19
1 యూదారాజు యెహోషాపాతు క్షేమంగా యెరూషలేములోని తన ఇంటికి తిరిగి వచ్చాడు.
2 దీర్ఘ దర్శి, హనానీ కొడుకు అయిన యెహూ అతనిని కలుసుకొనడానికి వెళ్లి, యెహోషాపాతు రాజుకు ఇలా తెలియచేశాడు. “నువ్వు దుర్మార్గులకు సహాయం చేస్తావా? యెహోవాను ద్వేషించే వారిని నువ్వు ప్రేమిస్తావా? దాన్ని బట్టి నీ మీద యెహోవా కోపం ఉంది.
3 అయితే, నీలో కొంత మంచి కనిపిస్తూ ఉంది. దేశంలోనుంచి నువ్వు అషేరా దేవతాస్తంభాలను తీసివేసి దేవుని దగ్గర కనిపెట్టడానికి నీ మనస్సు నిలుపుకున్నావు.”
యెహోషాపాతు న్యాయాధిపతులను ఏర్పరచాడు
4 యెహోషాపాతు యెరూషలేములో నివసించాడు. బెయేర్షెబా నుంచి ఎఫ్రాయిము కొండ ప్రాంతం వరకూ ఉన్న ప్రజల దగ్గరికి తిరిగి వెళ్లి, వారి పూర్వీకుల దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్ళించాడు.
5 యూదాలో ప్రాకారాలున్న పట్టణాలన్నిటిలో అతడు న్యాయాధిపతులను ఏర్పరచాడు.
6 అతడు న్యాయాధిపతులతో ఇలా చెప్పాడు. “మీరు ఏమి చేయాలో జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకంటే మీరు మనుషుల కోసం కాదు, యెహోవా కోసమే తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చే పనిలో ఆయన మీతో ఉంటాడు.
7 యెహోవా భయం మీమీద ఉండు గాక. తీర్పు తీర్చేటపుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మన దేవుడైన యెహోవాలో ఏ దోషం లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకొనేవాడు కాడు.”
8 యెహోవా నిర్ణయించిన న్యాయాన్ని జరిగించడానికి, వివాదాలను పరిష్కరించడానికి యెహోషాపాతు లేవీయుల్లో యాజకుల్లో ఇశ్రాయేలీయుల పూర్వీకుల ఇంటి పెద్దల్లో కొందరిని యెరూషలేములో కూడా నియమించాడు. వారు యెరూషలేములో నివసించారు.
9 వారికి ఇలా ఆజ్ఞాపించాడు. “యెహోవా మీద భయభక్తులు కలిగి, నమ్మకంతో, యథార్థ మనస్సుతో మీరు ప్రవర్తించాలి.
10 నరహత్య గురించి, ధర్మశాస్త్రం గురించి, ధర్మం గురించి, కట్టడలను గురించి న్యాయవిధులను గురించి, వివిధ పట్టణాల్లో నివసించే మీ సోదరులు తీసుకొచ్చే ఏ విషయమైనా మీరు విచారించేటప్పుడు మీమీదికీ మీ సోదరుల మీదికీ యెహోవా కోపం రాకుండా వారు యెహోవా దృష్టిలో ఏ పాపం చేయకుండా వారిని హెచ్చరించాలి. ఇలా చేస్తే మీరు అపరాధులు కాకుండా ఉంటారు.
11 ప్రధానయాజకుడు అమర్యా యెహోవాకు సంబంధించిన అన్ని విషయాలను కనిపెట్టడానికి మీ మీద అధికారిగా ఉంటాడు. యూదా సంతతివారికి అధిపతి, ఇష్మాయేలు కొడుకు జెబద్యా, రాజు సంగతుల విషయంలో మీ మీద అధికారిగా ఉన్నాడు. లేవీయులు మీకు సేవ చేసే అధికారులుగా ఉన్నారు. ధైర్యంతో పనిచేయండి. మేలు చేయడానికి యెహోవా మీతో ఉంటాడు.”