9
యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమవడం
1 సొలొమోను యెహోవా మందిరం, రాజగృహాల నిర్మాణం, తాను చేయాలని కోరుకున్న దాన్ని చేయడం ముగించిన తరవాత,
2 యెహోవా గిబియోనులో అతనికి ప్రత్యక్షమైనట్టు రెండోసారి సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు.
3 యెహోవా అతనితో ఇలా అన్నాడు. “నా సన్నిధిలో నీవు చేసిన ప్రార్థన విన్నపాలను నేను విన్నాను. నా నామం అక్కడ ఎప్పటికీ నిలిచి ఉండాలని నీవు కట్టించిన ఈ మందిరాన్ని నేను పవిత్ర పరిచాను. నా కళ్ళు, నా మనసు, ఎప్పటికీ దానివైపు ఉంటాయి.
4 నీ తండ్రి దావీదులాగా నీవు కూడా యథార్థ హృదయంతో నీతిని అనుసరిస్తే, నేను నీకు ఆజ్ఞాపించిన విధంగా నా కట్టడలనూ, విధులనూ పాటిస్తే,
5 ‘నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండాా పోడు’ అని నీ తండ్రి దావీదుకు నేను మాట ఇచ్చినట్టు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనాన్ని చిరకాలం స్థిరపరుస్తాను.
6 అయితే మీరు గాని, మీ సంతానం గాని నానుండి తొలగిపోయి, నా ఆజ్ఞలను, కట్టడలను అనుసరించకుండా ఇతర దేవుళ్ళకు నమస్కరించి వాటిని పూజిస్తే,
7 నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశంలో ఉండకుండాా వారిని లేకుండా చేస్తాను. నా నామం కోసం నేను పవిత్ర పరచిన ఈ మందిరాన్ని నా సన్నిధిలో నుండి కొట్టివేస్తాను. ఇశ్రాయేలీయులు వివిధ ప్రజల మధ్యలోకి చెదరిపోయి ఒక సామెతగా, అపహాస్యంగా అవుతారు.
8 ఈ మందిరం మీదుగా వెళ్ళేవారంతా చూసి, ఆశ్చర్యపడి, ‘అరెరే, యెహోవా ఈ దేశానికి, ఈ మందిరానికి ఎందుకిలా చేశాడు?’ అని అడుగుతారు.
9 అప్పుడు ప్రజలు ఇలా చెబుతారు, ‘వారు ఐగుప్తు దేశం నుండి తమ పూర్వీకులను రప్పించిన తమ దేవుడు యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళపై ఆధారపడి వాటికి నమస్కరించి పూజించారు కాబట్టి యెహోవా ఈ కీడు అంతా వారి పైకి రప్పించాడు.’ ”
సొలొమోను సాధించిన ఇతర పనులు
10 సొలొమోను యెహోవా మందిరం, రాజగృహం, రెంటినీ కట్టించడానికి 20 సంవత్సరాలు పట్టింది. తూరు రాజు హీరాము సొలొమోను కోరినంత దేవదారు, సరళ వృక్షపు కలపను, బంగారాన్నీ అతనికి ఇచ్చాడు.
11 కాబట్టి సొలొమోను గలిలయ దేశంలో ఉన్న 20 పట్టణాలను హీరాముకు ఇచ్చాడు.
12 హీరాము తూరు నుండి వచ్చి సొలొమోను తనకిచ్చిన పట్టణాలను చూసినప్పుడు అవి అతనికి నచ్చలేదు.
13 కాబట్టి అతడు “సోదరా, నీవు నాకిచ్చిన ఈ పట్టణాలు ఎలాటివి” అన్నాడు. హీరాము అ ప్రదేశాన్ని కాబూల్ అన్నాడు. ఈ రోజు వరకూ వాటికి “కాబూల్” అని పేరు.
14 హీరాము నాలుగు టన్నుల బంగారాన్ని రాజుకు పంపించాడు.
15 యెహోవా మందిరాన్ని, తన స్వంత రాజగృహాన్ని, మిల్లోను, యెరూషలేము ప్రాకారాన్ని, హాసోరు, మెగిద్దో, గెజెరు అనే పట్టణాలను కట్టించడానికి సొలొమోను వెట్టిపనివారిని పెట్టాడు.
16 అంతకుముందు ఐగుప్తు రాజు ఫరో గెజెరు పైకి దండెత్తి దాన్ని పట్టుకుని, అగ్నితో కాల్చి ఆ పట్టణంలోని కనానీయులను హతమార్చాడు. అతడు తన కుమార్తెను సొలొమోనుకిచ్చి పెళ్లి చేసి ఆ పట్టణాన్ని తన కూతురికి కట్నంగా ఇచ్చాడు.
17 సొలొమోను గెజెరును తిరిగి కట్టించాడు. కింద ఉన్న బేత్ హోరోనును,
18 బయతాతు, అరణ్యంలో ఉన్న తద్మోరు పట్టణాలను,
19 సొలొమోను భోజన పదార్థాలను నిల్వ చేయడానికి, రథాల కోసం, రౌతుల కోసం పట్టణాలను కట్టించాడు. ఇవి గాక అతడు యెరూషలేములో, లెబానోనులో, తన పాలన కింద ఉన్న దేశమంతటిలో తాను వేటిని కట్టాలని కోరుకున్నాడో వాటన్నిటినీ కట్టించాడు.
20 అయితే ఆ కాలంలో ఇశ్రాయేలీయులతో సంబంధంలేని అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు, అనే జాతుల్లో కొందరు మిగిలి ఉన్నారు.
21 ఇశ్రాయేలీయులు వారిని పూర్తిగా నశింపజేయలేక పోయారు. మిగిలి ఉన్న ఆ జాతుల ప్రజలను సొలొమోను బానిసలుగా నియమించాడు. ఈ రోజు వరకూ వారు అలాగే ఉన్నారు.
22 అయితే సొలొమోను ఇశ్రాయేలీయుల్లో ఎవరినీ బానిసలుగా చేయలేదు. వారిని సైనికులుగా, తన సేవకులుగా, అధికారులుగా, సైన్యాధిపతులుగా తన రథాలకు, రౌతులకు అధిపతులుగా చేసుకున్నాడు.
23 సొలొమోను చేయించిన పనిని అజమాయిషీ చేయడానికి ఉన్న ముఖ్య అధికారులు 550 మంది. వీరు పనివారి మీద అధికారులుగా ఉన్నారు.
24 ఫరో కూతురు దావీదుపురం నుండి సొలొమోను తన కోసం కట్టించిన రాజగృహానికి వచ్చిన తరువాత అతడు మిల్లోను కట్టించాడు.
25 సొలొమోను తాను యెహోవాకు కట్టించిన బలిపీఠం మీద సంవత్సరానికి మూడుసార్లు దహనబలులు, శాంతి బలులు అర్పిస్తూ, యెహోవా సన్నిధిలో ఉన్న వేదిక మీద ధూపద్రవ్యాలు వేస్తూ ఉన్నాడు. ఆ విధంగా అతడు మందిరాన్ని కట్టడం పూర్తి చేశాడు.
26 సొలొమోను రాజు ఎదోము దేశపు ఎర్ర సముద్ర తీరంలోని ఏలతు దగ్గర, ఎసోన్గెబెరులో, ఓడలను నిర్మించాడు.
27 హీరాము సముద్ర ప్రయాణం బాగా తెలిసిన నావికులైన తన సేవకులను సొలొమోను సేవకులతోబాటు ఓడల మీద పంపించాడు.
28 వారు ఓఫీరు అనే స్థలానికి వెళ్ళి అక్కడ నుండి 14, 500 కిలోగ్రాముల బంగారాన్ని రాజైన సొలొమోను దగ్గరికి తీసుకువచ్చారు.