14
1 జ్ఞానం ఉన్న స్త్రీ తన ఇంటిని చక్కబెట్టుకుంటుంది. మూర్ఖురాలు చేతులారా తన కాపురం నాశనం చేసుకుంటుంది.
2 యెహోవాపట్ల భయం, భక్తి ఉన్నవాడు నిజాయితీగా మసులుకుంటాడు. కపటంగా ప్రవర్తించే వాడు ఆయనను తిరస్కరిస్తాడు.
3 మూర్ఖుల నోటిలో గర్వం అనే బెత్తం ఉన్నది. జ్ఞానం గలవారి నోటి నుంచి వచ్చే మాటలు వారిని కాపాడతాయి.
4 ఎద్దులు లేకపోతే కొట్లలో ధాన్యం ఉండదు. ఎద్దులు బలంగా ఉంటే అధిక రాబడి వస్తుంది.
5 నమ్మకమైన సాక్షి అబద్ధం పలకడు. కపట సాక్షికి అబద్ధాలు చెప్పడమే ఇష్టం.
6 బుద్ధిహీనుడు జ్ఞానం కోసం వెదికినా అది దొరకదు. తెలివిగలవాడు తేలికగా జ్ఞానం పొందుతాడు.
7 బుద్ధిహీనుడి దగ్గర మంచి మాటలు ఏమీ దొరకవు కనుక వాడితో స్నేహం చేయవద్దు.
8 వివేకం ఉన్నవారు తమ ప్రవర్తన విషయంలో జ్ఞానం కలిగి జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. బుద్ధి లేనివారు తమ మూర్ఖత్వంతో మోసపూరిత కార్యాలు జరిగిస్తారు.
9 మూర్ఖులు చేసే అపరాధ పరిహార బలి వారిని ఎగతాళి చేస్తుంది. యథార్థవంతులు ఒకరిపట్ల ఒకరు దయ కలిగి ఉంటారు.
10 ఎవడి హృదయంలో ఉండే దుఃఖం వాడికే తెలుస్తుంది. ఒకడి సంతోషంలో బయటి వ్యక్తి పాలు పొందలేడు.
11 దుర్మార్గుడి ఇల్లు నాశనం అవుతుంది. యథార్థవంతుల గుడారం స్థిరంగా నిలుస్తుంది.
12 ఒకడు తనకు నచ్చినదే సరియైనదిగా భావిస్తాడు. అయితే చివరికి అది నాశనానికి నడిపిస్తుంది.
13 ఒకడు బయటికి నవ్వుతో ఉన్నప్పటికీ హృదయంలో దుఃఖం ఉండవచ్చు. సంతోషం చివరికి శోకంగా మారిపోవచ్చు.
14 భక్తిహీనుడి మార్గాలు చివరికి వాడికే వెగటు కలుగుతాయి. మంచి వ్యక్తి తన ప్రవర్తన పట్ల సంతృప్తి చెందుతాడు.
15 తెలివితక్కువవాడు ప్రతి విషయాన్నీ నమ్ముతాడు. వివేకం గలవాడు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహిస్తాడు.
16 జ్ఞానం ఉన్నవాడు కీడుకు భయపడి దాని నుంచి దూరంగా వెళ్తాడు. మూర్ఖుడు అహంకారంతో భయం లేకుండా తిరుగుతాడు.
17 తొందరగా కోపం తెచ్చుకునేవాడు తన మూర్ఖత్వం ప్రదర్శిస్తాడు. చెడు ఆలోచనలు చేసేవాడు ద్వేషానికి గురౌతాడు.
18 బుద్ధిహీనులు తమ మూర్ఖత్వమే ఆస్తిగా కలిగి ఉంటారు. వివేకం ఉన్నవారు జ్ఞానాన్ని కిరీటంగా ధరించుకుంటారు.
19 చెడ్డవారు మంచివారి ఎదుట, భక్తిహీనులు నీతిమంతుల గుమ్మాల ఎదుట నిలబడతారు.
20 దరిద్రుణ్ణి వాడి పొరుగువాడే అసహ్యించుకుంటాడు. ధనవంతుణ్ణి ప్రేమించే వాళ్ళు చాలామంది.
21 పేదవారిని ఆదరించేవాడు ధన్యజీవి. తన పొరుగువాణ్ణి తిరస్కరించేవాడు పాపం చేసినట్టే.
22 కీడు తలపెట్టేవారు కూలిపోతారు. మేలు చేసే వారికి దయ, సత్యం ప్రాప్తిస్తాయి.
23 కష్టంతో కూడిన ఏ పని చేసినా ఫలితం దక్కుతుంది. వ్యర్ధమైన మాటలు దరిద్రానికి నడుపుతాయి.
24 ఐశ్వర్యం జ్ఞానులకు కిరీటం వంటిది. బుద్ధిహీనుల మూర్ఖత్వం వారికి మరింత మూర్ఖత్వం తెచ్చిపెడుతుంది.
25 నిజాలు పలికే సాక్షి మనుషులను కాపాడతాడు. అబద్ధాలు చెప్పేవాడు కేవలం మోసగాడు.
26 యెహోవాపట్ల భయం, భక్తి కలిగి ఉన్నవారు ఎంతో ధైర్యంగా ఉంటారు. వారి సంతానానికి ఆశ్రయం దొరుకుతుంది.
27 యెహోవా పట్ల భయభక్తులు జీవం కలిగించే ఊట. దాని మూలంగా వారు మరణం ఉచ్చుల్లో నుండి తప్పించు కుంటారు.
28 జనాభా పెరుగుదల రాజులకు ఘనత కలిగిస్తుంది. ప్రజల క్షీణత రాజుల పతనానికి కారణం.
29 వివేకం గలవాడు త్వరగా కోపం తెచ్చుకోడు. ముక్కోపికి మూర్ఖత్వమే బహుమతిగా దక్కుతుంది.
30 సాత్వికమైన మనస్సు శరీరానికి జీవం పెంచుతుంది. అసూయ ఎముకలు కుళ్ళిపోయేలా చేస్తుంది.
31 దరిద్రుణ్ణి కష్టపెట్టేవాడు వాడి సృష్టికర్త అయిన దేవుణ్ణి దూషించినట్టే. పేదవారిని ఆదరించేవాడు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు.
32 కీడు కలిగినప్పుడు తమ చెడ్డ పనుల వల్ల భక్తిహీనులు నశిస్తారు. నీతిమంతునికి సత్య సమయంలో కూడా ఆశ్రయం దొరుకుతుంది.
33 తెలివిగలవాడి హృదయంలో జ్ఞానం సుఖంగా నివసిస్తుంది. బుద్ధిహీనులు తమ మనసులో ఉన్నది తొందరగా బయటపెతారు.
34 ప్రజలు ఘనత పొందడానికి వారి న్యాయవర్తన కారణం అవుతుంది. అపరాధ ప్రవర్తన ప్రజలను అవమానాల పాలు చేస్తుంది.
35 తెలివి గల సేవకుడు రాజుల అభిమానం చూరగొంటాడు. అవమానం కలిగించే సేవకుడి పై రాజు కోప పడతాడు.