాడు. ఆయనే మా దేవుడు కాబట్టి మేము కూడా యెహోవానే సేవిస్తాం.”
19 అయితే యెహోషువ ప్రజలతో ఇలా చెప్పాడు. “యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషం గల దేవుడు, ఆయన మీ అపరాధాలనూ మీ పాపాలనూ క్షమించడు. మీరాయన్ని సేవించలేరు. 20 మీరు యెహోవాను విసర్జించి అన్యదేవుళ్ళను సేవిస్తే ఆయన తన మనస్సు తిప్పుకుని మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన మీకు మేలు చేసిన తరువాత మిమ్మల్ని నాశనం చేస్తాడు.”
21 అప్పుడు ప్రజలు “అలా కాదు, మేము యెహోవానే సేవిస్తాం” అని యెహోషువతో అన్నారు. 22 అప్పుడు యెహోషువ “మీరు యెహోవానే సేవిస్తామని ఆయన్ని కోరుకున్నందుకు మీ గురించి మీరే సాక్షులు” అన్నాడు. వారు “మేమే సాక్షులం” అన్నారు. 23 అందుకతడు “అలాగైతే మీ మధ్య ఉన్న అన్యదేవుళ్ళను పారవేయండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు మీ హృదయాలను తిప్పుకోండి” అన్నాడు.
24 ప్రజలు “మన దేవుడైన యెహోవానే సేవిస్తాం, ఆయన మాటే వింటాం” అని యెహోషువతో చెప్పారు. 25 యెహోషువ ఆ రోజు ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెంలో కట్టడలనూ విధులనూ నియమించాడు. 26 దేవుని ధర్మశాస్త్రగ్రంథంలో ఈ మాటలు రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోషువ పరిశుద్ధస్థలం లో ఉన్న సింధూర వృక్షం కింద దాన్ని నిలబెట్టాడు.
27 యెహోషువ ప్రజలందరితో “గమనించండి, యెహోషువ మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాయి విన్నది. కాబట్టి అది మనమీద సాక్షిగా ఉంటుంది. మీరు మీ దేవుని విసర్జిస్తే అది మీ మీద సాక్షిగా ఉంటుంది” అన్నాడు. 28 అప్పుడు యెహోషువ ప్రజలను ఎవరి స్వాస్థ్యానికి వారిని పంపివేశాడు.
యెహోషువ మరణం
29 ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడు, యెహోవా సేవకుడు అయిన యెహోషువ 110 సంవత్సరాల వయసులో చనిపోయాడు. 30 అతడు స్వాస్థ్యంగా పొందిన ప్రాంతపు భూమి, తిమ్నత్సెరహులో వారతన్ని పాతిపెట్టారు. అది ఎఫ్రాయిమీయుల కొండప్రాంతంలోని గాయషు కొండకు ఉత్తరంగా ఉంది.
31 యెహోషువ బతికిన కాలమంతా, యెహోషువ తరువాత యింకా బతికి యెహోవా ఇశ్రాయేలీయుల కోసం చేసిన పనులన్నీ ఎరిగిన పెద్దల కాలమంతా ఇశ్రాయేలీయులు యెహోవాను సేవిస్తూ వచ్చారు.
32 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెంలో, అంటే యాకోబు వంద వెండి నాణేలిచ్చి షెకెం తండ్రి హమోరు కుమారుల దగ్గర కొన్న భూభాగంలో పాతిపెట్టారు. అది యోసేపు సంతానానికి స్వాస్థ్యం అయింది.
33 అహరోను కుమారుడు ఎలియాజరు చనిపోయినప్పుడు ఎఫ్రాయీమీయుల కొండప్రాంతంలో అతని కుమారుడు ఫీనెహాసుకు ఇచ్చిన గిబియాలో వారతన్ని పాతిపెట్టారు.
* 24:12 24:12 కందిరీగలను బెదరు, నిర్గ 23:28 చూడండి