22
యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. “అహరోనుతో అతని కొడుకులతో ఇది చెప్పు. వారు ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించే వాటిని ప్రత్యేకమైనవిగా భావించాలి. వారు నా పరిశుద్ధ నామాన్ని అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను. నీవు వారితో ఇలా చెప్పు. మీ తరతరాలకు మీ సంతతి వారందరిలో ఒకడు అపవిత్రంగా ఉండి ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే వాటిని సమీపిస్తే అలాంటి వాణ్ణి నా సన్నిధిలో ఉండకుండాా దూరంగా కొట్టివేస్తాను. నేను యెహోవాను.
అహరోను సంతానంలో ఎవరికైనా కుష్టువ్యాధి గానీ, శరీరం నుండి రసి లాంటిది కారడం గానీ ఉంటే అలాటి వాడు పవిత్రుడయ్యే వరకూ ప్రతిష్ఠితమైన వాటిలో దేనినీ తినకూడదు. శవాన్ని తాకడం వల్లా, అపవిత్రమైన దేనినైనా ముట్టుకోవడం వల్లా, వీర్యస్కలనం చేసిన వాణ్ణి తాకడం వల్లా, అపవిత్రమైన పురుగును, లేక ఏదో ఒక అపవిత్రత మూలంగా అపవిత్రుడైపోయిన మనిషిని ముట్టుకోవడం వల్లా, అలాటి అపవిత్రత తగిలినవాడు సాయంత్రం వరకూ అపవిత్రుడుగా ఉంటాడు. అతడు నీళ్లతో తన ఒళ్ళు కడుక్కునే వరకూ ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడౌతాడు. ఆ తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చు. అవి అతనికి ఆహారమే గదా.
అతడు చచ్చిన జంతువును గానీ, మృగాలు చీల్చిన వాటిని గాని తిని దాని వలన తనను అపవిత్ర పరచుకోకూడదు. నేను యెహోవాను. కాబట్టి నేను విధించిన నియమాన్ని మీరి, దాని పాపదోషం తనపై వేసుకుని దాని వలన చావకుండేలా చూసుకోవాలి. నేను వారిని పరిశుద్ధ పరిచే యెహోవాను.
10 ప్రతిష్ఠితమైన దాన్ని యూదులు కాని వారు తినకూడదు. యాజకుని ఇంట్లో నివసించే అన్యుడు గాని, సేవకుడు గాని ప్రతిష్ఠితమైన దాన్ని తినకూడదు. 11 అయితే యాజకుడు తన డబ్బుతో కొనుక్కున్న వాడు, అతని ఇంట్లో పుట్టినవాడు అతడు తినే ఆహారం తినవచ్చు. 12 యాజకుని కుమార్తెను అన్యునికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె ప్రతిష్ఠితమైన అర్పణల్లో దేనినీ తినకూడదు. 13 యాజకుని కుమార్తెల్లో వితంతువుగానీ, విడాకులు తీసుకున్నది గానీ పిల్లలు పుట్టక పోవడం వల్ల ఆమె తన బాల్యప్రాయంలో వలె తన తండ్రి యింటికి తిరిగి చేరితే తన తండ్రి ఆహారాన్ని తినవచ్చు. అన్యుడు మాత్రం దాన్ని తినకూడదు.
14 ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైన దాన్ని తింటే వాడు ఆ ప్రతిష్ఠితమైన దాని విలువలో ఐదో వంతు కలిపి యాజకునికి తిరిగి ఇవ్వాలి.
15 ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినడం వలన అపరాధాన్ని భరించకుండా ఉండాలంటే తాము యెహోవాకు ప్రతిష్ఠించే పరిశుద్ధ వస్తువులను అపవిత్ర పరచకూడదు. 16 నేను *అర్పణలను పరిశుద్ధ పరచే యెహోవానని చెప్పు.”
అంగీకరింపదగని బలులు
17 యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. 18 “నీవు అహరోనుతో, అతని కొడుకులతో, ఇశ్రాయేలీయులందరితో ఇలా చెప్పు. ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో గానీ ఇశ్రాయేలీయుల్లో నివసించే పరదేశుల్లోగాని యెహోవాకు దహన బలి అర్పించదలిస్తే అది స్వేచ్ఛార్పణగానివ్వండి, మొక్కుబడి గానివ్వండి 19 ఆ అర్పణ దేవుడు అంగీకరించేలా ఆవుల్లో నుండి గానీ, గొర్రె మేకల్లో నుండి గానీ దోషంలేని మగదాన్ని అర్పించాలి. 20 కళంకం ఉన్న దాన్ని అర్పించ కూడదు. అది అంగీకారం కాదు. 21 ఒకడు మొక్కుబడిగా స్వేచ్ఛార్పణంగా అర్పించడానికి శాంతి బలిగా ఆవునైనా గొర్రెనైనా మేకనైనా యెహోవాకు తెస్తే ఆయన దాన్ని అంగీకరించేలా అది దోషం లేనిదై ఉండాలి. దానిలో కళంకమేదీ ఉండకూడదు. 22 గుడ్డిదాన్ని గానీ కుంటిదాన్ని గానీ, పాడైపోయిన దాన్ని గానీ, గడ్డలు, గజ్జి, కురుపులు ఉన్న దాన్ని గానీ యెహోవాకు అర్పించకూడదు. అలాంటివి దేన్నీ బలివేదికపై యెహోవాకు హోమం చేయకూడదు.
23 అంగవైకల్యం గల కోడెదూడనైనా గొర్రెల మేకల మందలోని దాన్నైనా స్వేచ్ఛార్పణంగా అర్పించవచ్చు గానీ మొక్కుబడిగా మాత్రం అది అంగీకారం కాదు.
24 గాయపడిన, నలిగిన, మృగాలు చీల్చిన, వృషణాలు చితక గొట్టిన జంతువును యెహోవాకు అర్పించకూడదు. మీ దేశంలో అలాంటివి అర్పించకూడదు. 25  విదేశీయుల దగ్గర నుండి అలాటి వాటిని తీసుకుని మీ దేవుడికి నైవేద్యంగా అర్పించకూడదు. అవి లోపం గలవి, వాటికి కళంకం ఉంది. మీ పక్షంగా దేవుడు వాటిని అంగీకరించడు, అని చెప్పు.”
26 యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు. 27 “దూడగాని, గొర్రెపిల్లగాని, మేకపిల్లగాని పుట్టినప్పుడు అది ఏడు రోజులు దాని తల్లితో ఉండాలి. ఎనిమిదవ రోజు మొదలు అది యెహోవాకు హోమంగా అంగీకారమే. 28 అయితే అది ఆవైనా గొర్రె మేకలైనా మీరు దాన్ని, దాని పిల్లను ఒక్క నాడే వధించకూడదు. 29 మీరు కృతజ్ఞత బలిగా ఒక పశువును వధించినప్పుడు అది మీ కోసం అంగీకారం అయ్యేలా దాన్ని అర్పించాలి. 30 ఆనాడే దాని తినెయ్యాలి. మరుసటి రోజు దాకా దానిలో కొంచెమైనా మిగల్చకూడదు. నేను యెహోవాను.
31 మీరు నా ఆజ్ఞలను అనుసరిస్తూ వాటి ప్రకారం నడుచుకోవాలి. నేను యెహోవాను. 32 నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రాయేలీయుల్లో నన్ను పరిశుద్ధునిగా చేసుకుంటాను. నేను మిమ్మల్ని పరిశుద్ధ పరిచే యెహోవాను. 33 నేను మీకు దేవుడనై ఉండేలా ఐగుప్తు దేశంలోనుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను అని చెప్పు.”
* 22:16 22:16 లేక ప్రజలను. 22:25 22:25 కనానీయ ప్రజలు తాము పెంచే జంతువుల వృషణాలు చితక గొడతారు. అందుకని వారి దగ్గర కొన్న జంతువులను దేవునికి అర్పించ కూడదు.