27
సెలోపెహాదు కూతుళ్ళు
1 అప్పుడు యోసేపు కొడుకు మనష్షే వంశస్థుల్లో సెలోపెహాదు కూతుళ్ళు వచ్చారు. సెలోపెహాదు హెసెరుకు కొడుకు, గిలాదుకు మనవడు, మాకీరుకు మునిమనవడు. అతని కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.
2 వారు సన్నిధి గుడారం ద్వారం దగ్గర, మోషే ఎదుట, యాజకుడైన ఎలియాజరు ఎదుట, నాయకుల ఎదుట, సమాజమంతటి ఎదుట నిలిచి “మా తండ్రి ఎడారిలో చనిపోయాడు.
3 అతడు కోరహు గుంపులో, అంటే యెహోవాకు విరోధంగా కూడినవారి గుంపులో లేడు. తన పాపాన్నిబట్టి, తన సొంత పాపాన్నిబట్టి చనిపోయాడు.
4 అతనికి కొడుకులు పుట్టలేదు. అతనికి కొడుకులు లేనంత మాత్రాన మా తండ్రి పేరు అతని వంశంలోనుంచి తీసెయ్యాలా? మా తండ్రి సహోదరులతో పాటు మాకు కూడా స్వాస్థ్యం ఇవ్వండి” అన్నారు.
5 అప్పుడు మోషే వారి కోసం యెహోవా సన్నిధిలో అడిగాడు,
6 యెహోవా మోషేతో “సెలోపెహాదు కూతుళ్ళు చెప్పింది నిజమే.
7 కచ్చితంగా వారి తండ్రి సహోదరులతో పాటు వారసత్వం వారి ఆధీనం చేసి, వారి తండ్రి స్వాస్థ్యం వాళ్లకు వచ్చేలా చూడు.
8 ఇంకా నువ్వు ఇశ్రాయేలీయులతో, ఇలా చెప్పు. ఒకడు కొడుకు పుట్టకుండా చనిపోతే మీరు అతని భూస్వాస్థ్యం అతని కూతుళ్ళకు వచ్చేలా చూడాలి.
9 అతనికి కూతుళ్ళు లేకపోతే అతని అన్నదమ్ములకు అతని స్వాస్థ్యం ఇవ్వాలి.
10 అతనికి అన్నదమ్ములు లేకపోతే అతని భూస్వాస్థ్యం అతని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వాలి.
11 అతని తండ్రికి అన్నదమ్ములు లేకపోతే అతని కుటుంబంలో అతని సమీప బంధువుకు అతని స్వాస్థ్యం ఇవ్వాలి. వాడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు. యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టు ఇది ఇశ్రాయేలీయులకు విధించిన శాసనం” అన్నాడు.
మోషే తరువాత యెహోషువ నాయకుడు
12 ఇంకా యెహోవా మోషేతో “నువ్వు ఈ అబారీము కొండెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశాన్ని చూడు.
13 నువ్వు దాన్ని చూసిన తరువాత, నీ సహోదరుడు అహరోను చేరినట్టు నువ్వు కూడా నీ సొంతవారితో చేరిపోతావు.
14 ఎందుకంటే, సీను ఎడారిలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల దగ్గర వారి కళ్ళ ఎదుట నన్ను ఘనపరచకుండా, నా మీద మీరు తిరగబడ్డారు” అన్నాడు. ఆ నీళ్లు సీను ఎడారిలో కాదేషులో ఉన్న మెరీబా నీళ్ళు.
15 అప్పుడు మోషే యెహోవాతో “యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, సమాజం కాపరి లేని గొర్రెల్లా ఉండకుండాా ఈ సమాజం మీద యెహోవా ఒకణ్ణి నియమించు గాక.
16 అతడు వారి ముందు వస్తూ, పోతూ,
17 వాళ్లకు నాయకుడుగా ఉండడానికి సమర్థుడుగా ఉండాలి” అన్నాడు.
18 అందుకు యెహోవా మోషేతో “నూను కొడుకు యెహోషువలో నా ఆత్మ నివసిస్తూ ఉంది. నువ్వు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి పెట్టి
19 యాజకుడైన ఎలియాజరు ఎదుట, సమాజమంతటి ఎదుట, అతని నిలబెట్టి, వారి కళ్ళ ఎదుట అతనికి ఆజ్ఞ ఇవ్వు.
20 ఇశ్రాయేలీయుల సమాజమంతా అతని మాట వినేలా నీ అధికారంలో కొంత అతని మీద పెట్టు.
21 యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలిచినప్పుడు అతడు యెహోవా సన్నిధిలో ఊరీము నిర్ణయం ద్వారా అతని కోసం అడగాలి. అతడు, అతనితోపాటు ఇశ్రాయేలీయులందరూ, అంటే, సమాజమంతా ప్రతి పని అతని మాట ప్రకారం చెయ్యాలి” అన్నాడు.
22 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు చేశాడు. అతడు యెహోషువను తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుట, సమాజమంతటి ఎదుట అతన్ని నిలబెట్టి,
23 అతని మీద తన చేతులు పెట్టి, యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు.