11
రెహబాము నిర్మించిన ప్రాకారాలు
1 రెహబాము యెరూషలేముకు వచ్చిన తరవాత అతడు ఇశ్రాయేలు వారితో యుద్ధం చేసి, రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోడానికి యూదావారిలో నుండీ బెన్యామీనీయుల్లో నుండీ ఎన్నిక చేసిన 1, 80,000 మంది సైనికులను సమకూర్చాడు.
2 అయితే దేవుని మనిషి షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు,
3 “నువ్వు వెళ్ళి యూదారాజు, సొలొమోను కొడుకు అయిన రెహబాముతో, యూదాలో, బెన్యామీనీయుల ప్రాంతంలో ఉండే ఇశ్రాయేలు వారందరితో ఈ మాట చెప్పు,
4 ‘ఇదంతా ఈ విధంగా జరిగేలా చేసింది నేనే’ అని యెహోవా సెలవిస్తున్నాడు కాబట్టి మీ ఉత్తరలో ఉన్న యూదా సోదరులతో యుద్ధం చేయడానికి బయలు దేరకుండా మీరంతా మీ మీ ఇళ్ళకి తిరిగి వెళ్ళండి.” కాబట్టి వారు యెహోవా మాట విని యరొబాముతో యుద్ధం చేయడం మానేసి తిరిగి వెళ్లిపోయారు.
5 రెహబాము యెరూషలేములో నివాసముండి యూదా ప్రాంతంలో పురాలకు ప్రాకారాలు కట్టించాడు.
6 అతడు బేత్లెహేము, ఏతాము, తెకోవ,
7 బేత్సూరు, శోకో, అదుల్లాము,
8 గాతు, మారేషా, జీఫు,
9 అదోరయీము, లాకీషు, అజేకా,
10 జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అనే యూదా, బెన్యామీను ప్రదేశాల్లో ప్రాకారాలు కట్టించాడు.
11 అతడు కోట దుర్గాలను దృఢంగా చేసి, వాటిలో సైన్యాధికారులను ఉంచి, వారికి ఆహారం, నూనె, ద్రాక్షారసం ఏర్పాటు చేశాడు.
12 వాటిలో డాళ్ళు, శూలాలు ఉంచి ఆ పట్టణాలను శక్తివంతంగా తయారు చేశాడు. యూదా వారు, బెన్యామీనీయులు అతని వైపు నిలబడ్డారు.
13 ఇశ్రాయేలువారి మధ్య నివసిస్తున్న యాజకులు, లేవీయులు తమ ప్రాంతాల సరిహద్దులు దాటి అతని దగ్గరికి వచ్చారు.
14 యరొబాము, అతని కుమారులు యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయడం వలన వారు తమ గ్రామాలూ, ఆస్తులూ విడిచిపెట్టి, యూదా దేశానికి, యెరూషలేముకు వచ్చారు.
15 యరొబాము బలిపీఠాలకు దయ్యాలకు తాను చేయించిన దూడవిగ్రహాలకు యాజకులను నియమించుకున్నాడు.
16 ఇలా ఉండగా ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో తమ దేవుడైన యెహోవాను వెదకడానికి తమ మనస్సులో నిర్ణయించుకున్నవారు కొందరు ఉన్నారు. వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు బలులర్పించడానికి యెరూషలేముకు వచ్చారు.
17 వారు మూడు సంవత్సరాలు దావీదు, సొలొమోను నడిచిన మార్గాన్నే అనుసరించారు. ఆ మూడు సంవత్సరాలూ వారు యూదా రాజ్యాన్ని బలపరచి సొలొమోను కొడుకు రెహబాముకు సహాయం చేశారు.
రెహబాము కుటుంబం
18 దావీదు కొడుకు యెరీమోతు కుమార్తె అయిన మహలతును రెహబాము వివాహం చేసుకున్నాడు. ఆమె తల్లి యెష్షయి కొడుకు ఏలీయాబు కుమార్తె అయిన అబీహాయిలు.
19 అతనికి యూషు, షెమర్యా, జహము అనే కొడుకులు పుట్టారు.
20 తరవాత అతడు అబ్షాలోము కుమార్తె మయకాను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె ద్వారా అతనికి అబీయా, అత్తయి, జీజా, షెలోమీతులు పుట్టారు.
21 రెహబాముకు 18 మంది భార్యలు 60 మంది ఉపపత్నులు ఉన్నారు. అతనికి 28 మంది కుమారులు, 60 మంది కుమార్తెలు ఉన్నారు. అయితే తన భార్యలందరిలో ఉపపత్నులందరిలో అబ్షాలోము కుమార్తె మయకాను అతడు ఎక్కువగా ప్రేమించాడు.
22 రెహబాము మయకాకు పుట్టిన అబీయాను రాజుగా చేయాలని ఆలోచించి, అతని సోదరుల మీద ప్రధానిగా, అధిపతిగా అతణ్ణి నియమించాడు.
23 అతడు మంచి మెలకువతో పరిపాలించాడు. తన కుమారుల్లో మిగిలిన వారిని అతడు యూదా, బెన్యామీనులకు చెందిన ప్రదేశాల్లోని ప్రాకార పురాల్లో అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన ఆస్తినిచ్చి వారికి పెళ్ళిళ్ళు చేశాడు.