17
రక్తాన్ని ఆహారంగా తీసుకోవడం నిషేధం
1 యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.
2 “నువ్వు అహరోనుతోనూ, అతని కొడుకులతోనూ, ఇశ్రాయేలు సమాజమంతటితోనూ ఇలా చెప్పు. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట
3 ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా బలి అర్పించడానికై ఒక ఎద్దుని గానీ, మేకని గానీ, గొర్రె పిల్లని గానీ పట్టుకుని శిబిరం లోపలైనా, బయటైనా చంపి,
4 దాన్ని యెహోవాకి అర్పించడానికి ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి దాన్ని తీసుకు రాకపోతే అతడు రక్తం విషయంలో అపరాధి అవుతాడు. అతడు రక్తం చిందించాడు, కాబట్టి అలాంటి వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.
5 ఈ ఆదేశం వెనుక ఉన్న ఉద్దేశం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఇక పైన బలి అర్పించాలంటే బలి పశువులను ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవాకి శాంతిబలి అర్పణ చేయడానికి యాజకుని దగ్గరికి తీసుకురావాలి.
6 యాజకుడు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉన్న యెహోవా బలిపీఠం పైన రక్తాన్ని చిమ్మాలి. యెహోవాకి కమ్మని సువాసన కలిగేట్టు కొవ్వుని దహించాలి.
7 ఏ విగ్రహాలకు వాళ్ళు ఇంతకు ముందు వేశ్యల్లా ప్రవర్తించారో ఆ మేక రూపంలో ఉన్న విగ్రహాలకు ఇంతకు ముందులాగా బలులు అర్పించకూడదు. ఇది వాళ్ళ రాబోయే తరాలన్నిటికీ శాశ్వతమైన చట్టం.
8 నువ్వు వాళ్లకి ఇంకా ఇలా చెప్పు. ఇశ్రాయేలు జాతి వాడైనా, మీతో కలసి నివసించే విదేశీయుడైనా దహనబలిని గానీ, మరింకేదైనా బలి అర్పణ గానీ చేసి
9 దాన్ని ప్రత్యక్ష గుడారం దగ్గరికి యెహోవాకు అర్పించడానికి తీసుకు రాకపోతే ఆ వ్యక్తిని ప్రజల్లో లేకుండా చేయాలి.
10 ఇశ్రాయేలు జాతి వాడైనా, మీతో కలసి నివసించే విదేశీయుడైనా ఏరక్తాన్ని ఆహారంగా తీసుకుంటే నేను అలాంటి వాడికి విరోధంగా ఉంటాను. రక్తాన్నైనా ఆహారంగా తీసుకునే వాణ్ణి మనుషుల్లో లేకుండా చేస్తాను.
11 ఒక జంతువుకి ప్రాణం దాని రక్తమే. మీ ప్రాణాల కోసం పరిహారం చేయడానికి నేను రక్తాన్ని ఇచ్చాను. ఎందుకంటే రక్తమే పరిహారం చేస్తుంది. ప్రాణానికి పరిహారం చేసేది రక్తమే.
12 కాబట్టి ఇశ్రాయేలు ప్రజలైన మీలో ఎవరూ రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదని ఆదేశించాను. మీ మధ్య నివసించే ఏ విదేశీయుడూ రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదని ఆదేశించాను.
13 అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా లేదా మీ మధ్య నివసించే ఏ విదేశీయుడైనా తినదగిన జంతువునో, పక్షినో వేటాడి చంపితే దాని రక్తాన్ని పారబోసి మట్టితో కప్పాలి. ఎందుకంటే ప్రతి ప్రాణికీ దాని రక్తమూ, ప్రాణమూ ఒక్కటే. రక్తం, ప్రాణంతో కలసి ఉంటుంది.
14 కాబట్టి నేను ఇశ్రాయేలు ప్రజలకి ‘మీరు జంతువు రక్తాన్నీ ఆహారంగా తీసుకోకూడదు. ఎందుకంటే జీవులన్నిటికీ ప్రాణం వాటి రక్తంలోనే ఉంటుంది. దాన్ని తినేవాడు ప్రజల్లో లేకుండా తీసివేస్తాను’ అని ఆదేశించాను.
15 స్థానికుడైనా, మీ మధ్యలో నివసించే విదేశీయుడైనా చనిపోయిన జంతువునో లేదా మృగాలు చీల్చివేసిన జంతువునో ఆహారంగా తీసుకుంటే, అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. తరువాత అతడు శుద్ధుడు అవుతాడు.
16 ఒకవేళ అతడు బట్టలు ఉతుక్కోకుండా, స్నానం చేయకుండా ఉంటే అపరాధిగా ఉండిపోతాడు.”