28
దావీదు కీర్తన.
యెహోవా, నేను నీకు మొరపెడుతున్నాను. నా ఆధారశిలా, నన్ను నిర్లక్ష్యం చెయ్యకు. నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే, నేను సమాధిలోకి దిగిపోయిన వాళ్ళలా అవుతాను.
నేను నీకు మొరపెట్టినపుడు, నీ పవిత్రాలయం వైపు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన స్వరం ఆలకించు.
దుర్మార్గులు, పాపులతోబాటు నన్ను ఈడ్చివేయకు. వాళ్ళు దురాలోచన హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వాళ్ళతో శాంతి మాటలు మాట్లాడతారు.
వాళ్ళ పనులను బట్టి, వాళ్ళ దుష్టక్రియలను బట్టి వాళ్లకు ఇవ్వాల్సింది ఇవ్వు. వాళ్ళ చేతి పనిని బట్టి వాళ్లకు చెల్లించు. తగిన సమయంలో వాళ్ళకు ఇవ్వు.
యెహోవా మార్గాలు, ఆయన చేతిపనులు వాళ్ళు అర్థం చేసుకోరు గనక ఆయన వాళ్ళను కూలదోసి, ఇంకెన్నడూ తిరిగి కట్టడు.
యెహోవా నా విజ్ఞాపన స్వరం ఆలకించాడు గనక ఆయనకు స్తుతి కలుగు గాక!
యెహోవా నా బలం, నా డాలు. నా హృదయం ఆయనలో నమ్మిక ఉంచుతుంది గనక నాకు సహాయం కలిగింది. కాబట్టి, నా హృదయం ఉప్పొంగి పోతుంది. కీర్తనలతో నేను ఆయనను స్తుతిస్తున్నాను.
యెహోవా తన ప్రజలకు బలం, ఆయన తన అభిషిక్తునికి రక్షణాశ్రయం.
నీ ప్రజలను రక్షించు. నీ వారసత్వాన్ని ఆశీర్వదించు. వాళ్లకు కాపరిగా ఉండి, శాశ్వతంగా వాళ్ళను ఎత్తుకుని నడిపించు.