21
యూదా రాజైన యెహోరాము
21:5-10, 20; 2రాజులు 8:16-24
యెహోషాపాతు చనిపోయినప్పుడు తన పూర్వీకులతో పాటు అతణ్ణి దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని కొడుకు యెహోరాము అతని బదులు రాజయ్యాడు. యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫట్య అనేవారు ఇతనికి సోదరులు. వీరంతా ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు కొడుకులు. వారి తండ్రి బహుమానాలుగా, వెండి, బంగారం ఇంకా ఎన్నో విలువైన వస్తువులను, యూదాదేశంలో గోడలున్న పట్టణాలను వారికిచ్చాడు. అయితే యెహోరాము తనకు పెద్ద కొడుకు కాబట్టి అతనికి రాజ్యాన్ని ఇచ్చాడు.
యెహోరాము తన తండ్రి రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టి తన అధికారం సుస్థిరం చేసుకున్న తరువాత తాను స్థిరపడి, తన సోదరులందరినీ ఇశ్రాయేలీయుల అధిపతుల్లో కొంత మందినీ చంపేసాడు. యెహోరాము పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతనికి 32 ఏళ్ళు. అతడు యెరూషలేములో 8 ఏళ్ళు పాలించాడు. అతడు అహాబు కూతుర్ని పెళ్లి చేసుకుని, అహాబు సంతతివారు నడచిన ప్రకారం ఇశ్రాయేలు రాజుల పద్ధతుల్లో నడిచాడు. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించాడు. అయినా యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన బట్టి, అతనికీ అతని కుమారులకూ ఎప్పుడూ జీవమిస్తానని చేసిన వాగ్దానం కోసం దావీదు సంతతిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు.
యెహోరాము రోజుల్లో యూదా రాజుల అధికారానికి వ్యతిరేకంగా ఎదోమీయులు తిరుగుబాటు చేసి తమకు ఒక రాజును ఉంచుకున్నారు. యెహోరాము తన అధికారులను వెంటబెట్టుకుని, తన రథాలన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తనను చుట్టుముట్టిన ఎదోమీయులనూ రథాధిపతులను చంపేసాడు. 10 కాబట్టి ఇప్పటి వరకూ ఎదోమీయులు యూదావారి అధికారం కింద ఉండక తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. యెహోరాము తన పూర్వీకుల దేవుడైన యెహోవాను విస్మరించినందుకు అదే సమయంలో లిబ్నా పట్టణం కూడా అతని అధికారం కింద ఉండకుండాా తిరుగుబాటు చేసింది. 11 యెహోరాము యూదా కొండల్లో బలిపీఠాలు కట్టించి యెరూషలేము నివాసులు వేశ్యలా ప్రవర్తించేలా చేశాడు. ఈ విధంగా అతడు యూదావారిని తప్పుదారి పట్టించాడు.
12 ఏలీయా ప్రవక్త నుంచి ఒక ఉత్తరం యెహోరాముకు వచ్చింది. దానిలో ఇలా ఉంది. “నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు. ‘నీవు నీ తండ్రియైన యెహోషాపాతు మార్గాల్లో గానీ యూదారాజు ఆసా మార్గాల్లో గానీ నడుచుకోకుండా 13 ఇశ్రాయేలు రాజుల మార్గాల్లో నడచి అహాబు సంతతివారు చేసిన ప్రకారం యూదానూ యెరూషలేము నివాసులనూ వ్యభిచరింపజేసి, నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతానమైన నీ సోదరులను చంపావు. 14 కాబట్టి గొప్ప తెగులుతో యెహోవా నీ ప్రజలనూ నీ పిల్లలనూ నీ భార్యలనూ నీ సంపదనంతటినీ దెబ్బ తీస్తాడు. 15 నీవు పేగుల్లో ఘోరమైన జబ్బుతో రోగిష్టిగా ఉంటావు. రోజురోజుకూ ఆ జబ్బుతో నీ పేగులు చెడిపోతాయి.’ ”
16 యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయులను, ఇతియోపియాకు దగ్గరగా ఉన్న అరబీయులను రేపాడు. 17 వారు యూదాదేశంపై దాడి చేసి దానిలో చొరబడి రాజనగరులో దొరికిన సంపదనంతా, అతని కొడుకులనూ భార్యలనూ పట్టుకెళ్ళారు. అతని కొడుకుల్లో చివరి వాడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కొడుకును కూడా విడిచిపెట్టలేదు.
18 ఇదంతా జరిగిన తరువాత యెహోవా అతని కడుపులో నయం కాని జబ్బు కలిగించాడు. 19 రెండేళ్ళ తరువాత ఆ జబ్బు ముదిరి అతని పేగులు చెడిపోయి దుర్భరంగా చనిపోయాడు. అతని ప్రజలు అతని పూర్వీకులకు చేసిన అంత్యక్రియలు అతనికి చేయలేదు. 20 అతడు పరిపాలన చేయడం మొదలుపెట్టినప్పుడు 32 ఏళ్లవాడు. యెరూషలేములో 8 ఏళ్ళు పాలించి చనిపోయాడు. అతని మృతికి ఎవరూ విలపించలేదు. రాజుల సమాధుల్లో గాక దావీదు పట్టణంలో వేరే చోట ప్రజలు అతణ్ణి పాతిపెట్టారు.