23
బిలాము మొదటి సందేశం
1 అప్పుడు బిలాము బాలాకుతో “ఇక్కడ నా కోసం ఏడు బలిపీఠాలు కట్టించి, ఏడు దున్నపోతులను, ఏడు పొట్టేళ్లను సిద్ధం చెయ్యి” అన్నాడు.
2 బిలాము చెప్పినట్టు బాలాకు చేసినప్పుడు, బాలాకు, బిలాము ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతునూ ఒక పొట్టేలునూ దహనబలిగా అర్పించారు.
3 ఇంకా బిలాము బాలాకుతో “బలిపీఠం మీద నీ దహనబలి దగ్గర నిలిచి ఉండు. ఒకవేళ నన్ను కలవడానికి యెహోవా వస్తాడేమో. ఆయన నాకు ఏమి చూపిస్తాడో అది నీకు తెలియజేస్తాను” అని చెప్పి చెట్లు లేని కొండ ఎక్కి వెళ్ళాడు.
4 దేవుడు బిలామును కలుసుకున్నప్పుడు, బిలాము ఆయనతో “నేను ఏడు బలిపీఠాలు కట్టి, ప్రతి దాని మీద ఒక దున్నపోతు, ఒక పొట్టేలును అర్పించాను” అని చెప్పాడు.
5 యెహోవా ఒక వార్త బిలాము నోట ఉంచి “నువ్వు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లి అతనితో మాట్లాడు” అన్నాడు.
6 అతడు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లినప్పుడు అతడు మోయాబు నాయకులందరితో తన దహనబలి దగ్గర నిలబడి ఉన్నాడు.
7 అప్పుడు బిలాము ప్రవచనరీతిగా,
“అరాము నుంచి బాలాకు, తూర్పు పర్వతాల నుంచి మోయాబురాజు నన్ను రప్పించి,
‘వచ్చి, నాకోసం యాకోబును శపించు’ అన్నాడు,
‘వచ్చి ఇశ్రాయేలును వ్యతిరేకించు’ అన్నాడు.
8 దేవుడు శపించనివారిని నేనెలా శపించను?
దేవుడు వ్యతిరేకించని వారిని నేనెలా వ్యతిరేకించను?
9 రాతిబండల మీద నుంచి ఆయన్ని చూస్తున్నాను.
కొండలపై నుండి ఆయన్ని కనుగొన్నాను.
చూడు, ఒంటిగా నివసించే జనం ఒకటి ఉంది.
వారు ఒక సాధారణ జనంగా తమను తాము ఎంచుకోరు.
10 యాకోబు రేణువులను ఎవరు లెక్కించ గలరు?
ఇశ్రాయేలులో నాల్గోవంతునైనా ఎవరు లేక్కించ గలరు?
నీతిమంతుల మరణం లాంటి మరణం నాకు రానివ్వండి.
నా జీవిత అంతం ఆయన జనంలా ఉండనివ్వండి” అన్నాడు.
11 బాలాకు బిలాముతో “నువ్వు నాకు ఏం చేశావు? నా శత్రువులను శపించడానికి నిన్ను రప్పించాను. కాని నువ్వు వారిని దీవించావు” అన్నాడు.
12 బిలాము జవాబిస్తూ “యెహోవా నా నోట ఉంచినదే నేను జాగ్రత్తగా పలకాలి కదా?” అన్నాడు.
బిలాము రెండవ సందేశం
13 అప్పుడు బాలాకు అతనితో “దయచేసి నాతోపాటు ఇంకొక చోటికి రా. అక్కడనుంచి వారిని చూడొచ్చు. చివర ఉన్న వారిని మాత్రమే నువ్వు చూడ గలుగుతావు. వారందరూ నీకు కనిపించరు. అక్కడ నుంచి నా కోసం వారిని శపించాలి” అని చెప్పి
14 పిస్గా కొండపైన ఉన్న కాపలావారి పొలానికి అతన్ని తీసుకెళ్ళి, ఏడు బలిపీఠాలు కట్టించి, ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతును, ఒక పొట్టేలును అర్పించాడు.
15 అప్పుడు బిలాము బాలాకుతో “నువ్వు ఇక్కడ నీ దహనబలి దగ్గర నిలిచి ఉండు. నేను అక్కడ యెహోవాను కలుసుకుంటాను” అన్నాడు.
16 యెహోవా బిలామును కలుసుకుని ఒక వార్త అతని నోట ఉంచి “నువ్వు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లి నా వార్త అతనికి అందించు” అన్నాడు.
17 అతడు బాలాకు దగ్గరికి వెళ్లినప్పుడు అతడు తన దహనబలి దగ్గర నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులు కూడా అతని దగ్గర ఉన్నారు. బాలాకు “యెహోవా ఏం చెప్పాడు?” అని అడిగాడు.
18 బిలాము ప్రవచనంగా “బాలాకూ, లేచి విను. సిప్పోరు కుమారుడా, ఆలకించు.
19 అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు.
మనస్సు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు.
ఆయన వాగ్దానం చేసి కార్యం చెయ్యకుండా ఉంటాడా?
ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?
20 చూడు, దీవించమని నాకు ఆజ్ఞ వచ్చింది.
దేవుడు దీవెన ఇచ్చాడు. నేను దాన్ని మార్చలేను.
21 ఆయన యాకోబులో కష్టం గాని, దోషం గాని కనుగొనలేదు.
వారి దేవుడైన యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు.
22 అడవిదున్న బలం లాంటి బలంతో దేవుడు వారిని ఐగుప్తులోనుంచి తీసుకొచ్చాడు.
23 యాకోబుకు వ్యతిరేకంగా ఏ మంత్రం పనిచెయ్యదు.
ఏ శకునం హాని చెయ్యదు.
దానికి బదులుగా యాకోబు గురించీ, ఇశ్రాయేలు గురించీ ‘దేవుడు ఏం చేశాడో చూడు’ అని చెప్పుకోవాలి.
24 చూడు, ఆ ప్రజలు ఆడసింహంలా లేస్తారు,
ఆ జాతి సింహంలా బయటకు వచ్చి వేటాడుతుంది.
చంపిన దాన్ని తిని, దాని రక్తం తాగే వరకూ అది పండుకోదు” అని పలికాడు.
25 అప్పుడు బాలాకు బిలాముతో “వారిని శపించడం గాని, ఆశీర్వదించడం గాని ఏదీ చెయ్యొద్దు” అన్నాడు.
26 కాని బిలాము “యెహోవా నాకు చెప్పిందంతా నేను చెయ్యాలని నేను నీతో చెప్పలేదా?” అని బాలాకుకు జవాబిచ్చాడు.
బిలాము మూడవ సందేశం
27 బాలాకు బిలాముతో “నువ్వు దయచేసి రా, నేను ఇంకొక చోటికి నిన్ను తీసుకెళ్తాను. అక్కడ నుంచి నా కోసం నువ్వు వారిని శపించడం దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటుందేమో” అన్నాడు.
28 బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పెయోరు శిఖరానికి బిలామును తీసుకు పోయాడు.
29 బిలాము “ఇక్కడ నాకు ఏడు బలిపీఠాలు కట్టించి, ఏడు దున్నపోతులను, ఏడు పొట్టేళ్లను సిద్ధం చెయ్యి” అని బాలాకుతో చెప్పాడు.
30 బిలాము చెప్పినట్టు బాలాకు చేసి, ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతును, ఒక పొట్టేలును అర్పించాడు.