20
సమరయపై బెన్హదదు దాడి చేశాడు
1 సిరియా రాజు బెన్హదదు తన సైన్యాన్నంతా సిద్ధం చేశాడు. అతనితో ఉన్న ముప్ఫై ఇద్దరు రాజులతో గుర్రాలతో రథాలతో బయలుదేరి సమరయను ముట్టడించి దాని మీద యుద్ధం చేశాడు.
2 అతడు పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు రాజు అహాబు దగ్గరికి వార్తాహరులను పంపి,
3 “నీ వెండి, నీ బంగారం నావే. నీ భార్యల్లో నీ పిల్లల్లో అందమైన వాళ్ళు ఇప్పుడు నా వాళ్ళే అని బెన్హదదు తెలియచేస్తున్నాడు” అని వారికి సందేశం పంపించాడు.
4 అందుకు ఇశ్రాయేలు రాజు “నా ప్రభూ, నా రాజా, నీవు చెప్పినట్టే నేనూ నాకున్నదంతా నీ ఆధీనంలో ఉన్నాం” అని చెప్పి వారిని పంపించాడు.
5 ఆ వార్తాహరులు వెళ్లి ఆ మాట తెలియచేసి తిరిగి వచ్చి, బెన్హదదు ఇలా అంటున్నాడని చెప్పారు. “నీవు నీ వెండినీ నీ బంగారాన్నీ నీ భార్యలనూ నీ పిల్లలనూ నాకు అప్పగించాలని నేను నా సేవకులను నీ దగ్గరికి పంపాను.
6 రేపు ఈ పాటికి వారు నీ ఇంటినీ నీ సేవకుల ఇళ్లనూ వెతికి వారి కళ్ళకు ఏది ఇష్టమో దాన్ని తీసుకుపోతారు.”
7 అప్పుడు ఇశ్రాయేలు రాజు జాతి పెద్దలందర్నీ పిలిపించి “బెన్హదదు, నీ భార్యలనూ పిల్లలనూ వెండి బంగారాలనూ తీసుకుపోతానని కబురు పంపితే, నేను ఇవ్వనని చెప్పలేదు. అతడు చేయబోయే మోసం ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి” అన్నాడు.
8 “నీవతని మాట వినొద్దు, దానికి ఒప్పుకోవద్దు” అని ఆ పెద్దలూ ప్రజలంతా అతనితో చెప్పారు.
9 కాబట్టి అహాబు అ వార్తాహరులతో “మీరు రాజైన నా యజమానితో ఇలాచెప్పండి. ‘నీవు మొదట నీ సేవకుడినైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక పాటిస్తాను గాని, ఇప్పుడు చెప్పిన దాన్ని మాత్రం చేయలేను’ ” అన్నాడు. ఆ వార్తాహరులు బెన్హదదు దగ్గరికి వెళ్లి ఆ జవాబు తెలియచేశారు.
10 బెన్హదదు మళ్ళీ అతని దగ్గరికి వార్తాహరులను పంపి “నాతో కూడా వచ్చిన వారంతా చేతినిండా తీసుకుపోడానికి సమరయ బూడిద చాలదు. అలా జరక్కపోతే దేవుళ్ళు నాకు గొప్ప కీడు చేస్తారు గాక” అని చెప్పి పంపాడు.
11 అందుకు ఇశ్రాయేలు రాజు “తన యుద్ధ కవచాన్ని ధరించకుండానే దాన్ని విప్పి, తీసేసిన వాడిలాగా అతిశయపడకూడదని బెన్హదదుతో చెప్పండి” అన్నాడు.
12 తమ గుడారాల్లో బెన్హదదు, అతని తోటి రాజులు తాగుతూ ఉన్నప్పుడు ఈ కబురు విన్నారు. కాబట్టి అతడు తన సేవకులను పిలిపించి “యుద్ధానికి సిద్ధంగా ఉండండి” అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు పట్టణం మీద యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు.
అహాబు బెన్హదదును ఓడించడం
13 అప్పుడు ఒక ప్రవక్త ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరికి వచ్చి “యెహోవా చెప్పేదేమిటంటే, ఈ గొప్ప సైన్యాన్ని చూశావా? ఈ రోజే దాన్ని నీ చేతిలో పెడతాను. అప్పుడు నేను యెహోవానని నీవు తెలుసుకుంటావు” అన్నాడు.
14 “ఇది ఎవరివల్ల అవుతుంది?” అని అహాబు అడిగాడు. అందుకు ప్రవక్త “రాజ్యాధిపతుల్లో ఉన్న యువకుల వలన అవుతుందని యెహోవా చెబుతున్నాడు” అన్నాడు. “యుద్ధాన్ని ఎవరు మొదలెట్టాలి?” అని రాజు అడిగాడు. అతడు “నువ్వే” అని జవాబిచ్చాడు.
15 అప్పుడు అహాబు రాజ్యాధిపతుల్లో ఉన్న యువకుల లెక్క చూశాడు. వారు 232 మంది ఉన్నారు. తరువాత సైనికులను, అంటే ఇశ్రాయేలు సైన్యాన్నంతా లెక్కిస్తే ఏడు వేలమంది అయ్యారు.
16 వాళ్ళు మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళారు. బెన్హదదు, ఆ 32 మంది తోటిరాజులూ గుడారాల్లో తాగి మత్తుగా ఉన్నారు.
17 రాజ్యాధిపతుల్లో ఉన్న యువకులు మొదటగా బయలుదేరారు. విషయం తెలుసుకుందామని బెన్హదదు కొంతమందిని పంపించాడు. సమరయ నుంచి కొంతమంది వచ్చారని అతనికి తెలిసింది.
18 బెన్హదదు “వారు శాంతంగా వచ్చినా యుద్ధం చేయడానికి వచ్చినా వారిని ప్రాణాలతో పట్టుకు రండి” అని ఆజ్ఞాపించాడు.
19 రాజ్యాధికారుల్లో ఉన్న యువకులు, వారితో కూడ ఉన్న సైన్యం, పట్టణంలో నుంచి బయలు దేరారు.
20 వారిలో ప్రతివాడూ తనకెదురు వచ్చిన శత్రువుని చంపేశాడు. కాబట్టి సిరియా వారు పారిపోయారు. ఇశ్రాయేలీయులు వారిని తరిమారు. సిరియా రాజు బెన్హదదు గుర్రమెక్కి కొంతమంది రౌతులతోపాటు తప్పించుకుపోయాడు.
21 అప్పుడు ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రాలనూ రథాలనూ పట్టుకుని చాలామంది సిరియా వారిని చంపేశాడు.
22 అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి “నీవు ధైర్యం తెచ్చుకో. నీవు చేయాల్సిందేదో కనిపెట్టి చూడు. ఎందుకంటే వచ్చే సంవత్సరం సిరియారాజు నీ మీదికి మళ్ళీ వస్తాడు” అని అతనితో చెప్పాడు.
23 అయితే సిరియా రాజు బెన్హదదు సేవకులు అతనితో ఇలా అన్నారు. “వాళ్ళ దేవుడు కొండల దేవుడు. అందుకే వాళ్ళు మన కంటే బలంగా ఉన్నారు. అయితే మనం మైదానంలో వాళ్ళతో యుద్ధం చేస్తే తప్పకుండా గెలుస్తాం.
24 ఇంకా నువ్విలా చెయ్యి. ఈ రాజులందరినీ తీసేసి, వారికి బదులు సైన్యాధిపతులను నియమించు.
25 నీవు పోగొట్టుకున్న సైన్యమంత మరో సైన్యాన్నీ గుర్రానికి గుర్రాన్నీ రథానికి రథాన్నీ సిద్ధం చెయ్యి. అప్పుడు మనం మైదానంలో వారితో యుద్ధం చేసి, తప్పకుండా గెలుస్తాం.” అతడు వారి సలహా విని, వాళ్ళు చెప్పినట్టు చేశాడు.
26 కొత్త సంవత్సరం మొదట్లో, బెన్హదదు సిరియనులను సిద్ధం చేసి లెక్క చూసి బయలుదేరి, ఇశ్రాయేలువారితో యుద్ధం చేయడానికి ఆఫెకు వచ్చాడు.
27 ఇశ్రాయేలు వారంతా సిద్ధపడి వాళ్ళని ఎదుర్కోడానికి బయలుదేరారు. ఇశ్రాయేలు వారు రెండు మేకల మందల్లాగా వాళ్ళ ఎదుట దిగారు. ఆ ప్రాంతమంతా సిరియా వాళ్ళతో నిండిపోయింది.
28 అప్పుడొక దైవ సేవకుడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇలా అన్నాడు. “యెహోవా చెప్పేదేమిటంటే, ‘సిరియా వాళ్ళు యెహోవా కొండల దేవుడే గాని లోయల దేవుడు కాడు’ అని అనుకుంటున్నారు. అయితే నేను యెహోవానని మీరు తెలుసుకొనేలా ఈ గొప్ప సమూహమంతటినీ నీ వశం చేస్తాను.”
29 వాళ్ళు ఎదురెదురుగా గుడారాలు వేసుకుని ఏడు రోజులున్నారు. ఏడో రోజున యుద్ధం మొదలయింది. ఇశ్రాయేలు వారు ఒక్క రోజులోనే సిరియను సైన్యంలోని లక్షమంది కాల్బలాన్ని చంపేశారు.
30 మిగతావారు ఆఫెకు పట్టణంలోకి పారిపోతే, పట్టణ గోడ కూలి 27,000 మంది చనిపోయారు. బెన్హదదు కూడా ఆ పట్టణంలోకి పారిపోయి ఒక ఇంట్లో లోపలి గదిలో దాక్కున్నాడు.
31 అతని సేవకులు “ఇశ్రాయేలు వారి రాజులు దయగల వారని మేము విన్నాం. కాబట్టి నీకు అనుకూలమైతే, మేము నడుం చుట్టూ గోనెపట్టాలు కట్టుకుని తల మీద తాళ్ళు వేసుకుని ఇశ్రాయేలు రాజు దగ్గరికి పోతాం. అతడు నీ ప్రాణాన్ని కాపాడతాడేమో” అని రాజుతో అన్నారు. రాజు అందుకు ఒప్పుకున్నాడు.
32 కాబట్టి వాళ్ళు తమ నడుములకు గోనెపట్టాలు కట్టుకుని తలమీద తాళ్ళు వేసుకుని ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి “నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బతకనిమ్మని మనవి చేయడానికి మమ్మల్ని పంపాడు” అని చెప్పారు. అతడు “బెన్హదదు నా సోదరుడు. అతడింకా బతికే ఉన్నాడా” అని అడిగాడు.
33 అప్పుడు వాళ్ళు అహాబు దగ్గర్నుంచి ఏదైనా సూచన కోసం కనిపెడుతూ ఉండి, అతడా మాట అనగానే వెంటనే “అవును, బెన్హదదు మీ సోదరుడే” అన్నారు. అప్పుడు అహాబు “మీరు వెళ్లి అతన్ని తీసుకు రండి” అన్నాడు. బెన్హదదు తన దగ్గరికి వచ్చినప్పుడు, అహాబు తన రథం మీద అతన్ని ఎక్కించుకున్నాడు.
34 బెన్హదదు అహాబుతో “మీ తండ్రి చేతిలోనుంచి మా నాన్న తీసుకున్న పట్టణాలను నేను తిరిగి ఇచ్చేస్తాను. మా నాన్న సమరయలో వ్యాపార కేంద్రాలను కట్టించుకున్నట్టు, దమస్కులో తమరు వ్యాపార కేంద్రాలు కట్టించుకోవచ్చు” అన్నాడు. అహాబు జవాబిస్తూ “అలా చేస్తే ఈ ఒప్పందంతో నిన్ను వదిలేస్తాను” అని అతనితో ఒప్పందం చేసుకుని అతన్ని వదిలేశాడు.
ప్రవక్తతో ఆహాబుకు దేవుని వర్తమానం
35 ప్రవక్తల బృందంలో ఒకడు, యెహోవా ద్వారా ప్రేరణ పొంది, తన తోటి ప్రవక్తతో “దయచేసి నన్ను కొట్టు” అన్నాడు. అయితే ఆ వ్యక్తి అతన్ని కొట్టడానికి ఒప్పుకోలేదు.
36 అప్పుడా ప్రవక్త తన తోటి ప్రవక్తతో “నీవు యెహోవా మాట వినలేదు. కాబట్టి నీవు నా దగ్గరనుంచి వెళ్లిపోగానే సింహం నిన్ను చంపేస్తుంది” అన్నాడు. అతడు వెళ్లిపోతుంటే సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపేసింది.
37 తరువాత ఆ ప్రవక్త మరొకనితో “దయచేసి నన్ను కొట్టు” అన్నాడు. అతడు అతన్ని కొట్టి గాయపరచాడు.
38 అప్పుడా ప్రవక్త వెళ్లి, రాజు కోసం దారిలో ఎదురు చూస్తూ ఉన్నాడు. తననెవరూ గుర్తుపట్టకుండా తన కళ్ళకు గుడ్డ కట్టుకున్నాడు.
39 రాజు రావడం చూసి అతడు బిగ్గరగా ఇలా అన్నాడు. “నీ సేవకుడైన నేను యుద్ధం మధ్యలోకి వెళ్లాను. ఒక సైనికుడు నా దగ్గరికి ఒక బందీని తెచ్చి, ‘ఇతన్ని చూస్తూ ఉండు, ఎలాగైనా వాడు తప్పించుకుపోతే వాని ప్రాణానికి బదులు నీ ప్రాణం పెట్టాలి. లేకపోతే నీవు 34 కిలోల వెండి ఇవ్వాలి’ అన్నాడు.
40 అయితే నీ సేవకుడనైన నేను పనిమీద అటూ ఇటూ తిరుగుతుంటే వాడు తప్పించుకు పోయాడు.” అప్పుడు ఇశ్రాయేలు రాజు “నీకిదే శిక్ష. దాన్ని నువ్వే నిర్ణయించుకున్నావు” అన్నాడు.
41 ఆ ప్రవక్త వెంటనే తన కళ్ళమీదున్న గుడ్డ తీసేశాడు. అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు గుర్తించాడు.
42 ప్రవక్త రాజుతో “యెహోవా చెప్పేదేమిటంటే, నేను చంపేయమన్న వాణ్ణి నీవు వెళ్లిపోనిచ్చావు. కాబట్టి వాడి ప్రాణానికి బదులు నీ ప్రాణం ఇవ్వాలి. అతని ప్రజలకు బదులు నీ ప్రజలు నిర్మూలమవుతారు” అన్నాడు.
43 ఇశ్రాయేలు రాజు విచారంతో, కోపంగా సమరయలోని తన భవనానికి వెళ్ళిపోయాడు.