7
శతాధిపతి సేవకుని స్వస్థత
మత్తయి 8:5-13
ఆయన తన మాటలన్నీ ప్రజలకు పూర్తిగా వినిపించి కపెర్నహూముకి వచ్చాడు. అక్కడ ఒక శతాధిపతికి ఇష్టమైన సేవకుడు ఒకడికి జబ్బు చేసి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ శతాధిపతి యేసును గురించి విని, ఆయన వచ్చి తన సేవకుణ్ణి బాగు చేయాలని ఆయనను బతిమాలడానికి యూదుల పెద్దలను ఆయన దగ్గరికి పంపించాడు.
వారు యేసు దగ్గరికి వచ్చి, “నువ్వు తప్పక ఈ మేలు చేయాలి. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా యోగ్యుడు. అతడు మన ప్రజలను ప్రేమించాడు. మన సమాజ మందిరాన్ని మన కోసం కట్టించింది ఇతడే” అని ఆయనను ఎంతో బతిమాలారు.
కాబట్టి యేసు వారితో వెళ్ళాడు. ఆయన అతని ఇంటి దగ్గరలోకి వచ్చినప్పుడు, ఆ శతాధిపతి తన స్నేహితులను కొందరిని పంపి వారితో యేసుకు ఇలా చెప్పించాడు. “ప్రభూ, నువ్వు శ్రమ తీసుకోవద్దు. నువ్వు నా ఇంట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. అలాగే నీ దగ్గరికి వచ్చే యోగ్యత కూడా నాకు లేదు. నువ్వు మాట మాత్రం చెప్పు. నా సేవకుడికి పూర్తిగా నయమవుతుంది. నేను కూడా అధికారం కింద ఉన్నవాణ్ణే. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకణ్ణి ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు, ఒకణ్ణి ‘రా’ అంటే వస్తాడు. నా సేవకుణ్ణి ఫలానా పని చేయమంటే చేస్తాడు.”
యేసు ఈ మాటలు విని, ఆ వ్యక్తి విషయం ఆశ్చర్య పోయాడు. తన వెనక వస్తున్న జనసమూహం వైపు తిరిగి, “ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెబుతున్నాను” అన్నాడు. 10 అతడు పంపిన వారు తిరిగి వచ్చి ఆ పనివాడు జబ్బు నయమై పూర్తి ఆరోగ్యంతో ఉండడం చూశారు.
విధవరాలి కొడుక్కి ప్రాణం పోయడం
11 ఇది జరిగిన తరువాత ఆయన నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నాడు. ఆయన శిష్యులు, ఇంకా పెద్ద జనసమూహం ఆయనతో వెళ్తున్నారు. 12 ఆయన ఆ ఊరి పొలిమేరకు వచ్చినప్పుడు కొందరు చనిపోయిన వాణ్ణి మోసుకుపోతూ ఎదురయ్యారు. చనిపోయిన వాడు అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె వితంతువు. గ్రామస్తులు చాలామంది ఆమెతో ఉన్నారు.
13 ప్రభువు ఆమెను చూసి ఆమెపై జాలిపడి, “ఏడవ వద్దు” అని ఆమెకు చెప్పి, దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు. దాంతో దాన్ని మోసేవారు నిలబడి పోయారు. 14 ఆయన, “అబ్బాయ్, నేను చెబుతున్నాను, లే!” అన్నాడు. 15 ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అతణ్ణి ఆ తల్లికి అప్పచెప్పాడు.
16 అందరూ భయంతో నిండిపోయి, “మనలో గొప్ప ప్రవక్త లేచాడు. దేవుడు తన ప్రజలను సందర్శించాడు” అంటూ దేవుణ్ణి కీర్తించారు. 17 ఆయనను గురించిన ఈ సమాచారం యూదయ ప్రాంతమంతటా ప్రాంతాల్లో వ్యాపించింది.
బాప్తిసమిచ్చే యోహాను సందేహం
మత్తయి 11:2-6
18 యోహాను శిష్యులు ఈ సంగతులన్నటినీ యోహానుకు తెలియజేశారు. 19 అప్పుడు యోహాను తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, “రావలసిన వాడివి నువ్వేనా? లేక మరొకరి కోసం మేము ఎదురు చూడాలా?” అని అడగడానికి వారిని ప్రభువు దగ్గరికి పంపించాడు.
20 వారు ఆయన దగ్గరికి వచ్చి, “ ‘రావలసిన వాడివి నువ్వేనా? లేక మరొకరి కోసం ఎదురు చూడాలా?’ అని అడగమని మమ్మల్ని బాప్తిసమిచ్చే యోహాను నీ దగ్గరికి పంపాడు” అని చెప్పారు. 21 అదే సమయంలో ఆయన అనేకమంది రోగులనూ, బాధితులనూ, దయ్యాలు పట్టిన వారిని బాగు చేస్తూ ఉన్నాడు. గుడ్డివారికి చూపు ప్రసాదిస్తూ ఉన్నాడు.
22 అప్పుడాయన వారికి ఇలా జవాబిచ్చాడు, “వెళ్ళి మీరు చూసిన వాటినీ వినిన వాటినీ యోహానుకు చెప్పండి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ట రోగులు బాగుపడుతున్నారు, చెవిటివారు వింటున్నారు. చనిపోయిన వారు తిరిగి ప్రాణంతో లేస్తున్నారు. పేదవాళ్ళకు సువార్త ప్రకటన జరుగుతూ ఉంది. 23  నా విషయంలో అభ్యంతరాలేమీ లేని వాడు ధన్యుడు.”
బాప్తిసమిచ్చే యోహాను గురించి యేసు సాక్ష్యం
మత్తయి 11:7-15
24 యోహాను దగ్గర నుండి వచ్చిన శిష్యులు వెళ్ళిపోయిన తరువాత యేసు యోహాను గురించి జన సమూహంతో ఇలా చెప్పాడు, “మీరు ఏం చూద్దామని అడవిలోకి వెళ్ళారు? గాలికి ఊగే రెల్లునా? 25  అది కాకుంటే మరేం చూడ్డానికి వెళ్ళారు? సన్నని వస్త్రాలు ధరించుకున్నవాడినా? వినండి, విలువైన వస్త్రాలు ధరించుకుని సుఖంగా జీవించే వారు రాజ మందిరాల్లో ఉంటారు. 26  అది కాకపోతే ఇంకేం చూద్దామని వెళ్ళారు? ప్రవక్తనా? అవును. కానీ యోహాను ఒక ప్రవక్త కంటే గొప్పవాడని మీకు చెబుతున్నాను.
27  ‘చూడు! నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను,
అతడు నీకు ముందుగా నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు’ అని ఎవరిని గురించి రాశారో అతడే ఈ యోహాను.
28  స్త్రీ గర్భాన పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడూ లేడు. అయినా దేవుని రాజ్యంలో అల్పుడు అతని కంటే గొప్పవాడని మీతో చెబుతున్నాను.”
29 ప్రజలందరూ, పన్ను వసూలుదారులూ యోహాను సందేశం విని, దేవుడు నీతిమంతుడని అంగీకరించారు. అతని ద్వారా బాప్తిసం పొందారు. 30 కానీ పరిసయ్యులూ, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారూ అతని చేత బాప్తిసం పొందకుండా వారి జీవితాల్లో దేవుని సంకల్పాన్ని నిరాకరించారు.
31  కాబట్టి ఈ తరం మనుషులను నేను దేనితో పోల్చాలి? వీళ్ళు దేనిలాగా ఉన్నారు? 32  సంతవీధుల్లో కూర్చుని, ‘మేము వేణువు ఊదాం, మీరు నాట్యం చేయలేదు, ఏడుపు పాట పాడాం, మీరేమో ఏడవలేదు’ అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆటలాడుకునే చిన్న పిల్లల్లా ఉన్నారు. 33  బాప్తిసమిచ్చే యోహాను రొట్టెలు తినకుండా ద్రాక్షారసం తాగకుండా ఉన్నాడని ‘వీడికి దయ్యం పట్టింది’ అని మీరు అంటున్నారు. 34  మనుష్య కుమారుడు తింటూ తాగుతూ ఉన్నాడని ‘వీడు తిండిబోతూ, తాగుబోతూ, సుంకరులకూ పాపులకూ స్నేహితుడు’ అంటున్నారు. 35  అయితే జ్ఞానం దాని పిల్లలను బట్టి జ్ఞానమని తీర్పు పొందుతుంది.”
పరిసయ్యుడి ఇంట్లో యేసు
36 పరిసయ్యుల్లో ఒకడు తనతో భోజనం చేయాలని ఆయనను ఆహ్వానించాడు. ఆయన ఆ పరిసయ్యుడి ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు.
37 ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, యేసు పరిసయ్యుడి ఇంట్లో భోజనానికి వచ్చాడని తెలుసుకుని, ఒక బుడ్డిలో అత్తరు తీసుకు వచ్చి 38 ఆయనకు వెనుకగా ఆయన పాదాల దగ్గర ఏడుస్తూ నిలబడింది. ఆమె కన్నీళ్ళతో ఆయన పాదాలు తడిసి పోయాయి. ఆమె తన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి వాటిని ముద్దు పెట్టుకుని వాటికి అత్తరు పూసింది.
39 ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, “ఈయన ప్రవక్తే అయితే తనను ముట్టుకున్న స్త్రీ ఎవరో, ఎలాంటిదో తెలుసుకోగలడు. ఈమె పాపాత్మురాలు” అని తనలో తాను అనుకున్నాడు. 40 దానికి యేసు, “సీమోనూ, నీతో ఒక మాట చెప్పాలి” అని అతనితో అన్నాడు. అతడు, “బోధకా, చెప్పు” అన్నాడు.
అప్పు తీసుకున్న ఇద్దరు వ్యక్తులు
41 అప్పుడు యేసు, “అప్పులిచ్చే ఒకడి దగ్గర ఇద్దరు అప్పు చేశారు. వారిలో ఒకడు ఐదువందల వెండి నాణేలూ మరొకడు యాభై వెండి నాణేలూ బాకీ పడ్డారు. 42  ఆ అప్పు తీర్చడానికి వారి దగ్గర ఏమీ లేదు కాబట్టి ఆ వ్యక్తి వారిద్దరినీ క్షమించేశాడు. కాబట్టి వీరిద్దరిలో అతణ్ణి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో చెప్పు?” అని అడిగాడు.
43 అందుకు సీమోను, “అతడెవరిని ఎక్కువ క్షమించాడో వాడే అని నాకు అనిపిస్తుంది” అన్నాడు. దానికి యేసు, “సరిగ్గా ఆలోచించావు” అని అతనితో చెప్పి, 44 ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇలా అన్నాడు, “ఈ స్త్రీని చూస్తున్నావు కదా. నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు కాళ్ళు కడుక్కోడానికి నాకు నీళ్ళివ్వలేదు, కానీ ఈమె కన్నీళ్ళతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. 45  నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చిన దగ్గర్నించి ఈమె నా పాదాలను ముద్దు పెట్టుకోవడం ఆపలేదు. 46  నువ్వు నా తలకి నూనె పూయలేదు కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది. 47  దీన్ని బట్టి నేను చెప్పేదేమిటంటే ఎక్కువ పాపాలు చేసిన ఈమె అధికమైన క్షమాపణ పొందింది, అధికంగా ప్రేమించింది. ఎవరికి కొంచెం క్షమాపణ దొరుకుతుందో వాడు కొంచెమే ప్రేమిస్తాడు” అని చెప్పాడు.
48 తరువాత యేసు ఆమెతో, “నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు. 49 అప్పుడు ఆయనతో పాటు భోజనానికి కూర్చున్న వారు, “పాపాలు క్షమించడానికి ఇతనెవరు?” అని తమలో తాము అనుకోవడం మొదలు పెట్టారు. 50 అప్పుడు ఆయన, “నీ విశ్వాసం నిన్ను రక్షించింది. శాంతిగా వెళ్ళు” అని ఆమెతో చెప్పాడు.