5
పర్వత ప్రసంగం
లూకా 6:20-49; లూకా 6:20-23
1 యేసు ఆ ప్రజా సమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు.
2 ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించ సాగాడు.
3 “ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే.
4 దుఃఖించే వారు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది.
5 సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు.
6 నీతిన్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు.
7 కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు.
8 పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు.
9 శాంతి కుదిర్చేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు.
10 నీతి కోసం నిలబడి హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది.
11 “నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు.
12 అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు.
విశ్వాసి పోలికలు
మార్కు 4:21-23; లూకా 8:16-18
13 “లోకానికి మీరు ఉప్పు. ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది? అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళ కింద తొక్కడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు.
14 ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు.
15 ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది.
16 మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు.
క్రీస్తుకు ధర్మశాస్త్రంతో సంబంధం
17 “నేను ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ రద్దు చేయడానికి వచ్చాననుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దు చేయడానికి కాదు.
18 నేను కచ్చితంగా చెబుతున్నాను. ఆకాశం, భూమి నశించే వరకూ ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకూ ధర్మశాస్త్రం నుంచి ఒక్క పొల్లు అయినా, ఒక సున్నా అయినా తప్పిపోదు.
19 కాబట్టి ఈ ఆజ్ఞల్లో ఎంత చిన్న దానినైనా సరే అతిక్రమించి, ఇతరులకు కూడా అలా చేయమని బోధించేవాణ్ణి పరలోకరాజ్యంలో అతి తక్కువ వాడుగా ఎంచుతారు. కానీ ఈ ఆజ్ఞల ప్రకారం చేస్తూ, వాటిని బోధించేవాణ్ణి పరలోక రాజ్యంలో గొప్పవాడుగా లెక్కిస్తారు.
20 ధర్మశాస్త్ర పండితుల, పరిసయ్యుల నీతికన్నా మీ నీతి మిన్నగా ఉండకపోతే మీరు పరలోకరాజ్యంలో ఎంత మాత్రమూ ప్రవేశించలేరని మీతో చెబుతున్నాను.
21 “ ‘హత్య చేయవద్దు. హత్య చేసేవాడు శిక్షకు లోనవుతాడు’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు.
22 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు. తన సోదరుణ్ణి ‘పనికి మాలినవాడా’ అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి. ‘మూర్ఖుడా’ అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు.
23 “కాబట్టి నీవు నీ కానుకను బలిపీఠం వద్ద అర్పించే ముందు, నీ సోదరునికి నీ మీద ఏదైనా విరోధ భావం ఉందని నీకు గుర్తుకు వచ్చిందనుకో.
24 నీ కానుకను అక్కడే, బలిపీఠం ఎదుటే వదిలి వెళ్ళు. ముందు నీ సోదరునితో రాజీ పడు. ఆ తరువాత వచ్చి నీ కానుకను అర్పించు.
25 నీపై నేరం ఆరోపించేవాడితో న్యాయస్థానానికి వెళ్ళే దారిలోనే త్వరగా రాజీపడు. లేకపోతే అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో. ఆ న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించి చెరసాల్లో వేయిస్తాడేమో.
26 చెల్లించాల్సి ఉన్నదంతా చెల్లించే వరకూ నీవు అక్కడ నుండి బయట పడలేవని కచ్చితంగా చెబుతున్నాను.
27 “ ‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా.
28 కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు.
29 నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.
30 నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.
విడాకుల గురించి యేసు ఉపదేశం
మత్తయి 13:3-11; మార్కు 10:2-12; 1కొరింతీ 7:10-15
31 “ ‘తన భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి’ అని చెప్పడం కూడా మీరు విన్నారు.
32 నేను మీతో చెప్పేదేమిటంటే వ్యభిచార కారణం కాకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
కచ్చితమైన మాట
33 “ ‘నీవు అబద్ధ ప్రమాణం చేయకూడదు. ప్రభువుకు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా.
34 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే ఎంతమాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. పరలోకం మీద ఒట్టు పెట్టుకోవద్దు, అది దేవుని సింహాసనం.
35 భూమి తోడు అనవద్దు. అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడు అనవద్దు. అది మహారాజు నగరం.
36 నీ తల తోడని ప్రమాణం చేయవద్దు. నీవు ఒక వెంట్రుకైనా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు.
37 మీ మాట ‘అవునంటే అవును, కాదంటే కాదు’ అన్నట్టే ఉండాలి. అలా కాని ప్రతిదీ అపవాది సంబంధమైనదే.
38 “ ‘కంటికి బదులు కన్ను, పన్నుకు బదులు పన్ను’ అని చెప్పింది మీరు విన్నారు గదా.
39 కానీ నేను మీతో చెప్పేదేమిటంటే దుష్టుణ్ణి ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే అతన్ని మరొక చెంప మీద కూడా కొట్టనియ్యి.
40 ఎవరైనా నీ అంగీ విషయం వివాదం పెట్టుకుని దాన్ని లాక్కుంటే అతనికి నీ పైచొక్కా కూడా ఇచ్చివెయ్యి.
41 ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్ళు వెళ్ళు.
42 నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు.
ధర్మశాస్త్రానికి మించిన నీతి
43 “ ‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా.
44 నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి.
45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.
46 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా.
47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా.
48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.