27
సైనిక, పురపాలక అధికారులు
1 ప్రజాసంఖ్యను బట్టి ఇది ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబ పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు, వాళ్ళ లెక్క గురించినది. అంటే ఏర్పాటైన వంతుల విషయంలో ప్రతి సంవత్సరం, ప్రతి నెలా రాజుకు సేవ చేసిన వాళ్ళ గురించినది. వీళ్ళ సంఖ్య ఇరవై నాలుగు వేలు.
2 మొదటి నెల మొదటి గుంపు మీద జబ్దీయేలు కొడుకు యాషాబాము అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు.
3 పెరెజు సంతానంలో ఒకడు మొదటి నెలలో సైన్యాధిపతులకందరికీ అధిపతిగా ఉన్నాడు.
4 రెండో నెల వంతు అహోహీయుడైన దోదై, అతని గుంపుదీ అయింది. అతని గుంపులో మిక్లోతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
5 మూడో నెల యెహోయాదా కొడుకూ, సభాముఖ్యుడైన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరినవాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
6 ఈ బెనాయా ఆ ముప్ఫై మంది పరాక్రమశాలుల్లో ఒకడై ఆ ముప్ఫైమందికి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో అతని కొడుకు అమ్మీజాబాదు ఉన్నాడు.
7 నాలుగో నెల యోవాబు సహోదరుడు అశాహేలు నాలుగో అధిపతిగా ఉన్నాడు. అతని కొడుకు జెబద్యా అతని తరువాత అధిపతి అయ్యాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
8 అయిదో నెల ఇశ్రాహేతీయుడైన షంహూతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
9 ఆరో నెల తెకోవీయుడైన ఇక్కేషుకు పుట్టిన ఈరా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
10 ఏడో నెల ఎఫ్రాయిము సంతతివాడూ, పెలోనీయుడు అయిన హేలెస్సు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
11 ఎనిమిదో నెల జెరహీయుల బంధువూ, హుషాతీయుడు అయిన సిబ్బెకై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
12 తొమ్మిదో నెల బెన్యామీనీయుల బంధువూ, అనాతోతీయుడు అయిన అబీయెజెరు అధిపతిగా ఉన్నాడు, అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
13 పదో నెల జెరహీయుల బంధువూ, నెటోపాతీయుడు అయిన మహరై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
14 పదకొండో నెల ఎఫ్రాయిము సంతానం వాడూ, పిరాతోనీయుడు అయిన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
15 పన్నెండో నెల ఒత్నీయేలు బంధువూ, నెటోపాతీయుడు అయిన హెల్దయి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
ఇతర అధికారులు
16 ఇంకా, ఇశ్రాయేలీయుల గోత్రాల మీద ఉన్నవాళ్ళ వివరం, జిఖ్రీ కొడుకు ఎలీయెజెరు రూబేనీయులకు అధిపతిగా ఉన్నాడు, మయకా కొడుకు షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉన్నాడు,
17 కెమూయేలు కొడుకు హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉన్నాడు, సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉన్నాడు.
18 దావీదు సహోదరుల్లో ఎలీహు అనే ఒకడు యూదా వాళ్లకు అధిపతిగా ఉన్నాడు.
మిఖాయేలు కొడుకు ఒమ్రీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉన్నాడు,
19 ఓబద్యా కొడుకు ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉన్నాడు. అజ్రీయేలు కొడుకు యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉన్నాడు.
20 అజజ్యాహు కొడుకు హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉన్నాడు.
మనష్షే అర్థగోత్రం వాళ్లకు పెదాయా కొడుకు యోవేలు అధిపతిగా ఉన్నాడు.
21 గిలాదులో ఉన్న మనష్షే అర్థగోత్రం వాళ్లకు జెకర్యా కొడుకు ఇద్దో అధిపతిగా ఉన్నాడు. బెన్యామీనీయులకు అబ్నేరు కొడుకు యహశీయేలు అధిపతిగా ఉన్నాడు.
22 దానీయులకు యెరోహాము కొడుకు అజరేలు అధిపతిగా ఉన్నాడు. వీళ్ళు ఇశ్రాయేలు గోత్రాలకు అధిపతులు.
23 ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా చేస్తానని యెహోవా చెప్పాడు గనుక ఇరవై సంవత్సరాలు మొదలుకుని, అంతకు తక్కువ వయస్సు ఉన్నవాళ్ళను దావీదు ప్రజాసంఖ్యలో చేర్చలేదు.
24 ప్రజాసంఖ్య చూసే విషయంలో ఇశ్రాయేలీయుల మీదికి ఉగ్రత వచ్చిన కారణంగా సెరూయా కొడుకు యోవాబు దాన్ని చెయ్యడం ఆరంభించాడు గాని దాన్ని ముగించలేదు. కాబట్టి ప్రజాసంఖ్య మొత్తం దావీదు రాజు వృత్తాంత గ్రంథాల్లో చేర్చలేదు.
25 రాజు గిడ్డంగుల మీద అదీయేలు కొడుకు అజ్మావెతు నియామకం జరిగింది.
అయితే పొలాల్లో, పట్టణాల్లో గ్రామాల్లో, దుర్గాల్లో ఉన్న ఆస్తి మీద ఉజ్జియా కొడుకు యెహోనాతాను నియామకం జరిగింది.
26 పొలాల్లో పనిచేసే వాళ్ళ మీద, భూమి దున్నే వాళ్ళ మీద కెలూబు కొడుకు ఎజ్రీ నియామకం జరిగింది.
27 ద్రాక్షతోటల మీద రామాతీయుడైన షిమీ, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షామధురసం నిలువ చేసే కొట్ల మీద షిష్మీయుడైన జబ్ది నియామకం జరిగింది.
28 షెఫేలా ప్రదేశంలో ఉన్న ఒలీవ చెట్ల మీద, మేడిచెట్ల మీద గెదేరీయుడైన బయల్ హనాను నియామకం జరిగింది.
నూనె కొట్ల మీద యోవాషు నియామకం జరిగింది.
29 షారోనులో మేసే పశువుల మీద షారోనీయుడైన షిట్రయి, లోయల్లో ఉన్న పశువుల మీద అద్లయి కొడుకు షాపాతు నియామకం జరిగింది.
30 ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలు, గాడిదల మీద మేరోనోతీయుడైన యెహెద్యాహు నియామకం జరిగింది.
31 గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియామకం జరిగింది. వీళ్ళందరూ దావీదు రాజు ఆస్తి మీద నియమించిన అధిపతులు.
32 దావీదు పినతండ్రి యోనాతాను వివేకం కలిగిన ఆలోచనకర్తగా ఉన్నాడు గనుక అతన్ని ప్రధానమంత్రిగా నియమించారు.
హక్మోనీ కొడుకు యెహీయేలు రాకుమారుల దగ్గర ఉండడానికి నియమించారు.
33 అహీతోపెలు రాజుకు మంత్రి.
అర్కీయుడైన హూషై రాజుకు అంతరంగిక సలహాదారు.
34 అహీతోపెలు చనిపోయిన తరువాత బెనాయా కొడుకు యెహోయాదా, అబ్యాతారు మంత్రులయ్యారు.
రాజు సేనకు యోవాబు సర్వసైన్యాధ్యక్షుడు.